‘సొరంగం’ మారింది

Tenders For Tunnel Route In Hyderabad - Sakshi

ఇనార్బిట్‌– చిత్రపురి కాలనీ మార్గం ఆలస్యం

మారిన ప్రతిపాదనలు ఈపీసీ పద్ధతిలో టెండర్లకు నిర్ణయం

ఆమోదించిన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ

కొత్త విధానానికి మరికొంత సమయం

జీహెచ్‌ఎంసీ నెత్తిన రూ.875 కోట్ల భారం

ఇనార్బిట్‌ మాల్‌ నుంచి చిత్రపురి కాలనీ వరకు సొరంగ మార్గంతో సహా నిర్మించనున్న రోడ్‌ కనెక్టివిటీ పనుల టెండర్లను ఈపీసీ పద్ధతిలో పిలిచేందుకు సిద్ధమయ్యారు. తొలుత యాన్యుటీ పద్ధతిలో టెండర్లు పిలవాలని నిర్ణయించిన అధికారులు.. అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించారు. అయితే గురువారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఈపీసీ పద్ధతికి ఆమోదం తెలిపారు.

సాక్షి, సిటీబ్యూరో: ఇనార్బిట్‌ మాల్‌ నుంచి చిత్రపురి కాలనీ వరకు సొరంగమార్గంతో సహ నిర్మించనున్న రోడ్‌ కనెక్టివిటీ పనుల టెండర్లను ఈపీసీ పద్ధతిలో పిలవాలిచేందుకు సిద్ధమయ్యారు. తొలుత ఈ పనుల కోసం యాన్యుటీ పద్ధతిలో టెండర్లు పిలిచేందుకు అన్నీ సిద్ధం చేసిన అధికారులు అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించారు. రేపో మాపో అనుమతి రాగానే ఇక టెండర్లు పిలవాలనుకుంటున్న తరుణంలో ఈపీసీలో టెండర్లు పిలిచేందుకు గురువారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయం ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించింది. దీంతో టెండర్ల ప్రక్రియకు మరికొంత జాప్యం జరగనుంది. అంతేకాదు.. ఈపీసీ పద్ధతిలో నిర్మించేందుకు సిద్ధం కావడంతో ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం నిధుల్ని జీహెచ్‌ఎంసీయే భరించాల్సి ఉంది. అంటే.. జీహెచ్‌ఎంసీ నెత్తిన మరో రూ.875 కోట్ల భారం పడనుంది. యాన్యుటీ పద్ధతిలో అయితే కాంట్రాక్టు పొందే సంస్థే తొలుత పెట్టుబడి పెడుతుంది. నిర్ణీత వ్యవధుల్లో దానికి చెల్లింపులు చేస్తారు. అలా తొలుత ఇనార్బిట్‌ మాల్‌ నుంచి ఫీనిక్స్‌ జంక్షన్‌ వరకు పనులు చేయాలనుకున్నారు. అందుకు దాదాపు రూ.1535 కోట్లు ఖర్చు కానుందని అంచనా. ఆమేరకు  ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునేలోగా ఈ ప్రాజెక్టును యాన్యుటీ స్థానే ఈపీసీ పద్ధతిలో చేపట్టాలని ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ సూచించారు. అందుకనుగుణంగా స్టాండింగ్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

సొరంగ మార్గం లెక్క ఇదీ..  
ఈ ప్రాజెక్టులో భాగంగా ఇనార్బిట్‌ మాల్‌ వైపు నుంచి ఖాజాగూడ జంక్షన్‌ వరకు సొరంగ మార్గం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెండు సొరంగ మార్గాలు ఒక్కొక్కటి నాలుగు లేన్ల  క్యారేజ్‌వేలతో ఏర్పాటు చేస్తారు. సొరంగం పొడవు 502.91 మీటర్లు. దీని అంచనా వ్యయం రూ. 215 కోట్లు. 

మారిన ప్రణాళిక..
ఖాజాగూడ నుంచి ఓఆర్‌ఆర్‌ దాటి విప్రో జంక్షన్‌ వైపు ఫీనిక్స్‌ రోడ్‌ వరకు సాఫీ ప్రయాణానికి రూపొందించిన ప్రణాళికలో మార్పు చేశారు. చిత్రపురి కాలనీ వరకు రూ.875 కోట్లతో పూర్తవుతుందని అంచనా వేశారు. ఇందులో రూ.100 కోట్లు భూసేకరణకు ఖర్చు కానుంది. రూ.875 కోట్లే కనుక యాన్యుటీ అవసరం లేదని మంత్రి అభిప్రాయపడిన నేపథ్యంలో తాజాగా ఈపీసీకి సిద్ధమయ్యారు.  
ఎస్సార్‌డీపీలో భాగంగా రూ.2631 కోట్లతో 18 జంక్షన్ల వద్ద మల్టీ లెవెల్‌ ఫ్లై ఓవర్లు తదితర పనులకు తొలుత యాన్యుటీ విధానంలోనే టెండర్లు పిలిచారు. కానీ కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాకపోవడంతో వాటిని రద్దు చేసి వెయ్యికోట్ల మేర పనుల్ని ఈపీసీ విధానంలో పిలిచారు. ప్రస్తుతం ఆ పనులు పురోగతిలో ఉన్నాయి.
ఎస్సార్‌డీపీ పనులకు అవసరమైనన్ని నిధులు జీహెచ్‌ఎంసీ వద్ద లేకపోవడంతో బాండ్ల ద్వారా వెయ్యి కోట్లు సేకరించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా తొలివిడత రూ. 200 కోట్లు సేకరించారు. అవి దాదాపుగా ఖర్చయ్యాయి. మలివిడతగా మరో రూ.200 కోట్లు బాండ్ల ద్వారా సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు కూడా నిధుల్ని సేకరించాల్సి రావడంతో జీహెచ్‌ఎంసీపై భారం పెరగనుంది. నిధులు సేకరించినా తిరిగి ఎలా చెల్లిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. 

ప్రాజెక్టులోని ముఖ్యమైన పనులు ఇవే..
దుర్గం చెరువు కేబుల్‌ స్టే బ్రిడ్జి కింద జంక్షన్‌ను అభివృద్ధి చేస్తారు. అక్కడి నుంచి టన్నెల్‌ వైపు  రహదారిపై ఆయా ప్రాంతాల్లో ఫ్లై ఓవర్‌ నిర్మాణం
టన్నెల్‌ వైపు నుంచి కేబుల్‌ స్టే బ్రిడ్జి వైపు కూడా ఇదే తరహాలో నిర్మాణం
కేబుల్‌ స్టే బ్రిడ్జి, ఇనార్బిట్‌ మాల్‌ వైపు నుంచి టన్నెల్‌ వైపు ఫ్లై ఓవర్‌
టన్నెల్‌ వైపు నుంచి ఇనార్బిట్‌ మాల్‌ రోడ్‌ వైపు ఫ్లై ఓవర్‌
హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ నుంచి టన్నెల్‌ వైపు వచ్చేవారి కోసం రోడ్డు వెంబడి ఎడమవైపు లూప్‌
టన్నెల్‌ నుంచి నానక్‌రామ్‌గూడ, ఓఆర్‌ఆర్‌ వైపు వెళ్లేవారికి అనువుగా చిత్రపురి కాలనీవైపు రెండో వరుసలో ఫ్లై ఓవర్‌ (ఇది రెండు వైపులా ఉంటుంది)
బయో డైవర్సీటీ/గచ్చిబౌలి/ లింగంపల్లి వైపు నుంచి టన్నెల్‌ వైపు ఆప్‌ ర్యాంప్‌
టన్నెల్‌ వైపు నుంచి మూడు లేన్ల డౌన్‌ ర్యాంప్‌ రెండు లేన్లుగా విడిపోయి మెహదీపట్నం వైపు.. రెండు లేన్ల కుడివైపు లూప్‌ రెండో వరుస ఫ్లై ఓవర్‌ను మొదటి వరుస ఫ్లై ఓవర్‌ వద్ద (ఖాజాగూడ జంక్షన్‌) దాటి లింగంపల్లి/బయోడైవర్సిటీ వైపు వెళ్తుంది
ఖాజాగూడ జంక్షన్‌ వద్ద అండర్‌పాస్‌
కేబుల్‌ స్టే బ్రిడ్జి కింద, ఖాజాగూడ వద్ద రోటరీలు  

గురువారం స్టాండింగ్‌ కమిటీ సమావేశంలోని ముఖ్య నిర్ణయాలు..
ఇనార్బిట్‌ మాల్‌ నుంచి చిత్రపురి కాలనీ వరకు రూ.875 కోట్లతో రోడ్‌నెట్‌వర్క్‌ పనులు
జీహెచ్‌ఎంసీ అధికారులకు ఈఈఎస్‌ఎల్‌ ద్వారా అద్దెకు 20 ఎలక్ట్రిక్‌ వాహనాలు
26 చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు పనులకు రూ.7.55 కోట్లు
హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌ వద్ద రూ.59.09 కోట్లతో ఆర్‌యూబీ, కల్వర్టుల నిర్మాణం
జీహెచ్‌ఎంసీలో మూడేళ్ల వరకు పద్దుల నిర్వహణ, ఈఆర్‌పీల నిర్వహణకు బ్లూమ్‌ సొల్యూషన్స్‌కు రూ.12.93 కోట్లు
మూడేళ్ల వరకు ఆటోమేటిక్‌ వెహికల్‌ ట్రాకింగ్, జీపీఎస్‌/జీపీఆర్‌ఎస్‌తో డస్ట్‌బిన్ల నిర్వహణకు రూ.5.67 కోట్లు
ఇబ్రహీం నాలాపై రూ.14.70 కోట్లతో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం
డిప్యూటీ మేయర్‌ కార్యాలయం ఇంప్రెస్ట్‌ వ్యయం రూ.35 వేలకు పెంపు
రూ.40 కోట్లతో చిక్కడపల్లి మోడల్‌ మార్కెట్‌ నిర్మాణం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top