బాండ్లు కాదు.. ప్రామిసరీ నోట్లు! | telangana government mulls to issue promissory notes instead of bands | Sakshi
Sakshi News home page

బాండ్లు కాదు.. ప్రామిసరీ నోట్లు!

Aug 26 2014 2:12 AM | Updated on Oct 1 2018 2:03 PM

బాండ్లు కాదు..  ప్రామిసరీ నోట్లు! - Sakshi

బాండ్లు కాదు.. ప్రామిసరీ నోట్లు!

రైతులు రుణాలు చెల్లిస్తే... వారికి రెండు మూడేళ్లలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే విధంగా హామీ పత్రం (పామిసరీ నోట్) ఇవ్వనున్నట్లు సమాచారం.

 టీ సర్కార్ మరో కొత్త ఆలోచన
 
 సాక్షి, హైదరాబాద్: రైతులు రుణాలు చెల్లిస్తే... వారికి రెండు మూడేళ్లలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే విధంగా హామీ పత్రం (పామిసరీ నోట్) ఇవ్వనున్నట్లు సమాచారం. రైతులు బ్యాంకులకు రుణం చెల్లించి ఎన్‌వోసీ (నిరభ్యంతర పత్రం) తీసుకుని వస్తే.. ప్రభుత్వం ఒక బాండును రైతుకు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇటీవల వెల్లడించిన విషయం విదితమే. అయితే బాండ్లు జారీ చేయడం వల్ల అధికారికంగా అప్పు తెచ్చుకోవడమేనన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. దీంతో రైతులకు బాండ్ల రూపంలో కాకుండా హామీ పత్రం (ప్రామిసరీ నోట్) ఇచ్చే అంశాన్ని తాజాగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. రెండు మూడు సంవత్సరాల్లోగా రైతులకు ఆ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని యోచనలో ఉంది.
 
 తగ్గనున్న భారం!
 
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై రుణ మాఫీ భారం తగ్గుతోంది. ప్రస్తుతం అంచనా వేసిన రూ. 17,337 కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు తగ్గనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రుణమాఫీ అమలుకు జారీ చేసిన మార్గదర్శకాల తరువాత బ్యాంకర్లు రైతులకు ఇచ్చిన రుణాలపై బ్యాంకుల వారీగా, గ్రామం వారీగా లెక్కల క్రోడీకరణ పనిని ప్రారంభించిన విషయం విదితమే. ఒక రైతుకు మూడు నాలుగు బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లు, ఒక కుటుంబంలో ఉన్న అకౌంట్లను పరిశీలిస్తున్న బ్యాంకులు వీటన్నింటినీ ఒకే అకౌంట్‌గా మార్చాలని యోచిస్తున్నారు. ఇలా మార్చిన పక్షంలో ఒక కుటుంబానికి లక్ష రూపాయల వరకే మాఫీ చేయడం వీలవుతుందని, దీంతో ఈ భారం రెండువేల కోట్ల మేరకు తగ్గుతుందని ఆర్థికశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 
 నేటి నుంచి జాబితా సిద్ధం
 
 బ్యాంకుల పరిశీలన ప్రక్రియను పూర్తిచేసి మంగళవారం లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయనున్నారు. బుధవారం నుంచి గ్రామాల్లో సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.  మరోవైపు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఇప్పటికే రుణాలు రీ షెడ్యూల్ చేయడానికి వంద మండలాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. మరో వెయ్యికోట్ల రూపాయలకు వెసులుబాటు కలుగుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. రైతు రుణమాఫీకి సంబంధించి వారం పదిరోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 31వ తేదీలోగా బ్యాంకుల నుంచి సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమాచారం వచ్చిన తరువాత ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సమావేశమై..  నిధులు ఏ విధంగా సర్దుబాటు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement