కూల్చివేయడమే కరెక్ట్‌.. | Telangana Cabinet Sub Committee Nod For Construction Of New Secretariat | Sakshi
Sakshi News home page

కూల్చివేయడమే కరెక్ట్‌..

Sep 6 2019 2:31 AM | Updated on Sep 6 2019 10:09 AM

Telangana Cabinet Sub Committee Nod For Construction Of New Secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత సచివాలయ భవనాల కూల్చివేతకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇవి ఉపయోగించడానికి వీలు లేకుండా ఉన్నాయని కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు యోచిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం తన నివేదికను సమర్పించింది. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్‌ భవనం ఉపయోగించడానికి వీలు లేకుండా ఉన్నందున, సచివాలయం కోసం కొత్త భవన నిర్మాణం సముచితమేనని ఉపసంఘం తేల్చిచెప్పింది. ప్రస్తుత సచి వాలయం భవనంలో మార్పుచేర్పులు చేసి కొనసాగించ డానికి కూడా ఏమాత్రం అనువుగా లేదని పేర్కొంది.

ప్రస్తుత భవన సముదాయంలోని ఎ, బి, సి, డి, జి, హెచ్‌ నార్త్, జె, కె బ్లాకుల్లో అగ్నిప్రమాదం జరిగితే మంటలు ఆర్పడానికి అగ్నిమాపక వాహనాలు వెళ్లే పరిస్థితి లేదని, మార్పులు చేసినప్పటికీ ఫైరింజన్‌ వెళ్లడం కుదరదని స్పష్టంచేసింది. అంతేకాకుండా ప్రస్తుత సచివాలంలో వీవీఐపీ, వీఐపీలకు భద్రత సరిగా లేదని.. వీఐపీలకు, అధికారులకు, సందర్శులకు అందరికీ ఒకే ఎంట్రన్స్, ఒకే ఎగ్జిట్‌ ఉన్నాయని.. ఆయా బ్లాకుల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, ఇది వారి భద్రతకు ఏ మాత్రం క్షేమకరం కాదని అభిప్రాయపడింది. ప్రస్తుతం సీఎంఓ, మంత్రులు, అధికారులు వేర్వేరు బ్లాకుల్లో ఉంటున్నారని.. అత్యంత రహస్యమైన డాక్యుమెంట్లు, ఫైళ్లను వివిధ బ్లాకులకు తిప్పాల్సి వస్తున్నందున అధికార రహస్యాలు బహిర్గతమవుతున్నాయని పేర్కొంది.

మంత్రి వేములతో సీఎం చర్చలు
తెలంగాణ రాష్ట్ర కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణంపై ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ నేపథ్యంలో సాంకేతిక అంశాలన్నింటినీ పరిశీలించి నివేదిక ఇవ్వాలని పేర్కొంటూ ఇంజనీరింగ్‌ శాఖలకు చెందిన నలుగురు ఈఎన్‌సీలతో ఓ నిపుణుల కమిటీని నియమిస్తూ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సచివాలయ భవనంలో మార్పులు, చేర్పులు చేసి కొనసాగించాలా? లేక కొత్త భవనం నిర్మించాలా? అనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆ కమిటీకి సూచించింది.

దీంతో రంగంలోకి దిగిన నిపుణుల కమిటీ.. డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్, ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌తో విస్తృతంగా చర్చించింది. అలాగే సచివాలయ భవన సముదాయం ప్రాంగణాన్ని సునిశితంగా పరిశీలించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మంత్రివర్గ ఉపసంఘానికి తన నివేదిక సమర్పించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ఉపసంఘం.. తన అభిప్రాయాలతో కూడిన నివేదికను నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేసింది. దీనిపై గురువారం రాత్రి సీఎం కేసీఆర్‌.. ఉపసంఘానికి నేతృత్వం వహించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో చర్చించారు. సబ్‌ కమిటీ నేవేదిక నేపథ్యంలో సచివాలయ భవనాల కూల్చివేత దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement