పాలపిట్ట.. తంగేడు పువ్వు | telangana government declared as Palapitta state bird | Sakshi
Sakshi News home page

పాలపిట్ట.. తంగేడు పువ్వు

Nov 18 2014 1:37 AM | Updated on Sep 2 2017 4:38 PM

పాలపిట్ట.. తంగేడు పువ్వు

పాలపిట్ట.. తంగేడు పువ్వు

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలను ప్రభుత్వం ఖరారు చేసింది.

 తెలంగాణ రాష్ట్ర అధికార పక్షి, పుష్పం ఖరారు
 రాష్ట్ర జంతువు జింక.. వృక్షం జమ్మిచెట్టు
 ఈ చిహ్నాలకు తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం: సీఎం కేసీఆర్

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర జంతువుగా జింక , రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడును ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సోమవారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో అధికార చిహ్నాలపై పలు ప్రతిపాదనలు వచ్చినా.. వాటిని కాదని తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు, అలవాట్లకు అద్దంపడుతూ, చరిత్ర, పౌరాణిక నేపథ్యం ఉన్న వాటిని ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఉన్న అధికారిక చిహ్నాలు ఆంధ్ర కోణం నుంచి ఎంపిక చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘జింకకు భారతదేశంలో ప్రముఖ స్థానం ఉంది.

తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ జింకలు ఉన్నాయి. చిన్నచిన్న అడవుల్లోనూ అవి మనుగడ సాగిస్తాయి. అడవి జంతువుల్లో అత్యంత సున్నితమైన, అమాయకమైనదిగా జింకకు పేరుంది. తెలంగాణ ప్రజల మనస్తత్వానికి  దగ్గరగా ఉంటుందని జింకను ఎంపిక చేశాం’’ అని సీఎం వివరించారు. పాలపిట్టకు తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉందని, ప్రతి ఏటా దసరా పండుగ రోజు ఈ పక్షిని దర్శించుకోవడం ఓ పుణ్య కార్యక్రమంగా ప్రజలు భావిస్తారని పేర్కొన్నారు. పాలపిట్టను దర్శించుకోవడం శుభసూచకంగా ప్రజలు భావిస్తారని, లంకపై దండయాత్ర చేసే ముందు శ్రీరాముడు ఈ పక్షిని దర్శించుకున్నారని, అందుకే ఆయన ను విజయం వరించిందని పౌరాణిక గాథలు చెబుతున్నాయని వివరించారు. రాష్ట్రం కూడా విజయపథంలో నడవాలని రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ఎంపిక చేసినట్లు సీఎం పేర్కొన్నారు. జమ్మిచెట్టు తెలంగాణ ప్రజల జీవితంలో అంతర్భాగమని చెప్పారు. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై ఉంచారని, తర్వాత వాటితోనే కౌరవులను ఓడించారన్నారు. విజయానికి సూచిక అయిన జమ్మిచెట్టు ఆశీర్వాదం ఇప్పుడు తెలంగాణకు కావాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ పండుగలో వాడే తంగేడు పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అడవిలో సహజ సిద్ధంగా పెరిగే తంగేడు పూవు ప్రకృతికే అందాన్ని తెస్తుందని, ఈ పూలను సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా కూడా తెలంగాణ అడపడుచులు భావిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రానికి తంగేడు పూవును అధికారిక పుష్పంగా నిర్ణయించుకున్నట్లు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement