పోలీసు అభ్యర్థులకు ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌

Telangana Police Recruitment Board Introducing RFID Tag System - Sakshi

దేహదారుఢ్య పరీక్షల్లో కచ్చితత్వం కోసం అమల్లోకి! 

నిర్ణయం తీసుకున్న పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు 

వివాదాలు, ఆరోపణలకు చెక్‌ పెట్టేందుకే.. 

సాక్షి, హైదరాబాద్‌ : భారీ స్థాయి ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించిన పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. నియామకాల్లోని దేహదారుఢ్య పరీక్షలు, పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్‌ వంటి పరీక్షల్లో కచ్చితత్వం కోసం టెక్నాలజీ వినియోగించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకు మౌఖిక పద్ధతిలోనే లక్ష్యా న్ని చేరుకున్న అభ్యర్థులను గుర్తించేవారు. గతంలో అభ్యర్థి పరుగు ప్రారంభించిన సమయంలో స్టాప్‌వాచ్‌ ద్వారా ఎన్ని సెకన్లు, ఎన్ని నిమిషాల్లో చేరారో లెక్కగట్టేవారు. ఇలా అయితే అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. దూకిన దూరం.. షాట్‌ పుట్‌ విసిరిన దూరాలను కచ్చితత్వంతో గుర్తించేందుకు తొలిసారిగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని బోర్డు ఉన్నతాధికారులు నిర్ణయించారు. 

లేజర్‌తో స్కానింగ్‌..! 
దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా నిర్వహించే పరుగు పందెంలో అభ్యర్థులకు ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వె న్సీ ఐడెంటిఫికేషన్‌)చిప్‌ను అమరుస్తారు. పరుగు ప్రారంభించిన క్షణం నుంచి లక్ష్యాన్ని చేరుకునే వరకు కంప్యూటర్లలో ఆటోమెటిక్‌గా రికార్డయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. అభ్యర్థి లక్ష్యాన్ని చేరుకునే స్థానంలో లేజర్‌ బీమ్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా లక్ష్యాన్ని ఎవరు ముందు చేరుకున్నారో తెలిసిపోతుందని అధికారులు చెబుతున్నారు. షాట్‌పుట్‌లో ఎంత దూరం విసిరారన్నదానికి, లాంగ్‌జంప్‌లో దూరాన్ని లేజర్‌ బీమ్స్‌ ద్వారా లెక్కగట్టేలా ఏర్పాట్లు చేయనున్నారు. 

41 వేల మంది దరఖాస్తు.. 
పోలీస్, ఫైర్, జైళ్ల విభాగాల్లో భర్తీ చేయనున్న 18 వేల పోస్టులకు ఈ నెల 9 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అయితే అధికారులు ఊహిం చిన దరఖాస్తులకు, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ తదితర పోస్టులన్నింటికీ కలిపి 41 వేల దరఖాస్తులే వచ్చినట్లు తెలిసింది. అధికారులు మాత్రం మొదటి వారంలోనే కనీసం లక్ష నుంచి 2 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని భావించినట్లు సమాచారం. చివరి వారంలో దరఖాస్తుల సంఖ్య ఒకేసారి పెరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం ప్రిపరేషన్‌పై అభ్యర్థులు దృష్టిసారించి ఉంటారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top