ఆదర్శ రైతులకు మంగళం! | telangana government mulls to sack ideal farmers | Sakshi
Sakshi News home page

ఆదర్శ రైతులకు మంగళం!

Sep 22 2014 2:27 AM | Updated on Sep 2 2017 1:44 PM

రాష్ట్రంలో ఆదర్శ రైతుల వ్యవస్థకు మంగళం పాడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

 ఆంధ్రా బాటలో తెలంగాణ ప్రభుత్వం


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదర్శ రైతుల వ్యవస్థకు మంగళం పాడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థ వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందకపోవడానికి ఆదర్శ రైతులు కారణమవుతున్నారని అధికారుల భావన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది ఆదర్శ రైతులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారికి ప్రతినెలా రూ. వెయ్యి గౌరవ వేతనం ఇస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయంలో విశేష అనుభవం ఉన్నవారిని గుర్తించి ప్రతీ గ్రామానికి ఒకరు, పెద్ద గ్రామాలైతే ఇద్దరిని ఆదర్శ రైతులుగా నియమించారు. వ్యవసాయంలో అధునాతన పద్ధతులు, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను గ్రామాల్లోని రైతులకు వివరించి, అధిక దిగుబడి సాధించేలా సలహాలు ఇవ్వడం వంటి పనులు వీరు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ కార్యకర్తలనే ఆదర్శ రైతులుగా నియమించుకున్నారని టీఆర్‌ఎస్ కిందిస్థాయి నేతల నుంచి వస్తున్న ఫిర్యాదులతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యవస్థను రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణలోనూ వారిని తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు... వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యక్రమాలు పూర్తిగా లేకుండా పోయాయని, రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించే వారు లేకుండా పోయారని తెలంగాణ సీఎం కొద్దిరోజులుగా పేర్కొంటూ వస్తున్నారు. అలాంటిది ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయకుండా ఉన్న వ్యవస్థను తొలగించడం వల్ల రైతులు మరింత ఇబ్బందులు పడే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఆదర్శ రైతుల వ్యవస్థతో పెద్దగా ప్రయోజనం లేదని అధికారవర్గాలు వ్యాఖ్యానించడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement