కరువు భత్యంపెంపు

Telangana Government Increased Dearness Allowance For Employees - Sakshi

ఎల్పీ, పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్‌కు ఓకే

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం

మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులు, పెన్షనర్లకు తీపికబురు. కరువు భత్యం(డీఏ) పెంపును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. 2019, జనవరి 1 నుంచి జూలై 1 మధ్య కాలానికి సంబంధించిన 3.144 శాతం డీఏను మంజూరు చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 33.536 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. అలాగే 6,143 భాషా పండితులు, 802 పీఈటీ పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ గతంలో రాష్ట్ర విద్యా శాఖ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం రాటిఫై చేసింది. గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతానని కేబినెట్‌ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం విధించే అంశంపై కేబినెట్‌లో విస్తృతంగా చర్చించారు. ఈ అంశంపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో వాటికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించే అంశాన్ని పరిశీలించాలని కేబినెట్‌ పోలీసు శాఖను కోరింది. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top