క్షణ క్షణం.. భయం భయం..

Telangana Government Schools Buildings Work Pending Adilabad - Sakshi

బేల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల తెలుగు మీడియంలో 180 మంది విద్యార్థులు ఉన్నారు. 1 నుంచి 5వ వరకు విద్యనభ్యసిస్తున్నారు. రెండు గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. గత్యంతరం లేక శిథిలావస్థ గదుల్లోనే విద్యార్థులను కూర్చొబెట్టి బోధన చేస్తున్నారు. వర్షం కురిసినప్పుడు స్లాబ్‌ ద్వారా వర్షపు నీరు గదుల్లోకి చేరుతుంది.

ఆదిలాబాద్‌ టౌన్‌: జిల్లాలో సర్కారు బడులు కొన్ని శిథిలావస్థకు చేరుకుని మృత్యుఒడిని తలపిస్తున్నాయి. ఏక్షణం ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. అధికారులు వాటిని కూల్చివేయకుండా అలాగే కొనసాగించడం.. కొన్ని పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన పురాతన గదుల్లోనే తరగతులు కొనసాగుతున్నాయి. విద్యాశాఖ అధికారులు, పాలకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో పాఠశాలలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. గురువారం హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో  
పిల్లర్‌ కూలిపోవడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. కాగా, ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ప్రమాద స్థాయికి చేరిన పాఠశాలు ఉన్నాయి.

మృత్యు కుహారాలు..
ఆదిలాబాద్‌ జిల్లాలో 466 ప్రాథమిక పాఠశాలలు, 109 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 58,648 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కొన్ని సర్కారు బడులతోపాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేకుల గదులు, పెంకుటిళ్లలోనూ చదువులు కొనసాగుతున్నాయి. వర్షకాలంలో శిథిలావస్థ భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియక విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల తరగతి గదులు సరిపోక, భవనాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో చెట్ల కింద విద్యాబోధన జరుగుతోంది. ప్రభుత్వం ఆర్‌ఎంఎస్‌ఏ, ఆర్వీఎం ద్వారా పాఠశాల భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించినప్పటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల భవనాలు పూర్తి కావడం లేదు. కాంట్రాక్టర్లకు అధికార పక్షం నేతలు అండదండలు ఉండడంతో పాఠశాల అదనపు గదుల నిర్మాణం ముందుకు సాగడం లేదు. కొన్ని చోట్ల నిర్మాణం పూర్తి కాకున్నప్పటికీ ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై బిల్లులు తీసుకుంటారని ఆరోపణలు ఉన్నాయి.
 
కూలడానికి సిద్ధంగా..
జిల్లాలో 56 పాఠశాలల్లో 93 గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. బేల మండలంలో 2, బోథ్‌ మండలంలో 21 గదులు, ఇచ్చోడలో 3, ఇంద్రవెల్లిలో 2, జైనథ్‌లో 8, నార్నూర్‌లో 21, నేరడిగొండలో 1, తలమడుగులో 17, తాంసిలో 9, ఉట్నూర్‌లో 9 పాఠశాలలు శిథిలావస్థలో చేరుకున్నాయి. బేల మండలంలోని ఎంపీపీఎస్‌ రెండు గదులు ఉండగా 2 శిథిలావస్థలో ఉన్నాయి. బోథ్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల(బుజుర్గు)లో 5 గదులు ఉండగా.. ఐదూ శిథిలావస్థలో ఉన్నాయి. తలమడుగు మండలంలోని బరంపూర్‌ ప్రాథమిక పాఠశాలలో 8 గదులు ఉండగా 7 శిథిలావస్థలో ఉన్నాయి. తలమడుగు ప్రాథమిక పాఠశాలలో 6 గదులు ఉండగా.. 4 శిథిలావస్థలో ఉన్నాయి. తాంసి మండలంలోని అర్లి(టి)లో 6 గదులు ఉండగా.. 3 శిథిలావస్థకు చేరుకున్నాయి.

శిథిలావస్థ గదుల్లో పిల్లల్ని కుర్చోబెట్టవద్దు
జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్‌ యాజమాన్య పాఠశాలలకు సంబంధించి 56 పాఠశాలల్లో 93 శిథిలవస్థ గదులు ఉన్నాయి. ఈ గదుల్లో ఉపాధ్యాయులు పిల్లల్ని కుర్చోబెట్టవద్దు. అవసరమైన అదనపు గదులు నిర్మాణం, నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిస్తాం. అదనపు నిర్మాణం చేపట్టకుండా నిర్లక్షం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. ఈ విషయం జిల్లా కలెక్టర్‌కు విన్నవించి వారిని బ్లాక్‌ లిస్టులో ఉంచేవిధంగా చర్యలు తీసుకుంటాం.  

– జనార్దన్‌రావు, డీఈవో ఆదిలాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top