చలో పల్లె‘టూరు’

Telangana People Going To Their Villages - Sakshi

మళ్లీ లాక్‌డౌన్‌ భయంతో సొంతూళ్లకు జనం

అందుబాటులో ఉన్న వాహనాల్లో ప్రయాణం..

ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోతున్న చిన్న చిన్న కుటుంబాలు

హైదరాబాద్‌ నలువైపులా పెరిగిన వాహనాల రద్దీ

పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల బారులు

సాక్షి, హైదరాబాద్‌/చౌటుప్పల్‌: ఒకపక్క కరోనా భయం.. హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే తిరిగి ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు.. ఆ తరువాతా బతుకుబండి గాడిన పడే పరిస్థితి లేదని భావిస్తున్న ప్రజలు.. ‘అర్జెంటుగా హైదరాబాద్‌ విడిచిపెట్టి పోవాలె.. ఏదోలా ఇక్కడి నుంచి బయటపడాలె’అనుకుంటూ పల్లెబాట పడుతున్నారు. కలోగంజో తాగి బతకొచ్చనే భావ నతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. చాలామంది ఇళ్లు ఖాళీచేసి, సామాను సర్దుకొని వెళ్లిపోతున్నారు. మరికొందరు లాక్‌డౌన్‌ సమయాన్ని దృíష్టిలో ఉంచుకొని వెళ్తున్నారు.

తొలిసారి లాక్‌డౌన్‌ విధించిన సందర్భంగా ఎదురైన ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఇంకొందరు ఊళ్లకు బయల్దేరుతున్నారు. దీంతో రెండ్రోజులుగా హైదరాబాద్‌ నలువైపులా రహదార్లపై రద్దీ పెరిగింది. టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. విజయవాడ హైవేతో పాటు వరంగల్, హన్మకొండ, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, వికారాబాద్, చేవెళ్ల తదితర మార్గాల్లోనూ అదే పరిస్థితి. హైదరాబాద్‌ – విజయవాడ 65వ నంబర్‌ జాతీయ రహదారి రెండ్రోజులుగా రద్దీగా మారింది.

యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి జీఎమ్మార్‌ టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వెళ్లే వైపు వాహనాలు బారులుతీరుతున్నాయి. వాహనాలు ఎక్కువ వస్తుండడం, నగదు మార్గంలో బారులు తీరుతుండడంతో టోల్‌ సిబ్బంది వాహనదారుల వద్దకే వెళ్లి హ్యాండ్‌మిషన్‌ ద్వారా టోల్‌ రుసుము తీసుకుంటున్నారు. 
అటూఇటూ రద్దీ.. మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారనే వార్తల నేపథ్యంలో నగర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సూపర్‌మార్కెట్లు, షాపింగ్‌ కేంద్రాలు, కిరాణా దుకాణాల వద్ద జనం నిత్యావసర వస్తువుల కోసం బారులు తీరుతున్నారు. లాక్‌డౌన్‌ కాలానికి సరిపడా సరుకులు కొని పెట్టుకోవాలనే ఆత్రుతతో దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. వైన్‌షాపుల వద్దా రద్దీ కనిపిస్తోంది. మరోపక్క సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన అసంఘటితరంగ కార్మికులు, దినసరి కూలీలు, ప్రైవేట్‌ ఉద్యోగులు, ఇతర బీదాబిక్కీ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

హైదరాబాద్‌లో పనుల్లేక, సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణా సదుపాయాల్లేక కష్టపడ్డారు. సొంత వాహనాలున్న వారు అనుమతులు లభించక వెళ్లలేకపోయారు. అప్పటి అనుభవాలతో ఇప్పుడు ముందుజాగ్రత్తగా పల్లెలకు తరలివెళ్తున్నారు. నగరంలోని దాదాపు ప్రతి బస్తీ, కాలనీ నుంచి పల్లెబాట కొనసాగుతోంది. ఉద్యోగం, ఉపాధి కోసం ఏళ్ల క్రితమే హైదరాబాద్‌ను నమ్ముకొని వచ్చిన వాళ్లు ట్రాలీ ఆటోలు, టాటాఏస్‌ వాహనాల్లో ఇంటిసామానంతా సర్దుకొని వెళ్తున్న దృశ్యాలే ఎటుచూసినా కనిపిస్తున్నాయి. సొంత వాహనాలతో పాటు చివరకు బైక్‌లపై సైతం తరలిపోతున్నారు. 

బస్సు, రైళ్లకూ డిమాండ్‌ 
ఆర్టీసీ బస్సులు, రైళ్లకు రెండ్రోజులుగా డిమాండ్‌ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని వివిధ జిల్లాలకు హైదరాబాద్‌ నుంచి వెయ్యి బస్సులు నడుస్తున్నాయి. ‘ప్రయాణికుల డిమాండ్‌ ఇలాగే ఉంటే మరికొన్ని బస్సులను అందుబాటులోకి తెస్తాం’అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంటనగరాల నుంచి ప్రస్తుతం రోజుకు 22 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 30 వేల మంది తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు.

అలాగే ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు నగరాలకూ రద్దీ పెరిగింది. విజయవాడ, విశాఖ వైపు వెళ్లే ప్రత్యేక రైళ్లలో 50 నుంచి 100 వరకు వెయిటింగ్‌ లిస్టు కనిపిస్తోంది. ఇక, హైదరాబాద్‌ నుంచి దేశంలోని వివిధ నగరాలకు రాకపోకలు సాగించే దేశీయ విమాన సర్వీసులు 100 నుంచి 126కి పెరిగాయి. 63 సర్వీసులు హైదరాబాద్‌ నుంచి వివిధ నగరాలకు వెళ్తుండగా, మరో 63 సర్వీసులు నగరానికి చేరుకుంటున్నాయి.

పాసులుంటేనే ఏపీలోకి అనుమతి 
కోదాడ: హైదరాబాద్‌లో త్వరలో లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారంతో పలువురు సొంత వాహనాల్లో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తున్నారు. అయితే పాస్‌లున్న వారినే ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అనుమతిస్తున్నారు. దీంతో సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని ఆంధ్ర– తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రత్యేక పాసులున్న వారిని కూడా ప్రత్యేక మొబైల్‌ ల్యాబ్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి అనుమానితుల నుంచి శాంపిల్స్‌ తీసుకున్నాకే అనుమతిస్తున్నారు.

ఇళ్లలోకి రానివ్వట్లేదు 
కూతురుతో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉంటూ ఇళ్లలో పనిచేస్తూ బతికేవాళ్లం. కరోనా కారణంగా యజమానులు ఇళ్లలోకి రానివ్వట్లేదు. మళ్లీ లాక్‌డౌన్‌ పెడతారని అంటున్నారు. ఇక్కడుండి ఏం చేయాలి?.  
– సూర్యకళ, ధర్మవరం, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్‌ 

గిరాకీ లేదు.. ఏంజేయాలె! 
హైదరాబాద్‌ కొత్తపేట ప్రాంతంలో టీకొట్టు నడిపేవాడిని. కరోనా తరువాత ఎవరూ టీ తాగేందుకు రావట్లేదు. అందుకే ఉండలేక వెళ్లిపోతున్నా. 
– రమేష్, వాడపల్లి, నల్లగొండ జిల్లా 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top