పెద్దల సభకు నేతల సన్నద్ధం

Telangana MLC Elections Congress Candidate - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: పెద్దల సభలో ఖాళీ కాబోతున్న రెండుఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబ«ంధించిన రెండు నియోజకవర్గాలకు సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శాసనమండలి ఛైర్మన్‌ కె.స్వామిగౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సం ఘం ఆదేశాల మేరకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. తొలిరోజు నామినేషన్లు దాఖలు కాలేదు. నామినేషన్ల ప్రక్రియ మార్చి 5వ తేదీ వరకు కొనసాగనుంది. నాలుగు పాత జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల పట్టభద్ర, ఉపాధ్యాయ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పాతూరి సుధాకర్‌రెడ్డి 
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించింది. పీఆర్‌టీయూ తరఫున ఆయన పోటీ చేయనున్నారు. శాసనమండలిలో ప్రస్తుతం విప్‌గా ఉన్న ఆయన టీఆర్‌ఎస్‌ నేతగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రికి విశ్వాసపాత్రుడిగా ఉన్న సుధాకర్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు కోరారు.

కాంగ్రెస్, బీజేపీ బలపరిచే ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పట్టభద్రులను ఓటర్లుగా చేర్పించడంలో సఫలమైన నాయకులు.. ఇప్పుడు పార్టీల మద్దతుతో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. పెద్దల సభ అయినా.. రాజకీయ పార్టీ మద్దతు లేకుండా గెలిచే పరిస్థితి లేకపోవడంతో పలువురు నేతలు ఆయా పార్టీల నుంచి అధికారిక అభ్యర్థిత్వం కోసం హైదరాబాద్‌లో మకాం వేశారు.

స్వామిగౌడ్‌ను కాదంటేనే  టీఆర్‌ఎస్‌ ఆశావహులకు
టీఆర్‌ఎస్‌ తరఫున ఆరేళ్ల క్రితం ఈ నియోజకవర్గం నుంచి స్వామిగౌడ్‌ విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన మండలి చైర్మన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగుస్తున్నప్పటికీ.. ఆయన సేవలను మరోసారి వినియోగించుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా మరోసారి ఇదే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయనకు అవకాశం ఇస్తారా? లేక ప్రత్యామ్నాయ ఆలోచన ఏమైనా ఉందా..? అనే విషయంలో టీఆర్‌ఎస్‌ వర్గాలకు కూడా స్పష్టత లేదు.

స్వామిగౌడ్‌ పదవీకాలం ముగుస్తుందని తేలడంతోనే పలువురు నాయకులు, ఉద్యమ నేతలు తెరపైకి వచ్చి తమ వంతు ప్రయత్నాల్లో మునిగిపోయారు. కరీంనగర్‌ మేయర్‌ సర్ధార్‌ రవీందర్‌ సింగ్‌ కొంతకాలంగా పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడిన ఆయన ఎమ్మెల్సీ సీటు విషయంలో ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌ విడుదల కావడంతోనే అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు కరీంనగర్‌కే చెందిన ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌లో మకాం వేశారు.

సీన్‌లోకి రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్‌గౌడ్‌
తెలంగాణ ఉద్యమం నుంచి గ్రూప్‌–1 అధికారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న మామిళ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్‌ ఇన్‌చార్జి డీటీసీగా వ్యవహరిస్తున్న ఆయన నిజామాబాద్‌కు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న తనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తారని ధీమాతో ఉన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో తనవంతు ప్రయత్నాల్లో మునిగిపోయారు.
 
కాంగ్రెస్‌ నుంచి జీవన్‌రెడ్డి  దాదాపు ఖరారు
కరీంనగర్‌ జిల్లాలోని అత్యంత సీనియర్‌ నాయకుల్లో ఒకరైన తాటిపర్తి జీవన్‌రెడ్డి గత ఎన్నికల్లో జగిత్యాల నుంచి అనూహ్యంగా ఓడిపోయారు. ఈసారి ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. 1.90లక్షల ఓటర్లు ఉన్న ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 79వేల మంది కరీంనగర్‌ ఉమ్మడి జిల్లానుంచే ఉండడం తనకు కలిసి వచ్చే అంశమని చెబుతున్నారు. జిల్లాకు చేసిన సేవలను గుర్తు చేసుకునే పట్టభద్రులు ప్రతిఒక్కరూ తనకే ఓటేస్తారని ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి అధికారికంగా ఆదేశాలు రాగానే ఆయన నామినేషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

బీజేపీ నుంచి సుగుణాకర్‌రావుతోపాటు మరో ఇద్దరు
బీజేపీ నుంచి పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా కిసాన్‌ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీలో సీనియర్‌ నాయకుడైన సుగుణాకర్‌రావుతోపాటు కామారెడ్డికి చెందిన ఏబీవీపీ నేత రంజిత్‌ మోహన్, కరీంనగర్‌కు చెందిన కొట్టె మురళీకృష్ణ సైతం తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండుసార్లు కరీంనగర్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సుగుణాకర్‌రావు పార్టీకి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం ఆయన పేరునే ఖరారు చేసే అవకాశం ఉంది. వీరు కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా మరికొందరు పెద్దల సభకు పోటీ పడనున్నారు. మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

కరీంనగర్‌లోనే నామినేషన్లు
శాసనమండలి ఎన్నికలకు సంబంధించి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ వ్యవహరించనున్నారు. నాలుగు జిల్లాల్లోని 42 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లు పాల్గొనే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కరీంనగర్‌ కలెక్టరేట్‌లోనే నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top