వలస బతుకు ఛిద్రం | survival rupture | Sakshi
Sakshi News home page

వలస బతుకు ఛిద్రం

Feb 19 2015 4:05 AM | Updated on Sep 2 2017 9:32 PM

తరాలు మారుతున్నా... పాలకులు మారుతున్నా... పాలమూరు వలస జీవుల కష్టాలు మారడం లేదు. పుట్టిన ఊరులో పంటలు సాగు చేస్తే నష్టాలు వచ్చి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

తరాలు మారుతున్నా... పాలకులు మారుతున్నా... పాలమూరు వలస జీవుల కష్టాలు మారడం లేదు. పుట్టిన ఊరులో పంటలు సాగు చేస్తే నష్టాలు వచ్చి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చేసిన అప్పులను తీర్చడానికి కూలీలుగా మారి పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అక్కడ జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు విడిచి కుటుంబసభ్యులకు తీరని బాధను మిగిలిస్తున్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయే వలస కుటుంబాలను ఆదుకునే వారు కరువై మళ్లీ వలస బాట పడుతున్నారు. వలస వెళ్లి ప్రాణాలు వదిలిన కుటుంబాల దీనగాథలివి...
 
 కన్నీరు మిగిల్చిన వలస
 బొంరాస్‌పేట: మండలంలోని మెట్లకుంటకు చెందిన కావలి హన్మయ్మ, సత్యమ్మల పెద్ద కొడుకు కావలి వెంకట్రాములు(29) పదో తర గతి వరకు చదువకున్నాడు. ఉపాధి లేకపోవడంతో గ్రామస్తుల ప్రధాన జీవనోపాధి అయిన ‘విదేశీ వలస’ను బతుకుదెరువుగా ఎంచుకున్నాడు. రూ.50వేలకుపైగా అప్పు చేసి 2007లో దుబాయ్ వలస వెళ్లాడు. అక్కడ నెలసరి వేతనం రూ.5వేలకు కూలి పని చేస్తూ ఉండగా రెండేళ్ల తర్వాత అనారోగ్యానికి గురవ్వడంతో స్వగ్రామానికి తిరిగి పంపారు. ఇంటికి తిరిగి వచ్చిన కొడుకు వెంకట్రాములుకు వైద్యం చేయించేందుకు తల్లిదండ్రులు మరో లక్షన్నరకు పైగా అప్పులు చేసినా కొడుకును బతికించుకోలేకపోయారు. అప్పులు తీర్చేందుకు చిన్నకొడుకు రూ.50వేలకు పైగా అప్పుచేసి వలస వెళ్లినా... అక్కడ పనిలేదని తిరిగి వచ్చేశాడు. చివరకు తమ ఇల్లును అమ్ముకున్న డబ్బులు వడ్డీకి సరిపోలేదు. సొంత ఇల్లు కూడా లేక ఈ గ్రామంలో తమ కూతురు సులోచన ఇంట్లో తల్లిదండ్రులు తలదాచుకుటంన్నారు. తమకు ఆసరా ఉంటూ ఆదుకునే అల్లుడు వెంకటయ్య సైతం గుండెపోటుతో చనిపోయాడు. వలస అన్ని వైపులా అనాథలను చేసిందని ఆ ముసలి తల్లిదండ్రులు కన్నీరుపెడుతున్నారు.
 
 కట్టుకున్నోడు పాయె... కన్నోడు పాయె...
 తమ్మగళ్ల్ళ అంతప్ప, పెంటమ్మల కొడుకు రత్నయ్య(25) కుటుంబ పోషణకు తన పెళ్లికి, ఇల్లుకు డబ్బులు వెనకేసుకుందామని 2008లో దుబాయ్ వలస వెళ్లాడు. మూడు నెలల తర్వాత అక్కడే అనుకోకుండా ఇంట్లో నిద్రిస్తూ 2008లో మృత్యువాతపడ్డాడు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఈ గ్రామానికి చెందిన కొందరు వలసవాదులు విరాళాలు సేకరించి శవాన్ని ఇంటికి పంపారు. మరణానంతరం వచ్చిన ఇన్సురెన్స్ డబ్బులు అప్పుల కిందకే సరిచేసుకుని ఖర్చులకు కొంతమాత్రమే ఇచ్చారు. కొద్దిరోజులకే రత్నయ్య తండ్రి అంతప్ప గుండెపగిలి చనిపోయాడు. దీంతో కట్టుకున్నోడు, కన్నకొడుగు చనిపోవడంతో ఆ తల్లి అనాథగా మారింది. ప్రభుత్వ వితంతు పింఛన్‌తో కాలం గడుపుతోంది.
 
 మైసూర్ వెళ్లి మట్టిలో కలిసె...
 అడ్డాకుల: మూసాపేటకి చెందిన జింకలి వెంకటమ్మ(41), సాయిలు భార్యభర్తలు. బీసీ కాలనీలో సొంత ఇంటి నిర్మాణం చేపట్టగా అప్పుల పాలయ్యాడు. ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపేసి 2014 జవనరిలో పెద్దమందడి మండలం బలీదుపల్లి గుంపు మేస్త్రీ వెంట కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న మరికేరీ వద్ద భవన నిర్మాణం పనులకు ముగ్గురు మగ పిల్లలను తీసుకుని భార్యభర్తలు వలస వెళ్లారు. అదేఏడాది మే 25న భవన నిర్మాణం కోసం 10మీటర్ల లోతున గుంతను తవ్వుతుండగా వెంటకమ్మపై మట్టి దిమ్మె కూలీ పడింది. మట్టిని తీసి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించే సరికి వెంకటమ్మ ప్రాణాలు వదిలింది. భార్యను కోల్పోయిన సాయిలు తన ముగ్గురు పిల్లలు యాదగిరి, శ్రీకాంత్, నరేష్‌లతో కలిసి మూసాపేటలోనే ఉంటున్నాడు. సొంతపొలం లేకపోవడంతో పూట గడవడం కష్టంగా మారడంతో పెద్ద కుమారుడు యాదగిరిని మహారాష్ట్రకు వలస పంపాడు. రెండో కొడుకు శ్రీకాంత్‌ను షాపుల్లో పనికి పెట్టాడు. చిన్న కుమారుడు నరేష్(2వ తరగతి)ను బడికి పంపుతున్నాడు. ఇంతలోనే డిసెంబర్ 13న జరిగిన రోడ్డు ప్రమాదం సాయిలును మంచానికే పరిమితం చేసింది. కాలు విరగడంతో నెల రోజులు హైదరాబాద్‌లోఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చాడు. మళ్లీ అప్పుల్లో కూరుకుపోయాడు. ఇప్పుడు లేచి నడవలేని స్థితిలో ఉన్న సాయిలుకు తల్లి కొండమ్మ, చెల్లెలు నాగమ్మలు సేవలందిస్తున్నారు. ఇలా సాయిలు కుటుంబాన్ని వలస చిధ్రం చేసింది. వలస వెళ్లిన చోట భార్యను కోల్పోయిన సాయిలు తన పెద్ద కొడుకును మరో రాష్ట్రానికి మళ్లీ వలస పంపించాడు. లేవలేని స్థితిలో ఉన్న సాయిలు రోదించని క్షణమంటూ లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement