‘చెత్త’శుద్ధిపై చిత్త‘శుద్ధి’ | swachh bharat programme run as movement | Sakshi
Sakshi News home page

‘చెత్త’శుద్ధిపై చిత్త‘శుద్ధి’

Published Tue, Oct 21 2014 3:14 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM

‘చెత్త’శుద్ధిపై చిత్త‘శుద్ధి’ - Sakshi

‘చెత్త’శుద్ధిపై చిత్త‘శుద్ధి’

పరిసరాల పరిశుభ్రత కోసం జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి,

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు జిల్లా అధికారులు సోమవారం ‘చెత్త’శుద్ధిపై చిత్త‘శుద్ధి’ ప్రదర్శించారు. ‘స్వచ్ఛభారత్’ను జిల్లాలో విజయవంతం చేయిం చారు. కలెక్టర్, ఎస్పీ మొదలు కిందిస్థాయి ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వరకు ప్రతిఒక్కరూ చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. డ్రెయినేజీల్లో పేరుకు పోయిన సిల్ట్‌ను తొలగించారు. కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి, ఎస్పీ ఏవీ రంగనాథ్ పలుచోట్ల ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణ- ఆవశ్యకతను వివరించారు.
 
సాక్షి ప్రతినిధి, ఖమ్మం :     పరిసరాల పరిశుభ్రత కోసం జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి,  జిల్లా జడ్జి రమేశ్‌కుమార్, ఎస్పీ ఏవీ రంగనాథ్, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం మున్సిపాలిటీ ఇన్‌చార్జి కమిషనర్ వేణుమనోహర్ తదితరులు సోమవారం ఉదయం 7 గంటలకే చీపురు, పలుగు, పారలు పట్టుకున్నారు. నగరంలో చెత్తచెదారాలు, కాల్వల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించారు. కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారుల స్ఫూర్తితో మిగతా ఉద్యోగులు కూడా వారిని అనుసరించారు. కలెక్టర్, ఎస్పీ జిల్లా కేంద్రంతో పాటు కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ ప్రాంతాల్లో పర్యటించారు.

స్వచ్ఛభారత్‌ను నిరంతర ప్రక్రియ చేయాలని పిలుపునిచ్చారు. చెత్తాచెదారాలను తొలగించి పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలని కోరారు. మున్సిపాలిటీలు, పోలీస్ సబ్‌డివిజన్ కేంద్రాల్లో నిర్వహించిన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవే ట్ విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు పదివేల ట్రాక్టర్ల చెత్తను తొలగించి అరుదైన రికార్డును నెలకొల్పారు. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, ఇల్లెందు, మణుగూరు, మధిర తదితర ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వెనుక ఉన్న గోళ్లపాడు చానల్‌లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించటం ద్వారా జిల్లాలో ‘స్వచ్ఛభారత్’కు శ్రీకారం చుట్టారు. చెత్తపై సమరం మూణ్నాళ్ల ముచ్చట కావద్దని, ఇదో నిరంతర పోరాటంలా కొనసాగాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. నగర జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికులను నియమించాలని కోరారు. ఖమ్మంలోని గోళ్లపాడు చానల్‌లో సిల్ట్‌ను తొలగించి జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత ‘స్వచ్ఛభారత్’ను ప్రారంభించారు.

నగరంలో సుమారు మూడు కిలోమీటర్ల మేర ఈ కాల్వలో సిల్ట్‌ను తొలగించారు. గాంధీజయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని కలెక్టర్, ఎస్పీ, జెడ్పీ చైర్‌పర్సన్, ఖమ్మం ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మురుగునీటి వల్ల దోమలు వ్యాప్తి చెంది, వ్యాధులు ప్రబలుతాయన్నారు. పారిశుద్ధ్యంపై దృష్టిసారించాలన్నారు. నగరంలో 1928 టన్నుల చెత్తను తరలించారు. 23 జేసీబీలు, 191 ట్రాక్టర్లు, 20 టిప్పర్లను దీనికి ఉపయోగించారు.

కొత్తగూడెంలోని పాతబస్‌డిపో, శ్మశాన వాటిక ప్రాంతాలు, పాల్వంచలోని ఒడ్డుగూడెం, పాత గాంధీనగర్, హైస్కూల్‌రోడ్, బొల్లోరిగూడెం, వర్తకసంఘ భవనం తదితర ప్రాం తాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్తుపల్లిలో డీఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో చెత్తను తొలగించారు. ఇల్లెందులో ప్రభుత్వ, ప్రైవేట్, సింగరేణి సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమా న్ని నిర్వహించారు. భద్రాచలం, పాలేరు, మధిర, అశ్వారావుపేట తదితర నియోజకవర్గాల్లో ‘స్వచ్ఛభారత్’ విజయవంతంగా కొనసాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement