'టెన్‌'షన్‌ వద్దు | Sakshi
Sakshi News home page

'టెన్‌'షన్‌ వద్దు

Published Fri, Mar 15 2019 11:32 AM

Tenth Exams From Tomorrow No Minit Late Rules - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: పదో తరగతి పరీక్షలకు గ్రేటర్‌లో సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు.. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే, ఈసారి ‘నిమిషం ఆలస్యం’ నిబంధనను ఈసారి తొలగించారు. నిర్దేశిత సమయం దాటిన తర్వాత మరో ఐదు నిమిషాల వరకు అనుమతించడం విద్యార్థులకు ఊరటనిచ్చే అంశం. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో మొత్తం 1,71,731 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.  పరీక్షల సమయంలో విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా దక్షిణ మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు జలమండలి ఆయా కేంద్రాలకు ఉచితంగా తాగునీరు సరఫరా చేయనుంది. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఐడీకార్డు, హాల్‌టికెట్‌ చూపించి ఆయా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

రంగంలోకి 40 ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌  
హైదరాబాద్‌ జిల్లాలో 81,785 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా, వీరి కోసం 373 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4 వేలకుపైగా ఇన్విజిలేటర్లను నియమించారు. 21 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లాలో 45,503 మంది విద్యార్థుల కోసం 205 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. 2,480 మంది ఇన్విజిలేటర్లు సహా పది ప్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను సిద్ధం చేశారు. మేడ్చల్‌ జిల్లాలో 44,443 మంది పరీక్షకు హాజరువుతుండగా, వీరి కోసం 191 పరీక్ష కేంద్రాలు, 2,600 మంది ఇన్విజిలేటర్లు, ఎనిమిది ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను సిద్ధం చేశారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ సహా ఏ ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించబోమని, విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించనున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు
పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పోలీసులు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు. అంతేకాదు ఆయా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్‌ సెంటర్లను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా విద్యార్థులను ఉదయం 8.30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. 9.45 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించబోమని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఒకరోజు ముందే తమ పరీక్ష కేంద్రానికి చేరుకుని, ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 

నేటి నుంచి ఒంటిపూట బడులు
వేసవి ఎండలు ముదరడంతో శుక్రవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పదో తరగతి పరీక్ష కేంద్రం ఉన్న స్కూల్లో మధ్యాహ్నం ఒకటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. సెంటర్‌ లేని చోట మాత్రం ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు ఉంటాయి.  

ఉత్తీర్ణత పెంపునకు ప్రత్యేక కార్యాచరణ
సాక్షి,మేడ్చల్‌ జిల్లా: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణను ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అమలు చేసింది. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలతో పాటు పదికి పది పాయింట్లు సాధించిన విద్యార్థులకు పారితోషకం, ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందజేస్తామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అదేవిధంగా జిల్లా మంత్రి చామకూర మల్లారెడ్డి కూడా పదోతరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులకు బహుమతులను ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పదికి పది జీపీఏ సాధిస్తే రూ.25 వేలు బహుమతిగా అందజేస్తానని మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. అలాగే వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేలు నగదుతో పాటు ఆ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఉత్తీర్ణత శాతం పుంపునకు ఉపాధ్యాయులు, విద్యార్థులోను పట్టుదల పెరిగింది. 2016–17 విద్యా సంవత్సరంలో జిల్లాలో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 85 కాగా, 2017–18లో 94 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది నూరు శాతం సాధించాలని పట్టుదలతో ఉన్నారు.  

Advertisement
 
Advertisement