ప్రతి పశువుకూ ఆరోగ్యకార్డు

Talasani Srinivas Yadav Visit In Rangareddy - Sakshi

యాచారం(ఇబ్రహీంపట్నం): రాష్ట్రంలోని ప్రతి పాడి పశువుకు సంబంధించి ఆరోగ్య(ఆధార్‌) కార్డు జారీ చేస్తున్నామని, పశువుల ఆరోగ్యం విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలియజేశారు. మండల పరిధిలోని చింతపట్ల గ్రామం లో మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్‌ లిక్కి సరితారెడ్డి అధ్యక్షతన గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేసి పశువులకు రాయితీపై దాణాను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గొల్లకురుమలు ఆర్థికంగా బాగుపడేందుకు సీఎం కేసీఆర్‌ రూ. 4,500 కోట్ల నిధులతో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. మొదటివిడతలో భాగంగా 7 లక్షల పంపిణీకి 4 లక్షల గొర్రెలను అందజేసినట్లు వివరించారు. మరో 3 లక్షలకు పైగా జీవాల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. జీవాల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతి ష్టాత్మకంగా భావిస్తున్నారని తెలిపారు. గొల్లకురుమలకు అందిస్తున్న జీవాలు ఆరోగ్యంగా ఉండి అధిక బరువుంటే మాంసం ఉత్పత్తి పెరుగుతుందనే ఉద్దేశంతో నట్టల నివారణ మందులను ఏడాదికి మూడుసార్లు వేస్తున్నట్లు తెలిపారు.

జీవాల ఎదుగుదల, మాంసం ఉత్పత్తి పెరుగుదలతో కాపరులు ఆర్థికంగా బాగుపడుతారని చెప్పారు. ఈ ఏడాది రూ. 7 కోట్లు ఖర్చు చేసి నట్టల నివారణ మందులేయనున్నామని, తద్వారా రూ. 300 కోట్ల మాంసం ఉత్పత్తులు పెరిగే అవకాశం ఉందన్నారు. రైతులు జీవాలను అమ్ముకోకుండా కాపాడుకొని మంచి ఆదాయం పొంది ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. గాలికుంటు వ్యాధి పూర్తిగా నిర్మూలించడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. గొర్రెల పథకం కింద పంపిణీ చేసిన జీవాలు రోగాలబారినపడి చనిపోతే వెంటనే వేరే గొర్రెలను ఇస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం డివిజన్‌లో పశువులు, గొర్రెల, మేకల పెంపకం అధికంగా ఉందని తెలిపారు. వైద్య సిబ్బంది సరిగా లేకపోవడంతో జీవాలు, పశువులు మృత్యువాత పడుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది, ఆస్పత్రుల ఏర్పాటు విషయమై నివేదిక పంపిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల అభ్యున్నతి కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్, సీఈఓ మంజువాణి, ఎండీ లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అమరేందర్, ఎంపీపీ వరŠాధ్యవత్‌ రజితారాజునాయక్, జెడ్పీటీసీ రమేష్‌గౌడ్, ఎంపీటీసీ ఎండీ షాహిన్, పీఏసీఏస్‌ ఉపాధ్యక్షుడు లిక్కి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్, చింతపట్ల ఉప సర్పంచ్‌ పెండ్యాల వెంకటేష్‌ సాగర్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  

యాచారం: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం ఆయన మండల పరిధిలోని చింతపట్ల గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందులు, పాడి పశువులకు దాణా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సమావేశంలో మాట్లాడారు. మూగజీవాల ఆరోగ్యం విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. మూగజీవాల కోసం సర్కారు 1962 టోల్‌ఫ్రీ నంబరు ప్రవేశపెట్టిందని, ఆ నంబర్‌కు రైతులు పగలు, రాత్రి తేడా లేకుండా ఫోన్‌ చేయొచ్చని, వెంటనే అంబులెన్స్‌ వచ్చి సిబ్బంది చికిత్స చేస్తారని అన్నారు. ప్రతి పశువైద్యశాలలో ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు.

ఆ సమయంలో చింతపట్ల గ్రామానికి చెందిన రైతు బండ పర్వతాలు లేచి ‘సార్‌ నీవు చెప్పేది నిజం కాదు.. ఆస్పత్రిలో మందులు ఉండడం లేదు. డాక్టర్లు మెడికల్‌ దుకాణాల్లో కొనుగోలు చేసుకోమని అంటున్నారు. 1962కు ఫోను చేసినా అంబులెన్స్‌ రావడం లేద’ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చింతపట్ల వెటర్నరీ సబ్‌ సెంటర్‌లో ఒక్కరే సిబ్బంది ఉండడంతో ఇబ్బందిగా ఉందన్నాడు. దీంతో మంత్రి తలసాని ఆగ్రహానికి గురయ్యారు. పర్వతాలను పిలిచి ‘నీవు కాంగ్రెస్‌ పార్టీ నాయకుడివా... రా పైకి అంటు స్టేజీ మీదికి’ అంటూ పిలిచారు. మంత్రి సూచన మేరకు పర్వతాలు తన ఫోన్‌ ద్వారా 1962కు కాల్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. అక్కడే ఉన్న సంబంధిత అధికారులు తమ ఫోన్‌ ద్వారా కాల్‌ చేయగా స్పందించారు. మంత్రి వారితో మాట్లాడి రైతులు ఫోన్‌ చేస్తే ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై క్ష్రేతస్థాయిలో ఏ సెంటర్‌లోనైనా రైతులకు కావాల్సిన మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో ఫోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top