మీర్జాగూడ రోడ్డుప్రమాద క్షతగాత్రులకు అందని సాయం
సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటున్న బాధితులు
ఉస్మానియాలో ఇద్దరు.. నిమ్స్‌లో ఇద్దరికి వైద్యం
పీఎంఆర్‌లో కోలుకుంటున్న మరో 8 మంది
ఇప్పటికీ అందని ప్రభుత్వ పరిహారం రూ.2.5 లక్షలు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, రంగారెడ్డి జిల్లా/రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద సోమవారం బస్సు– టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు 27 మంది క్షతగాత్రులను పీఎంఆర్, వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాయి.
వీరందరికీ ఉచిత వైద్యం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ, మొదటి రెండు రోజుల పాటు నేతలు, అధికారులు వచ్చి పరామర్శల పేరుతో హడావుడి చేశారే తప్ప, వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందజేయలేదు. విధిలేని పరిస్థితుల్లో క్షతగాత్రుల బంధువులే ఆస్పత్రి ఖర్చులను సమకూర్చాల్సి వస్తోంది.
ఒక్కొక్కరు ఒక్కో ఆస్పత్రిలో..
మోకాలి కింది భాగంలోని ఎముక రెండు చోట్ల విరిగిపోయి బాధపడుతున్న ధారూర్‌కు చెందిన అమ్మపల్లి జయసుధ (30)ను మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు. మూడు రోజుల్లో ఆస్పత్రి ఖర్చులు రూ.18 వేలు దాటింది. ఖర్చులకు డబ్బు లేకపోవడంతో బుధవారం పేయింగ్ విభాగం నుంచి ఆరోగ్యశ్రీ విభాగంలో చేర్పించారు. శనివారం ఆమె కాలికి శస్త్రచికిత్స చేయనున్నారు.
తుంటి ఎముక దెబ్బతిని నడవ లేని స్థితిలో ఉన్న రెబ్బనిబోని నందిని (24)కి మూడు వారాల విశ్రాంతి తర్వాతే సర్జరీ అవసరమా? లేదా అనేది వైద్యులు నిర్ధారించనున్నారు. గురువారం సాయంత్రం ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సయ్యద్ అబ్దుల్లా (33), తస్లీమా (26)ల పరిస్థితి దారుణంగా ఉంది. అబ్దుల్లాకు ఎడమ చేయి విరిగింది. ఆయనకు బీపీ, షుగర్ ఉండటంతో చికిత్స వాయి దా వేశారు.
తస్లీమా కుడికాలికి చికిత్స చేసినప్పటికీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. బండ్లగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టిప్పర్ యజమాని లక్ష్మన్ నాయక్ (32) పరిస్థితి కూడా ఇదే. క్షత గాత్రులకు ఉచిత వైద్య సేవలు అందిచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో అమలు కాలేదు. గాయపడిన వాళ్లకు ప్రభుత్వం ఇస్తామన్న రూ.2.5 లక్షల ఆర్థిక సహాయం కూడా ఇప్పటికీ అందలేదు.
ప్రమాదంపై సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ ఆరా
మీర్జాగూడ రోడ్డు ప్రమాదంపై సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ ఆరా తీసింది. గురువారం హైదరాబాద్‌కు వచ్చిన కమిటీ చైర్మన్ అభయ్ మనోహర్ సాప్రే, సభ్యుడు సంజయ్ బంధోపాధ్యాయ.. ప్రమాదంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ప్రమాద కారణాలను కమిటీకి వివరించారు. ఆర్టీసీ బస్సులతోపాటు ఇతర బస్సులు, కమర్షియల్ వాహనాల ఫిట్‌నెస్‌ను మరొకసారి తనికీ చేయాలని ఈ సందర్భంగా కమిటీ ఆదేశించింది. కాగా, ఈ ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణించిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, స్థానికులు, ఇతర ప్రయాణికుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు రాజేంద్రనగర్ డివిజన్ డీసీపీ యోగేశ్ గౌతమ్ తెలిపారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం
క్షతగాత్రుల వైద్య బిల్లుల అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను. నిమ్స్‌లో జయసుధ మినహా అందరికీ ఉచిత వైద్యం అందజేశాం. నందిని నుంచి బిల్లు వసూలు చెయ్యెద్దని నిమ్స్ డైరెక్టర్‌ను కోరాం. పీఎంఆర్‌లో ప్రస్తుతం 8 మంది చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి యాజమాన్యం ఇప్పటివరకు మెడికల్ బిల్లులు అడగలేదు. ఒకవేళ అడిగితే ఉన్నతాధికారులతో మాట్లాడి వైద్య ఖర్చులు చెల్లిస్తాం. – డాక్టర్ లలితాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
చికిత్సకు డబ్బుల్లేవు
నా భార్య జయసుధను మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తీసుకొచ్చాం. రూ.ఐదు వేలు చెల్లించి ఆర్ధోపెడిక్ విభాగంలో అడ్మిట్ చేశాను. రెండు రోజులకు రూ.18 వేలు చెల్లించాను. కొన్ని మందులు, ఇంజెక్షన్లు బయటే కొనాల్సి వస్తోంది. జేబులో చిల్లిగవ్వ లేదు. సర్జరీ కోసం రూ.లక్షకుపైగా ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో అదే ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కార్డుపై అడ్మిట్ చేయించా ను. క్షతగాత్రులకు ప్రభుత్వం రూ.రెండున్నర లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. – సురేందర్, క్షతగాత్రురాలు జయసుధ భర్త
రూ.2.50 లక్షలు ఖర్చయింది
బస్సు ప్రమాదంలో ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పక్కటెముకలు కదిలిపోయాయి. చేయి కదల్లేని పరిస్థితి. తెలిసిన వాళ్లు నన్ను నల్లగండ్ల సిటిజన్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. రెండు రోజుల క్రితం ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఇందుకు రూ.2.50 లక్షలు ఖర్చు అయింది. మా ఇంటి యజమాని సహా బంధువుల వద్ద అప్పు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాను. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మాకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. – జి.రవి, క్షతగాత్రుడు
ఇద్దరం ఆస్పత్రిలోనే ఉన్నాం
నేను రోజూ కూలీకి వెళ్తేగాని పూటగడవదు. నాకు ఇద్దరు చిన్న పిల్లలు. ప్రమాదంలో నేను, నా భార్య తస్లీమా గాయపడ్డాం. అదృష్టం కొద్ది పిల్లలకు ఏమీ కాలేదు. వైద్యం చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రస్తుతం ఇద్దరం ఉస్మానియాలోనే ఉన్నాం. ఖర్చుల గురించి ఆలోచిస్తేనే బీపీ, షుగర్ కంట్రోల్ కావడం లేదు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు పైసా కూడా అందలేదు. – సయ్యద్ అబ్దుల్లా, క్షతగాత్రుడు, ఉస్మానియా ఆస్పత్రి


