
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ 15వ సమావేశాలు శుక్రవారం ఉదయం 11 గం.కు ప్రారంభం కానున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్ తొలిసారిగా శాసనమండలి, శాసనసభను ఉద్దేశించి ప్రసంగించ నున్నారు. శనివారం గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం ప్రతిపాదించే ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లోనూ చర్చ జరగనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020–21ను ఆదివారం శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించ నున్నారు. సోమవారం హోలీ కావడంతో సోమ, మంగళవారాలు అసెంబ్లీ సమావేశాలకు విరామం ప్రకటించి తిరిగి బుధవారం నుంచి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
ఈ మేరకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో చర్చించి సభ ఎన్ని రోజులపాటు నిర్వహించాలనే అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 22లోగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమా చారం. శాసనసభను 10–12 రోజులు, మండలిని 5 రోజులపాటు నిర్వహించే అవకాశం ఉంది. 2019–20 పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను గతేడాది సెప్టెంబర్ 9 నుంచి 22 వరకు నిర్వహించగా శాసనసభ 11 రోజులు, మండలి 4 రోజులపాటు సమావేశమైంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ ఈ సమావేశాల్లో ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌కు చెందిన శాసనసభ, మండలి సభ్యులు శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి సమావేశాలకు హాజరుకానున్నారు.
నేటి నుంచి రాజ్యసభ నామినేషన్లు..
రాష్ట్ర కోటాలో రాజ్యసభ నుంచి ఏప్రిల్ 9న ఇద్దరు సభ్యులు రిటైర్ అవుతుండటంతో ఖాళీ అవుతున్న స్థానాలకు శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రారం భం కానుంది. 18న నామినేషన్ల ప్రక్రియ ముగించి ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో 26న పోలింగ్ నిర్వహించడంతోపాటు అదే రోజు సాయంత్రం ఫలితం ప్రకటిస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశా ల్లోనే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ప్రక్రియ జరుగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
మండలి చైర్మన్ నూతన చాంబర్..
శాసనమండలి ఆవరణలో చైర్మన్ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన చాంబర్‌ను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి గురువారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండలి చైర్మన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాం క్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావుతోపాటు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు పాల్గొన్నారు.
రేపు కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ భేటీలో 2020–21 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించిన తుది గణాంకాలపై సీఎం కేసీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అసెంబ్లీలో తీర్మానం, ఇతర అంశాలకు సంబంధించి మంత్రివర్గ సహచరులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై సహచరులతో చర్చించి ఖరారు చేయనున్నారు.