‘బీసీలే బుద్ధి చెబుతారు’

Telangana Bjp Celebrate Mahatma Jyotiba Phule Birth Anniversary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీసీలు ఐక్యం కాకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఓబీసీలకు ఇచ్చిన నిధులపై కేసీఆర్‌ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని​ డిమాండ్‌ చేశారు. మహాత్మా జ్యోతిరావ్‌పూలే జయంతిని పురస్కరించుకొని తెలంగాణ బీజేపీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. మహత్మా జ్యోతిరావ్‌పూలే గొప్ప ఆశయాలు కలిగిన వ్యక్తి అని, అట్టడుగు వర్గాల కోసం పూలే పాటుపడ్డారని గుర్తుచేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాల అభివృద్ధి అంటే మహిళ చదువుకొని ఆర్థికంగా ఎదగడమే అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు అత్యంత ప్రమాదకరమైనవని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా తాయిలాలు ఇస్తున్నారని, ఎన్ని తాయిలాలు ఇచ్చిన అభివృద్ధే ముఖ్యమని తెలిపారు. ఓబీసీ కమిషన్‌కి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని.. దీనిపై ఉత్తమ్‌, వీహెచ్‌లు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఒప్పించాలని కోరారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకం
కెలక్ష్మణ్‌ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావ్‌పూలే మహిళల చదువు కోసం ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. అంబేడ్కర్‌ కూడా జ్యోతిరావ్‌పూలేను గురువుగా భావించరన్నారు. 70 ఏళ్లలో 18వేల గ్రామాలు కరెంట్‌ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక 16 వేల గ్రామాలకు కరెంట్‌ ఇచ్చారని తెలిపారు. 60 సంవత్సరాల్లో కాంగ్రెస్‌ దళితులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు మోదీని విమర్శిస్తూ.. ప్రజలను పక్కదోవ పట్టిస్తూ, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయని ఆరోపించారు. బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని చూస్తుంటే విపక్షాలు అడ్డుతగులుతున్నాయని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీసీలే కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

నిరుద్యోగ యువత ఉద్యోగాలు కావాలని అడుగుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలు, చేపలు పంచుతోందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. మత మార్పిడి చేసుకున్న ముస్లింలకు, క్రైస్తవులకు ఫీజు రాయితీలు ఇస్తున్నారు కానీ హిందువులుగా పుట్టిన బీసీ విద్యార్థులకు రాయితీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ఎంపీలు ప్రవర్తించిన తీరుపై రేపు(గురువారం) నరేంద్ర మోదీ ఒక్క రోజు దీక్ష చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లు కావాలని పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకుంటారు కానీ ప్రైవేటు యూనివర్సిటీలో రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top