ఎంసెట్‌: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

Telangana EAMCET Examinations started from Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఎంసెట్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి 7వ తేదీ వరకు (నీట్‌ ఉన్నందున 6వ తేదీ మినహా) ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతిష్టాత్మకమైన ఎంసెట్‌ పరీక్షల కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు విద్యార్థులను అనుమతించడం లేదు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి అనుమతించబోమని ఇప్పటికీ అధికారులు ప్రకటించారు.

ఎంసెట్‌ పరీక్షలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి 2,21,064 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రెండు రాష్ట్రాల్లోని 18 జోన్ల పరిధిలో 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2, 3 తేదీల్లో 75 కేంద్రాల్లో అగ్రికల్చర్‌ పరీక్ష... 4, 5, 7 తేదీల్లో 83 కేంద్రాల్లో ఇంజనీరింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. అగ్రికల్చర్‌ పరీక్షలకు 73,106 మంది, ఇంజనీరింగ్‌ పరీక్షకు 1,47,958 మంది దరఖాస్తు చేసుకున్నారు.

రెండు సెషన్లలో పరీక్షలు
పరీక్ష తేదీల్లో రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో సెషన్‌లో 25 వేల మంది వరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించేలా ఎంసెట్‌ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఉదయం సెషన్‌ 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం సెషన్‌ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ యాదయ్య వెల్లడించారు. ఆన్‌లైన్‌ ఎంసెట్‌ పరీక్షల్లోనూ నిమిషం నిబంధనను అమలు చేస్తున్నామని, నిర్ధారిత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించేది లేదని వారు స్పష్టం చేశారు. పరీక్షా సమయం కంటే రెండు గంటల ముందు నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. ఈసారి కొత్తగా నిజామాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

ఏపీ నుంచి 29,356 మంది
ఎంసెట్‌ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి 29,356 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్‌ పరీక్షకు 21,369 మంది, అగ్రికల్చర్‌ పరీక్షకు 7,987 మంది ఉన్నారు.

పరీక్షలు ముగిసిన వెంటనే ‘కీ’లు
ఐదు రోజుల పాటు ఆన్‌లైన్‌ పరీక్షలు జరుగుతున్నందున అన్ని పరీక్షలు పూర్తయ్యాక ప్రాథమిక ‘కీ’లను విడుదల చేసేలా ఎంసెట్‌ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలు ముగిసే 7వ తేదీ రాత్రి లేదా 8న ‘కీ’లను విడుదల చేయనుంది. ఆన్‌లైన్‌ పరీక్షలు కావడంతో ప్రశ్నపత్రం ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేదు. అందువల్ల ‘కీ’లను విడుదల చేసే సమయంలో.. సంబంధిత కోడ్‌ ప్రశ్నపత్రం, ‘కీ’ రెండింటినీ విడుదల చేస్తారు. ఇక ప్రాథమిక ‘కీ’లపై మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. మొత్తంగా ఈనెల 15వ తేదీ నాటికి ఫలితాలను, ర్యాంకులను ప్రకటించేలా చర్యలు చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top