స్వచ్ఛత కొనసాగేనా? 

Swachh Bharat Mission  Works In Karimnagar Municipality - Sakshi

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛభారత్‌ మిషన్‌ సంయుక్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌–2019 పేరిట దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛత పోటీ పరీక్ష గురువారంతో ముగుస్తోంది. కేంద్ర బృందం చేపట్టిన స్వచ్ఛత సర్వే, నగరపాలక సంస్థ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ, యాప్‌తో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలన్నీ పరిగణలోకి తీసుకొని స్వచ్ఛత ర్యాంకును కేటాయించనున్నారు. ఈ పోటీలో మెరుగైన ర్యాంకు సాధించడానికి నాలుగు నెలలుగా కరీంనగర్‌ నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గ సభ్యులు కుస్తీ పట్టారు.

రోడ్ల వెంట చెత్త వేయకుండా,  బహిరంగ మలమూత్ర విసర్జన జరగకుండా, తడి, పొడి చెత్తను వేరు చేయడం, డంప్‌యార్డుకు చెత్తను తగ్గించడం, డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, నగరంలో సామూహిక టాయిలెట్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు కమ్యూనిటీ టాయిలెట్లను ఏర్పాటు చేసి పోటీ పరీక్షలో నిలబడ్డారు. ఈనెల 4 నుంచి శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టితో పనులు చేపట్టారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పనుల్లో నిర్లక్ష్యంగా లేకుండా స్వచ్ఛతకు పెద్దపీట వేసి చెత్తను కనబడకుండా కార్యాచరణతో ముందుకెళ్లారు.

మెరుగైన ర్యాంకు లక్ష్యంగా..
2015లో క్లీన్‌సిటీగా గుర్తించబడ్డ కరీంనగర్‌ నగరపాలక సంస్థ 2016లో 259వ ర్యాంకు, 2017లో 201 ర్యాంకు, 2018లో 73వ ర్యాంకు సాధించి ఏటేటా తన ర్యాంకు  మెరుగుపర్చుకుంది. యేటేటా సాధిస్తున్న ర్యాంకులతో ఉత్సాహంగా ఈయేడాది దేశ వ్యాప్తంగా 10లోపు ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పనిచేశారు. వాడవాడలా ఇంటింటికీ స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. మహిళా సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, బేకరీలు, ఇతర వ్యాపారులకు స్వచ్ఛత ఆవశ్యకతను తెలుపుతూ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేసి ప్రజల నుంచి సమస్యలను ఆహ్వానించారు. సర్వేక్షణ్‌ పరీక్ష ముగియనుండడంతో ఇక సర్వే నివేదిక, పదిలోపు ర్యాంకు పైనే ఆశలు పెంచుకున్నారు.

నిరంతరం కొనసాగేనా..?
స్వచ్ఛ సర్వేక్షణ్‌–2019 కోసం నగరపాలక సంస్థ పారిశుధ్యంలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లింది. అయితే స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీ ఉన్నప్పుడు మాత్రమే అధికారులు ఈ విధంగా పనులు చేపట్టడం, ఆ తర్వాత మళ్లీ యధావిధిగా శానిటేషన్‌ పనులు వదిలేస్తుండడంతో నగరంలో చెత్త సమస్య ఎప్పటికీ తీరడం లేదు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పుణ్యమా అని నాలుగ ునెలలుగా నగరంలో చెత్త కనబడడం లేదు. అధికారుల నిరంతర పర్యవేక్షణతో శానిటేషన్‌ పనులు సక్రమంగా జరిగాయి. నైట్‌ స్వీపింగ్, డే స్వీపింగ్‌ల్లో ఎక్కడా చెత్త కనబడకుండా చర్యలు చేపట్టారు. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చెత్తను రోడ్లపై వేయకుండా నియంత్రించారు. అయితే స్వచ్ఛత పరీక్ష గురువారంతో ముగియనుండడంతో శానిటేషన్‌ పనులు పోటీలో ఉన్నప్పటిలాగే నిర్వహిస్తారా? లేదా ఎప్పటిలాగే పరీక్ష ముగిసింది కదా అని చూసీచూడనట్లు వదిలేస్తారా..? అదే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. అధికారులు ఏ మేరకు శానిటేషన్‌పై శ్రద్ధ వహిస్తారో వేచి చూడాల్సిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top