
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులే టార్గెట్
చిన్నారులను కిడ్నాప్ చేసి చెవిపోగులు ఎత్తుకెళ్లిన ఘటనలు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత రెండు నెలల్లో ఆరు జరిగాయి.
- రెండు నెలల్లో ఆరుగురు చిన్నారుల కిడ్నాప్
- చెవి పోగుల అపహరణ
- నిందితురాలి కోసం పోలీసుల వేట
- అప్రమత్తంగా ఉండాలని స్కూల్‌కు నోటీసులు
సాక్షి, సిటీబ్యూరో: చిన్నారులను కిడ్నాప్ చేసి చెవిపోగులు ఎత్తుకెళ్లిన ఘటనలు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత రెండు నెలల్లో ఆరు జరిగాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదేళ్ల వయసు కలిగిన విద్యార్థినులే లక్ష్యంగా ఒకే మహిళ ఈ కిడ్నాప్‌లకు పాల్పడిందని పోలీసులు నిర్థారణకు వచ్చారు. మరోపక్క ఆ మాయ‘లేడీ’ని పట్టుకొనేందుకు రంగంలోకి దిగారు. అయితే, ఆమెను పట్టుకొనేందుకు సరైన క్లూ దొరక్కపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. కిడ్నాప్‌లు జరకుండా అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు.
ఇలా కిడ్నాప్, అలా చోరీ..
ఈ కి ‘లేడీ’ వయసు 30- 40 ఏళ్లు ఉంటుంది. పంజాబీ డ్రెస్సు ధరించి, ఆటోలో ప్రయాణిస్తున్న ఈమె 10 ఏళ్ల వయసు గల బాలికలను టార్గెట్ చేసుకుంటోంది. చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, డబ్బులు ఆశ చూపి వారిని ఆటోలో కిడ్నాప్ చేసుకెళ్తోంది. రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి అక్కడ చెవి పోగులు తీసుకుని వదిలేస్తోంది. రెండు నెలలుగా ఇలా పంజా విసురుతున్న ఈ అగంతకురాలు పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే ఈ మహిళ ఎల్బీనగర్‌లో ఒకటి, హయత్‌నగర్‌లో రెండు, వనస్థలిపురంలో ఒకటి, అల్వాల్‌లో రెండు ఇలా ఆరు కిడ్నాప్‌లు, చోరీలకు పాల్పడింది. ఈ అన్ని కేసుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికలనే ఈమె ఎత్తుకెళ్లడం గమనార్హం. కాగా, బాధిత విద్యార్థినులు కొన్ని ఆధారాలు చెప్పినప్పటికీ అవి కిడ్నాపర్‌ను గుర్తించేందుకు ఉపయోగపడకపోవడంతో పోలీసులు మథనపడుతున్నారు.
నోటీసుల జారీ..
వరుస కిడ్నాప్‌లకు పాల్పడుతున్న మహిళను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఇలాంటివి జరిగేందుకు ఆస్కారం ఉం డదని భావించిన పోలీసులు ప్రజలను చైతన్యం చేసేందుకు చర్యలు చేపట్టారు. చిన్నారులు అపహరణకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని తమ ఠాణా పరిధిలోని స్కూళ్లకు నోటీసులు జారీ చేశారు. పాఠశాలలు, కాలనీలు, బస్తీల్లో అనుమానాస్పద వ్య క్తులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం చేరవేయాలని కోరుతున్నారు. మరోపక్క ఇదే విషయమై ఆటోకు మైక్‌లు కట్టుకుని ప్రచారం చేస్తున్నారు.