సడక్‌ బంద్‌లో ఉద్రిక్తత

Tension in sadak bandh - Sakshi

వరంగల్‌–కరీంనగర్‌ రహదారిలోని ఎల్కతుర్తిలో ఆందోళన  

కోదండరాం, చాడ, రైతు సంఘాల నేతల అరెస్టు  

భీమదేవరపల్లి/హసన్‌పర్తి/ఖమ్మం మయూరిసెంటర్‌ :   రైతు సమస్యలపై టీజేఎస్, వామపక్షాలు, రైతు సంఘాల పిలుపు మేరకు గురువారం వరంగల్‌–కరీంనగర్‌ రహదారిలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో సడక్‌బంద్‌  చేపట్టారు.  ఈ కార్యక్రమం మూడు గంటల పాటు కొనసాగింది.  రోడ్డుకు ఇరువైపులా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఇతర రైతు సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగింది.

ఉద్రిక్తత నెలకొంది. కోదండరాం, చాడ  మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రైతులతోనే పతనం ప్రారంభమైందన్నారు. రైతు బంధు పథకం రాబందు పథకంగా మారిందని విమర్శించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే అవినీతిని నిరూపిస్తామని స్పష్టం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర చెల్లించకుండా  రైతులను మోసం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అసలు పెట్టుబడి పథకంతో రైతులకు ప్రయోజనం లేదన్నారు.

పోడు, కౌలు, అటవీ భూములకు సైతం రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని, తప్పులు దొర్లిన రికార్డులను వారం రోజుల్లో సరి చేసి పథకాన్ని అమలు చేయాలని, రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని వారు డిమాండ్‌ చేశారు.  ఖమ్మంలోని రాపర్తినగర్‌ బైపాస్‌ రోడ్డును ఆందోళనకారులు దిగ్బంధనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ, భద్రాచలం, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.  

‘ఈటల’ వాహనాన్ని అడ్డుకున్న నిరసనకారులు  
గీసుకొండ మండలం మచ్చాపూర్‌ వద్ద వరంగల్‌–నర్సంపేట రహదారిపై  మంత్రి ఈటల రాజేందర్‌ వెళ్తున్న కారుతో పాటు కాన్వాయ్‌ని ఆందోళన కారులు అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి గీసుకొండ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top