
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీల కొత్త భవనాలకు సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు డిజైన్లు సిద్ధం చేస్తున్నారు. వాటిల్లోంచి ఒకదాన్ని ఎంపిక చేసి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భవనాలు తెలంగాణ సంప్రదాయ వారసత్వ నమూనాను ప్రతిబింబించేలా ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ భవనం నమూనాను పోలి ఉండేలా కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించనున్నట్టు ఇప్పటికే ఆయన ప్రకటించారు. సచివాలయ భవన ఆకృతి ఖరారు కావా ల్సి ఉంది. గుమ్మటాలతో ఉండే నమూనా వైపు సీఎం మొగ్గుచూపుతున్నారు. తమిళనాడుకు చెందిన ఓ నిర్మాణ సంస్థ రూపొందించిన నమూనా బాగుందని ఆయన పేర్కొన్నారు. దానికి దగ్గరగా ఉండే మరో ఉన్నత నమూనాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ భవనాల నిర్మాణంపై ఏర్పడ్డ అధికారుల కమిటీ ప్రముఖ ఆర్కిటెక్ట్‌లకు ఈ మేరకు లేఖలు రాసింది. మంచి నమూనా సిద్ధం చేయాల్సిందిగా ఆ లేఖల్లో పేర్కొంటూ 20 నిర్మాణ సంస్థలకు పంపింది. వాటిల్లో ఉత్తమమైన 3 డిజైన్లు ఎంపిక చేసి మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించనుంది. సీఎంతో సంప్రదించి అందులో ఓ నమూనాను ఉపసంఘం ఎంపిక చేయనుంది.
హఫీజ్ కాంట్రాక్టర్ సహా..
ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ సచివాలయం కోసం మూడు నమూనాలు రూపొందించారు. తొలుత ప్రస్తుత సచివాలయం ఉన్న ప్రాంతంలోనే కొత్త సచివాలయం నిర్మించాలని భావించిన ప్రభుత్వం ఆయనకు డిజైన్ల బాధ్యత అప్పగించింది. అప్పట్లో ఆయన 2 నమూనాలు రూపొందించారు. తర్వాత బైసన్ పోలో మైదానంలో నిర్మించాలనుకు న్నప్పుడు పెద్ద గుమ్మటంతో మరో నమూనా రూ పొందించారు. ఇప్పుడవి కాదని కొత్త నమూనాలు సిద్ధం చేసుకోవాలనుకుంటున్న నేపథ్యంలో అధికారుల కమిటీ ఆయనకు కూడా లేఖ రాసింది.