మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నో

Telangana High Court Notices To KCR Government And RTC JAC - Sakshi

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో పిల్‌

ప్రభుత్వానికి, సంఘాలకు నోటీసులు

విచారణ 10కి వాయిదా వేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను విరమింపజేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినందున ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది. దీంతో హైకోర్టు ధర్మాసనం ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ కమిషనర్, కార్మిక శాఖ కమిషనర్, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శులకు నోటీసులిచ్చింది.ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పూర్తి వివరాలతో కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రతివాదుల్ని ఆదేశించింది.

డిపోల వారీగా ఉన్న ఆర్టీసీ బస్సులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన బస్సులు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాల్ని వివరించాలని ప్రభుత్వాన్ని కోరింది. విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చట్ట విరుద్ధంగా ప్రకటించి, సమ్మెను విరమించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఆదివారం ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.ఉస్మానియా విశ్వవిద్యాలయ రీసెర్చ్‌ స్కాలర్, సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం లక్ష్మీనగర్‌ గ్రామానికి చెందిన ఆర్‌.సుబేందర్‌సింగ్‌ దాఖలు చేసిన పిల్‌ను ఆదివారం స్థానిక కుందన్‌బాగ్‌లోని న్యాయమూర్తి నివాసంలో అత్యవసర హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.

హామీ ఇచ్చి 6 ఏళ్లైనా అతీగతీలేదు 
పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదిస్తూ.. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చట్ట విరుద్ధమని, తక్షణమే విధుల్లో చేరేలా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈవిధంగా 2015లో హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్ని తిరిగి ఇవ్వాలన్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఆదేశాలివ్వాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ ఆరేళ్లైనా అమలు చేయలేదన్నారు.

కోర్టు ఉత్తర్వులిస్తే.. సమ్మె విరమించేస్తారు 
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని, దసరా ఉన్నందున సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఆర్టీసీ యూనియన్లకు విజ్ఞప్తి చేసినా మొండికేశాయని చెప్పారు.

సమ్మె చట్ట విరుద్ధం 
సమ్మె చట్ట వ్యతిరేకమని, విధుల్లో చేరాలని కార్మిక శాఖ తేల్చి చెప్పిందన్నారు. ఆర్టీసీ సమ్మె చట్ట వ్యతిరే కమని చెప్పారు. పిటిషనర్‌ ఉద్యోగ సంఘాలకు చెం దిన వ్యక్తి అని ఆరోపించారు. సమ్మె చట్ట విరుద్ధమని కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే.. దీన్ని అడ్డుపెట్టుకుని సమ్మె విరమించే యోచనలో కార్మికులు ఉన్నారన్నారు. సమ్మె చట్ట విరుద్ధమో కాదో కార్మిక వివాదాల చట్టం కింద అధీకృత అధికారుల వద్ద తేల్చుకోవాలని, ఇప్పుడు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top