పేదల చేతికే డబుల్‌ బెడ్రూమ్‌ నిధులు

Telangana Government Focused On Double Bed Room Housing Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇకనుంచి రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకునే దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా వార్షిక బడ్జెట్‌ 2020–21లో రూ.11,917 కోట్లను కేటాయించింది. పేదల చేతికే డబుల్‌ బెడ్రూమ్‌ నిధుల్ని అందిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించడంతో ఈ ఆర్థిక ఏడాదిలో ఈ ప్రాజెక్టు పరుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇదివరకు ప్రత్యేక కాలనీలుగా నిర్ధారిత ప్రాంతంలో ఇళ్లను నిర్మించేవారు. యూనిట్‌ కాస్ట్‌ సరిపోవటం లేదని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో ఈ ప్రాజెక్టు పనులు పడకేశాయి. ప్రస్తుతం తాముంటున్న ఇల్లు ఒక చోట ఉండటం, కొత్తగా మంజూరై నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు మరోచోట ఉండటాన్ని లబ్ధిదారులు ఇష్టపడలేదు.

ఈ అంశాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులనే సొంతంగా తమ స్థలంలో ఇళ్లను నిర్మించుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతోపాటుగా డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయింపులు చేసింది. 2020–21 ఆర్థిక ఏడాదికి గాను బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.11,917 కోట్లను ప్రతిపాదించింది. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునేవారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్షమంది ఉంటారని బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రగతి పద్దుకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లకు రూ.3,850 కోట్లు కేటాయించారు. మిగతా మొత్తం గ్రామ ప్రాంతాల్లో లబ్ధిదారులకు కేటాయించారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రూ.750 కోట్లు ఖర్చు చేయనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top