పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆనంద్‌కుమార్, కిన్నెరామూర్తి, జీవీ ప్రసాద్
వివరాల సమగ్రత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
పత్రికా స్వేచ్ఛ మీద తీవ్రమైన నియంత్రణ ఉంది
లిటరరీ ఫెస్టివల్‌లో జరిగిన ప్యానెల్ చర్చలో పలువురు వక్తలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో శనివారం ‘ఫ్రీడమ్, కంట్రోల్ అండ్ ద న్యూస్’అనే అంశం మీద నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్‌లో ప్రముఖ జర్నలిస్టులు పామెలా ఫిలిపోస్, ధన్యా రాజేంద్రన్, మోడరేటర్ వినోద్ పావరాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ‘వార్తా సేకరణ, వార్తల సంకలనం, వార్తా కథనాల మదింపు వంటి అంశాల్లో కచ్చితత్వమే ప్రధానం.
ప్రింట్ మీడియా నిర్వహణ అత్యంత ఖర్చుతో కూడిన ప్రక్రియగా మారిన నేపథ్యంలో సమాచార ప్రసారం డిజిటల్ రూపం సంతరించుకుంటోంది. డిజిటల్ రంగంలో వేగమే ప్రధానం కావడంతో కొన్నిసార్లు సమాచారం అసమగ్రంగా ప్రసారమవుతోంది. వేగంగా సమాచారాన్ని చేరవేసే క్రమంలో కూడా వివరాల సమగ్రత లోపించకుండా జాగ్రత్త తీసుకోవాలి.’అన్ని పేర్కొన్నారు పామెలా ఫిలిపోస్.
‘ఒకప్పుడు వార్తా కథనంలో ఒక ఫొటో పొరపాటుగా ప్రచురించిన సందర్భాల్లో మాత్రమే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేవి. ప్రస్తుతం చాలా పదాలను ఉపయోగించడానికి వీల్లేని నియంత్రణ ఉంది. ఉదాహరణకు ఒక సంఘటనలో సంబంధిత వ్యక్తి పేరుతోపాటు వారి ఊరి పేరును రాస్తాం. క్రమంగా అనుబంధ వార్తా కథనాల్లో ఆ వ్యక్తి పేరుతోపాటు ఆ ఊరి పేరును రాయడం కొనసాగుతుంటుంది.
ఇప్పుడు అలా ఊరిపేరును ప్రస్తావించడం నేరంగా పరిగణింపబడుతోంది.’అని పేర్కొన్నారు ధన్యా రాజేంద్రన్. ఇప్పుడు వార్త రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి ప్రచురణ తర్వాత కూడా ఆందోళన వెంటాడుతోందని, పత్రికా స్వేచ్ఛ మీద పైకి కనిపించని తీవ్రమైన నియంత్రణ ఉందన్నారు. తాను నడుపుతున్న ది న్యూస్ మినిట్ వెబ్‌సైట్ కనీసం ఆరు నెలలకో నోటిస్ అందుకోవాల్సి వస్తోందని తెలిపారు ధన్యా రాజేంద్రన్.
హెచ్‌ఎల్‌ఎఫ్‌లో రోడ్ టూ ఆనంద్ పుస్తకావిష్కరణ
హైదరాబాద్ లిటరరీ ఫె స్టివల్‌లో శనివారం నాడు ‘రోడ్ టు ఆనంద్’పుస్తకావిష్కరణ జరిగింది. ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ ఎం.డి సైంటిస్ట్ డాక్టర్ కె. ఆ నంద్‌కుమార్ రాసిన పుస్తకాన్ని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కో చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ ఆవిష్కరించారు. సోషల్ యాక్టివిస్ట్ కిన్నెరామూర్తి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ తమిళనాడు, కోయంబత్తూరు దగ్గర పొల్లాచ్చి సమీపంలోని ఓ కుగ్రామం నుంచి వచ్చానని, జీవితంలో ఎత్తుపల్లాలన్నింటినీ దాటుకుంటూ ముందుకు సాగడమే ధ్యేయంగా పెట్టుకున్నానన్నారు. ఒక కుగ్రామం నుంచి వచ్చిన తాను పీహెచ్‌డీ చేసి ఒక ఔషధ తయారీ సంస్థను నిర్వహించడం, పలువురికి స్ఫూర్తిగా నిలవాలనేదే ఈ పుస్తకం రాయడం వెనుకనున్న ఉద్దేశమన్నారు. కష్టాలు పడుతూ ఈ స్థాయికి వచ్చానని, నా జీవిత కథను మించిన స్ఫూర్తికథనం మరొకటి ఉండదన్నారు.


