
నెల్లూరులో జరిగిన ‘యువత పోరు’ ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, యువత , అనంతపురంలో..
వైఎస్ జగన్ పిలుపుతో కదంతొక్కిన విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు
తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్
ఎన్నికల హామీ మేరకు నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాల్సిందేనంటూ యువత గర్జన
బాబు సర్కారు వేధింపులు, పోలీసుల బెదిరింపులకు వెరవకుండా బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు
అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు వైఎస్సార్‌సీపీ యువత పోరు ర్యాలీలు
డిమాండ్లపై విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు
పది నెలల బాబు సర్కారు పాలనపై పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతకు ‘యువత పోరు’ ర్యాలీలు అద్దం పట్టాయంటున్న రాజకీయ పరిశీలకులు
రైతు పోరు.. విద్యుత్ చార్జీల బాదుడుపై నిరసన తరహాలోనే యువత పోరు సక్సెస్‌తో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
సాక్షి, అమరావతి: ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించకుండా తమను చదువులకు దూరం చేస్తున్న చంద్రబాబు సర్కారు కుట్రలపై విద్యార్థులు తిరగబడ్డారు. తమ బిడ్డల భవిష్యత్ కోసం తల్లితండ్రులు గర్జించారు. 20 లక్షల ఉద్యోగాలు.. లేదంటే నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతిగా ఇస్తామని నమ్మించి నట్టేట ముంచడంపై యువత పిడికిలి బిగించింది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘యువత పోరు’కు మండుటెండలోనూ వెల్లువలా తరలివచ్చారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులను రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డగించి బెదిరింపులకు దిగినా వెరవలేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో బుధవారం వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ‘యువత పోరు’ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు చేపట్టిన ప్రదర్శనలు, బైక్ ర్యాలీల్లో వేలాదిగా విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు కదం తొక్కారు.
తక్షణమే గతేడాదికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద గతేడాదికి సంబంధించి కూటమి ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.3,200 కోట్లు.. ఈ ఏడాది ఇవ్వాల్సిన రూ.3,900 కలిపి మొత్తం రూ.7,100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఈ బడ్జెట్‌లో కేవలం రూ.2,600 కోట్లే కేటాయించడంపై మండిపడ్డారు.
పిల్లలను చదువులకు దూరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ.. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందకుండా చేయడమే కాకుండా వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడ్డారు.
అనంతపురంలో జరిగిన ‘యువత పోరు’ ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు
చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక డీఎస్సీపై చేసిన తొలి సంతకమే మోసంగా మారిందని.. జాబ్ క్యాలెండర్ విడుదల లేదు.. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలనే ఊడబెరుకుతున్నారంటూ ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి కోసం గతేడాది బడ్జెట్‌లో ఒక్క పైసా కేటాయించలేని.. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు ర్యాలీల్లో నినదించారు. ఈమేరకు డిమాండ్లతో కూడిన పత్రాలను విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులతో కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు కలెక్టర్లకు అందజేశారు. మండుటెండను కూడా లెక్క చేయకుండా వేలాదిగా విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు ‘యువత పోరు’లో కదం తొక్కడం పది నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం పాలనపై పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకతకు అద్దం పట్టిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గతేడాది డిసెంబర్ 13న అన్నదాతలపై సమస్యలపై నిర్వహించిన రైతు పోరు.. డిసెంబర్ 27న కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టిన విద్యుత్ పోరు తరహాలోనే యువత పోరు గ్రాండ్ సక్సెస్ కావడం వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment