4వేల రూట్లు ప్రైవేటుకు!

Telangana Government Issue To Private Buses Permit In Hyderabad - Sakshi

తరచూ సమ్మెల నేపథ్యంలో సర్కారు యోచన 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మిక సంఘాలు తరచూ సమ్మెలకు దిగడం వల్ల ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని శాశ్వతంగా అధిగమించడానికి రాష్ట్రంలోని 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లోనే కేబినెట్‌ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్టీసీ సమస్యను కార్మిక సంఘాలు న్యాయస్థానాలకు తీసుకెళ్లినందున, అది తేలేవరకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ప్రజలకు మరింత అసౌకర్యం కలగనుంది. దీంతో ప్రత్యా మ్నాయాలు ఆలోచిస్తోంది. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన మోటార్‌ వెహికల్‌ (అమెండ్‌మెంట్‌ యాక్టు)–2019 ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు జారీ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఈ చట్టం 2019 సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కల్పించిన అధికారాల ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వడం వల్ల వారు ఆదాయం కోసం తమకు కేటాయించిన రూట్లలో ఎక్కువ ట్రిప్పులు నడుపుతారు. షిఫ్టుల గొడవ లేకుండా ఎక్కువ సమయం వాహనాలను ప్రజల రవాణాకు అందుబాటులో ఉంచుతారు. అధిక రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

టెండర్లకు అనూహ్య స్పందన  
రూట్లకు పర్మిట్లు ఇస్తే నడపడానికి ప్రైవేటు వాహన యజమానులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం వెయ్యి రూట్లలో పర్మిట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే, 21,453 దరఖాస్తులు వచ్చాయి. దీన్ని బట్టి రాష్ట్రంలోని ప్రైవేటు వాహన యజమానులే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాహనాలు కూడా వచ్చే అవకాశం ఉందని రవాణా అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. విద్యార్థులకు పరీక్షలు ఉన్నప్పుడు, పండుగల సీజన్‌ ఉన్నప్పుడు.. ఇలా అదను చూసుకుని కార్మిక సంఘాలు సమ్మెలకు పిలుపునిస్తున్నాయి. ప్రభుత్వాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నాయి. ఇలా సమ్మె జరిగినప్పుడల్లా ప్రజలకు విపరీతమైన అసౌకర్యం కలుగుతున్నది. దాదాపు 40 ఏళ్ల నుంచి ఇదే తంతు నడుస్తున్నది. దీన్నుంచి శాశ్వతంగా విముక్తి కావడానికి వివిధ రూట్లలో బస్సులు నడిపేందుకు ప్రైవేటు వారికి అవకాశం కల్పించడమే ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో జరిగే కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని అధికారికంగా వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

డీజిల్‌కు సైతం డబ్బుల్లేవ్‌.. 
ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెపై వివిధ కేసులను హైకోర్టు విచారణ జరుపుతోంది. ఇది ఎప్పటికి పరిష్కారం అవుతుందో తెలియదు. హైకోర్టు తీర్పు వచ్చినా ఎవరైనా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు ఆర్టీసీ నష్టాల్లో ఉందని, సమ్మె వల్ల వచ్చే ఆదాయం కూడా రావట్లేదని ప్రభుత్వం వాదిస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఆర్టీసీ చిక్కుకుంది. దీని ఫలితంగా బస్సులకు డీజిల్‌ పోసే పంపులకు బకాయిలు పేరుకుపోయాయి. ఏ క్షణమైనా బంకులు డీజిల్‌ పోయడం ఆపేయొచ్చు. దీనివల్ల ప్రస్తుతం తిరుగుతున్న బస్సులు కూడా ఏ క్షణమైనా ఆగిపోయే అవకాశం ఉంది. మరోవైపు తీసుకున్న అప్పులకు కిస్తీలు చెల్లించలేని స్థితిలో ఆర్టీసీ కూరుకుపోతోంది. ఏ క్షణమైనా ఆర్టీసీని నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్‌ (ఎన్‌పీఏ)గా గుర్తించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top