గ్రిడ్కు బిడ్డింగ్ | Telangana mulls to invite bids for water grid | Sakshi
Sakshi News home page

గ్రిడ్కు బిడ్డింగ్

Sep 30 2014 1:08 AM | Updated on Sep 2 2017 2:07 PM

గ్రిడ్కు బిడ్డింగ్

గ్రిడ్కు బిడ్డింగ్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘తాగునీటి గ్రిడ్’ ప్రాజెక్టు అమలు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి.

 తాగునీటి గ్రిడ్‌పై అంతర్జాతీయ బిడ్డింగ్‌కు టీ సర్కారు నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘తాగునీటి గ్రిడ్’ ప్రాజెక్టు అమలు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. సుమారు రూ. 27 వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేస్తున్న ఈ ప్రాజెక్టును తప్ప మరే పని చేపట్టరాదని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగాన్ని ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు జైకా, నాబార్డు అందించే నిధులతో రానున్న నాలుగేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వం సంకల్పించింది. వాటర్ గ్రిడ్‌పై గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం చేపట్టిన ప్రాథమిక సర్వే నివేదికపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు. గ్రావిటీతో ఎక్కువ ప్రాంతాలకు మంచినీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఆదేశించారు.
 
 ఇందుకోసం ఎత్తయిన కాంటూర్ల నిర్మాణం గురించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. పూర్తిగా ఎత్తిపోతలపై ఆధారపడకుండా చూడాలని నిర్దేశించారు. తాగునీటి అవసరాల కోసం ప్రత్యేక రిజర్వాయర్లు నిర్మించాలని సూచించారు. తెలంగాణవ్యాప్తంగా ఉపరితల పైపులైన్ల ద్వారా రక్షిత మంచినీటిని అందించడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామాలు, పట్టణాలు, పరిశ్రమలకు ఎంత నీరు అవసరమన్న దానిపై అంచనాలు రూపొందించాలని సూచించారు. రాబోయే 30 ఏళ్ల వరకు ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా వాటర్ గ్రిడ్ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాలవారీగా అందుబాటులో ఉన్న నీటి వనరులను గుర్తించి, ఎక్కడి నుంచి నీటిని సరఫరా చేయాలన్నది స్పష్టంగా పేర్కొనాలని చెప్పారు. ప్రస్తుతం 30 లీటర్ల తలసరి నీటిని మాత్రమే అందిస్తున్నారని, అలా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి వంద లీటర్ల చొప్పున సరఫరా చేసేలా పథకానికి రూపకల్పన చేయాలన్నారు. జూరాల, నాగార్జునసాగర్ వంటివి శాశ్వతంగా ఉంటాయని, గోదావరి ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా కొన్ని రోజులు మాత్రమే నీరందించే అవకాశముంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
 
 నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో స్టోరేజి ట్యాంకులు నిర్మించాలని సూచించారు. ప్రాజెక్టు అమలుపై ప్రతి 15 రోజులకోసారి నీటిపారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, అధికారులు సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ెహ లికాప్టర్లలో తిరిగి జిల్లాల్లో సర్వే చేయాలని, ఎప్పటికప్పుడు తనకు నివేదికలు అందించాలని ఆయన పేర్కొన్నారు. దీనిపై వచ్చే సోమవారం(6న) మరోసారి సమీక్ష జరపనున్నట్లు తెలిపారు. కాగా, ప్రజలకు తాగునీరు అందించే గ్రామీణ మంచినీటి సరఫరా, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం, హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాల్సి ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ  భూమి చుట్టుకొలత 33 వేల కిలోమీటర్లు కాగా, అంతకు నాలుగు రెట్ల పొడవైన పైపులైన్లు వేస్తామన్నారు. ఇది ప్రపంచ  రికార్డు అవుతుందన్నారు. గూగుల్ ఎర్త్ సమకారంతో రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు, కాంటూర్లను, భౌగోళిక పరిస్థితులను ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ముఖ్య కార్యదర్శులు రేమండ్ పీటర్, ఎస్‌కే జోషితో పాటు ఇరిగేషన్, మున్సిపల్, ఆర్‌డబ్ల్యూస్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
 
 వాటర్ గ్రిడ్ స్వరూపం
 

  •      1,26,036 కిలోమీటర్ల పైపులైను, 5,227 కిలోమీటర్ల మెయిన్ ట్రంక్ లైను
  •      45,809 కిలోమీటర్ల సెకండరీ నెట్‌వర్క్, 75 వేల కిలోమీటర్ల సరఫరా లైన్లు
  •      రాష్ర్టంలోని ప్రతి పల్లె. నగర పంచాయతీ, మున్సిపాలిటీకి తాగునీటి సరఫరా
  •      వ్యయం రూ. 27 వేల కోట్లు (మరింత పెరగవచ్చు)
  •      రోజూ ఒక్కొక్కరికి వంద లీటర్ల చొప్పున నీటి సరఫరా
  •      {పత్యేక నీటి నిల్వ రిజర్వాయర్ల నిర్మాణం, సరఫరాకు 24 గ్రిడ్‌ల ఏర్పాటు
  •      డీపీఆర్, పరికరాలు, ఉద్యోగాల భర్తీకి రూ. 317 కోట్ల కేటాయింపు
  •      హైదరాబాద్‌ను మినహాయిస్తే 80 టీఎంసీల నీరు అవసరమని అంచనా
  •      మూడు నెలల్లో నివేదికలు సిద్ధం చేశాక అంతర్జాతీయ బిడ్డింగ్
  •      నాలుగేళ్ల వ్యవధిలో గ్రిడ్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం

 
 విద్యుత్ కొనుగోలుకు ఆదేశం
 
 తెలంగాణలో విద్యుత్ కొరత లేకుండా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అవసరమైన మేరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి జోషికి సూచించారు. వాటర్ గ్రిడ్‌పై సమీక్ష సందర్భంగా కరెంట్ పరిస్థితిపై కేసీఆర్ ఆరా తీశారు. ఈ విషయంలో ఇంధన శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement