ఉద్యమంలా.. సర్వే! | Survey of movement ..! | Sakshi
Sakshi News home page

ఉద్యమంలా.. సర్వే!

Aug 8 2014 4:51 AM | Updated on Mar 21 2019 8:35 PM

రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు ఈనెల 19న ఇంటింటి సర్వేను జిల్లాలో ఉద్యమంలా చేపట్టి విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.

ముకరంపుర : రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు ఈనెల 19న ఇంటింటి సర్వేను జిల్లాలో ఉద్యమంలా చేపట్టి విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. కుటుంబ సర్వే ను పకడ్బందీగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ గురువారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశమయ్యా రు. సర్వే నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
 
  నాలుగు గంటలపాటు పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పిం చారు. సర్వేపై జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. సిబ్బంది లభ్యత, కొరతపై దృష్టి సారించాలని సూచించారు. అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆదేశించారు.
 
 9.70 లక్షల కుటుంబాలు
 జిల్లాలో 9.70 లక్షల కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు 32,500 మంది ఉద్యోగులు అవసరమని గుర్తించి ఆ మేరకు క్షేత్రస్థాయిలో ప్రణాళిక రూపొందించారు. ప్రతి ఉద్యోగి 25 నుంచి 30 ఇళ్లు సర్వే చేసే లా సన్నద్ధం చేస్తున్నారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్, 20 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించారు. గ్రామస్థాయి లో విలేజ్  ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. సర్వేకు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, గురుకుల పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉపయోగించాలని ఇన్‌చార్జి కలెక్టర్ సూచించారు.
 నేటి నుంచి నోషనల్ సీరియల్ నంబర్
 జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో అన్ని ఇళ్లకు నంబర్లు వేయాలని  సర్ఫరాజ్ సూచించారు. వరుస క్రమంలో ఒకటి నుంచి మొదలుపెట్టి ప్రక్రియను ( నోషనల్ సీరియల్ నంబర్) ఈ నెల 12లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు.
 
  వంద మంది ఎన్యుమరేటర్లకు ఒక మాస్టర్ ట్రైనర్‌ను నియమించాలని, వారితో శిక్షణ ఇప్పించాలని సూచించారు. మున్సిపాలిటీల్లో సర్వే బాధ్యత కమిషనర్లదేనని, మండల స్థాయిలో తహశీల్దార్లు బాధ్యత వహించాలని ఆదేశించారు. ఆగస్టు 19న ఇంటింటి సర్వే గురించి అన్ని గ్రామాల్లో ప్రతి రోజు చాటింపు వేయించాలన్నారు. మున్సిపాలిటీల్లో ఆటోల ద్వారా విస్తృత ప్రచారం చేయించాలని సూచించారు. డివిజన్, మండల స్థాయి అధికారులు పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలన్నారు.
 
 సర్వే ఇలా..
 ఇంటింటి సర్వే సందర్భంగా ఎన్యుమరేటర్లు ముఖ్యంగా గ్యాస్ కనెక్షన్, వయసు ధ్రువీకరణపత్రాలు, పోస్టాఫీస్, బ్యాంకు పుస్తకాలు, పింఛన్ గుర్తింపుకార్డు, స్వశక్తి సంఘాల పాస్‌బుక్‌లు, ఆధార్ కార్డులు, వికలాంగుల సదరన్ సర్టిఫికెట్లు, విద్యుత్ బిల్లులు, భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్కులు, టైటిల్‌డీడ్, వాహనాలకు సంబంధించిన ఆర్‌సీ బుక్‌లు, పశుసంపద వివరాలు, ఓటరు గుర్తింపుకార్డులను పరిశీలించి వివరాలు నమోదు చేసుకుంటారని తెలిపారు.
 
 ప్రజలు పత్రాలన్నింటినీ ఇంటికొచ్చే ఎన్యుమరేటర్‌కు చూపించాలని, అందుకనుగుణంగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మండలస్థాయి సిబ్బందికి తహశీల్దార్లు సర్వేపై శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు జేసీ టి.నంబయ్య, డీఆర్‌వో టి.వీరబ్రహ్మయ్య, డీఆర్‌డీఏ పీడీ విజయగోపాల్, జెడ్పీ సీఈవో సదానందం, సీపీవో సుబ్బారావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement