స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌లో విజయాలను సాధించే దిశగా తలపెట్టిన ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’ ఆదివారం ప్రారంభమైంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌లో విజయాలను సాధించే దిశగా తలపెట్టిన ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’ ఆదివారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం ఇబ్రహీంపట్నంలోని శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభమైన ఈ సదస్సుకు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించి కొత్తవ్యూహాల రచనే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించారు. దేశంలోనే మొదటగా రాష్ట్రంలో సదస్సు ఏర్పాటు చేసిన నేపథ్యంలో టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా భావించి సదస్సును విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు చేసింది. పార్టీ ఓటమి పాలవ్వడంతో శ్రేణుల్లో నిరుత్సాహం ఉన్నప్పటికీ.. సదస్సుకు భారీగా తరలిరావడం, హడావుడి వాతావరణం కన్పించడంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. కాగా కొత్తగా తలపెట్టిన ఈ తరహా సదస్సులో ప్రధాన నేతలు మినహా.. ఇతర కీలక నేతలు, ద్వితీయశ్రేణి నాయకులకు, ఇతర కార్యకర్తలకు ప్రసంగించే అవకాశం ఇవ్వలేదు. దీంతో సభానంతరం పలువురు నేతలు పెదవి విరిచారు.
జట్లుగా విడగొట్టి.. అభిప్రాయాలు సేకరించి..
ప్రధాన నేతల ప్రసంగం అనంతరం సదస్సుకు వచ్చిన శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు పార్టీ కొత్త వ్యూహాన్ని రచించింది. సామాజిక అంశాలవారీగా పది బృందాలను ఏర్పాటు చేసి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను ఆయా బృందాలకు బాధ్యులుగా నియమించారు. సదస్సుకు వచ్చిన కార్యకర్తలు వారి మనోభావాలను ఆయా బృందాల వద్ద వ్యక్తపర్చే అవకాశం ఇచ్చారు. ఈ పది బృందాలను సదస్సు జరిగిన ఆవరణలోనే ఇతర బ్లాకుల్లో వినతులు, అభిప్రాయాలు స్వీకరించే ఏర్పాటు చేశారు. దీంతో ఆయా బృందాల వద్దకు కార్యకర్తలు వెళ్లి వారి ఆలోచనలు, సూచనలు వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ జెండా రెపరెపలు..
ఇబ్రహీంపట్నం మండలంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సదస్సుకు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. సదస్సు జరిగే ప్రాంతమంతా కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. సాగర్ రింగురోడ్డు నుంచి సదస్సు ప్రధాన ద్వారం వరకు పలువురు నాయకులతో కూడిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
డిజిటల్ స్క్రీన్లు..
భవిష్యత్ కార్యాచరణ సదస్సు ప్రాంగణం భారీగా ఉండడం.. పెద్ద సంఖ్యలో నాయకగణం హాజరుకావడంతో పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సభావేదికలో ఉన్న పెద్దలు.. ప్రసంగించే నాయకులు స్పష్టంగా కనిపించేలా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. దీంతో సభకు వచ్చిన కార్యకర్తలు, నాయకులు ఆసక్తిగా నేతల ప్రసంగాలను తిలకించారు. ప్రసంగం ప్రారంభం, ముగింపు సమయంలో కరతాలధ్వనులతో సందడి చేశారు.
కాగా ఈసదస్సులో జిల్లాకు చెందిన డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టి.రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి, పీసీసీ సీనియర్ నేత ఉద్దెమర్రి నర్సింహారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక సదస్సు రెండవరోజు సోమవారం కూడా కొనసాగుతుంది. ఈసందర్భంగా పార్టీకి సంబంధించిన పలు కీలక తీర్మానాలు చేయనున్నారు.