కొత్త రేషన్‌ కార్డులు ఇస్తరట!

Telangana People Apply For New Ration Cards - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: చౌకధరల దుకాణాల నుంచి ప్రభుత్వం అందజేసే బియ్యం తీసుకోవడానికి తప్ప.. సంక్షేమ పథకాల అమలుకు రేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకోకపోయినా.. ఆ కార్డులకు డిమాండ్‌ మాత్రం తగ్గడం లేదు. కొత్త రేషన్‌ కార్డుల కోసం కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుటమే ఇందుకు నిదర్శనం! దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే జూన్‌ ఒకటో తేదీ నుంచి కొత్త రేషన్‌ కార్డులను జారీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఏడు రోజుల్లో కొత్త కార్డులు అందజేయాలని నిర్ణయించింది.

ఇదిలా ఉండగా, ప్రభుత్వం మొదటిసారిగా 2015–జనవరిలో ఆహార భద్రత కార్డులను అందజేసింది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న చాలా మంది అర్హులకు ఎఫ్‌ఎస్‌సీ కార్డు అందలేదు. దీంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. బియ్యం కోసం తాత్కాలిక కార్డు అందజేసినా.. శాశ్వత రేషన్‌ కార్డు ఇంత వరకూ ఇవ్వలేదు. గడిచిన ఐదేళ్లలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని కుటుంబంతో కాకుండా సెపరేట్‌గా ఉంటున్న వారు, ఇప్పటి వరకు కార్డు లేని వారు, గతంలో రేషన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్నా.. మంజూరుకాని వారు కొత్త కార్డులకు దరఖాస్తులు చేసుకొని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంకేం..ఇప్పుడు వీరందరికీ కొత్త కార్డులు అందనున్నాయన్న మాట!

ఆదిలాబాద్‌అర్బన్‌: ఇప్పటిదాక 27,171 దరఖాస్తులు.. గతేడాది ఏప్రిల్‌–1 నుంచి కొత్త రేషన్‌ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. సుమారు పదమూడు నెలలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరగడంతో జిల్లాలోని 18 మండలాల పరిధిలో ఇప్పటి వరకు 27,171 దరఖాస్తులు వచ్చాయి. ‘మీ సేవ’ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించడంతో అధిక సంఖ్యలో తహసీల్దార్‌ లాగిన్‌కు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వ నిబంధనలు కూడా తోడవడంతో దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. (ఉదాహరణకు.. ఒక కుటుంబంలో ఐదుగురికి కలిపి ఒక రేషన్‌ కార్డు ఉందనుకుందాం.

ఆ కుటుంబంలో ఎవరైనా ఒకరు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు.. అయితే ఆ రేషన్‌ కార్డులో ఉన్న సదరు కుటుంబ సభ్యులెవరూ ఐదేళ్ల వరకు ఎలాంటి లబ్ధి పొందరాదనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి.. దీంతో ఆ కుటుంబంలో పెళ్లి చేసుకున్న వారు కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది.) కాగా, ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా ఆదిలాబాద్‌ అర్బన్‌లో 5,834 దరఖాస్తులు రాగా, అతితక్కువగా నార్నూర్‌ మండలంలో 437 దరఖాస్తులు వచ్చాయి. అయితే మీసేవ ద్వారా కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులపై ముందుగా ఆర్‌ఐ క్షేత్ర స్థాయి విచారణ జరుపుతారు. సదరు ఆర్‌ఐ అప్రూవల్‌ లభిస్తే.. తహసీల్దార్‌ లాగిన్‌కు చేరుతాయి. అక్కడ డీసీఎస్‌వో, డీసీఎస్‌వో నుంచి పౌర సరఫరాల కమిషనర్‌కు పంపుతారు. కమిషనర్‌ అమోదం లభిస్తే.. కొత్త రేషన్‌ కార్డులు జారీ అవుతాయి.

పెండింగ్‌లో 7,039..
జిల్లాలో కొత్త రేషన్‌ కార్డుల మంజూరుకు మొత్తం 27,171 దరఖాస్తులు రాగా, అందులో 7,039 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మిగతా 20,132 దరఖాస్తులకు కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వొచ్చని జిల్లా స్థాయి అధికారులు కమిషనర్‌ కార్యాలయానికి నివేదిక పంపించారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం 1,027 దరఖాస్తులకు మాత్రమే అప్రూవల్‌ లభించగా, మిగతా వాటికి లభించలేదు. మరో 176 దరఖాస్తులను కమిషనర్‌ కార్యాలయం అధికారులు వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పెండింగ్‌లో ఉన్న 7,039 దరఖాస్తులను ఓసారి పరిశీలిస్తే.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ స్థాయిలో విచారణ జరపాల్సినవి 6,136 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, తహసీల్దార్ల లాగిన్‌లో 546 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండు స్థాయిల నుంచి డీసీఎస్‌వో లాగిన్‌కు వచ్చిన మరో 357 దరఖాస్తులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top