
బౌద్ధమతాన్ని తార్కికంగా వివరించిన ప్రముఖ ఆచార్యుల్లో ధర్మకీర్తి ఒకడు. నలందా విశ్వవిద్యాలయంలో ఆచార్య ధర్మపాలునికి శిష్యుడై విద్యను ఆర్జిం భిక్షువయ్యాడు. దేశమంతా పర్యటించి అనేక చర్చల్లో, సదస్సుల్లో, సమావేశాల్లో పాల్గొన్నాడు. వాదంలో ధర్మ కీర్తిచే ఓడింపబడినవారు తమ ఓటమిని హుందాగా అంగీకరించకపోగా అవమానించడానికి పూనుకున్నారు. ఆయన రంన తాళపత్ర గ్రంథాలను సేకరిం, వాటిని కట్టగా కట్టి, కుక్క తోకకు ముడివేసి ఆ కుక్క పరుగులు తీసేట్టు దాన్ని గట్టి గట్టిగా కేకలు వేశారు. భయంతో ఆ కుక్క విచ్చలవిడిగా అటూ, ఇటూ పరుగులు పెట్టింది. దాని తోకకు కట్టిన ధర్మకీర్తి రచనలున్న తాళ పత్రాలు చిందరవందరై గాలి వీచి అన్ని దిక్కులకు ఎగిరిపోయాయి.
ఆ దృశ్యాన్ని చూసి ధర్మ కీర్తి ప్రత్యర్థులు పగలబడి నవ్వుతూ ధర్మకీర్తిని హేళన చేసి, చులకనగా మాట్లాడారు. ఈ దెబ్బకు ఆయన దిగులు పడి కాళ్ళ బేరానికి వస్తాడని వారు ఆశించారు. కానీ ఆయన చాలా ప్రశాంతంగా, ‘ఈనాడు, ఈ నా గ్రంథాలు ఎలాగైతే అన్ని దిక్కులకు ఎగిరిపోతున్నవో, అలాగే ఒక నాటికి నా భావాలు, నా కీర్తి దశ దిశలకు వ్యాపించి తీరుతుంది’ అన్నాడు. అది అక్షరాలా నిజమైంది. ధర్మమే జయించింది. సత్యమే గెలిచింది.
టిబెట్‌లో నేటికీ బౌద్ధ భిక్షువులు ధర్మకీర్తి రచనలను పరమ ప్రామాణికమైనవిగా భావించి ఆయనను గౌరవిస్తారు. రాహుల్ సాంకృత్యాయన్ ధర్మకీర్తిని శ్లాఘిస్తూ ‘విమర్శనాత్మకమైన వాదనా పటిమలోనూ, విస్పష్టమైన విశ్లేషణలోనూ, స్పష్టమైన భావుకతలోనూ ఆయనను మించిన వారు లేరు’ అంటారు. ‘న్యాయ బిందు’, ‘హేతుబిందు’ వంటి ఎనిమిది గ్రంథాలు ధర్మకీర్తి కీర్తి ప్రతిష్ఠలను గగనానికి చేర్చాయి.
– రాచమడుగు శ్రీనివాసులు