‘పంచాయితీ’ ఇద్దరిదే | Supreme Court verdict on Krishna Water Disputes | Sakshi
Sakshi News home page

‘పంచాయితీ’ ఇద్దరిదే

Published Tue, Jan 10 2017 1:16 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

‘పంచాయితీ’ ఇద్దరిదే - Sakshi

‘పంచాయితీ’ ఇద్దరిదే

‘కృష్ణా’ జలాల పంపిణీపై రాష్ట్రానికి ఎదురుదెబ్బ  
నీటిని నాలుగు రాష్ట్రాల మధ్య పంచాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంచడమే సమంజసం.. ‘బ్రిజేశ్‌’ తీర్పును సమర్థించిన బెంచ్‌
తెలంగాణ మళ్లీ విడిపోతే ఇంకోసారి కేటాయింపులు జరుపుతారా?.. ఇలా అన్నిసార్లు తిరగదోడలేం కదా?
బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 89 విస్తృతార్థాన్ని విస్మరించింది: తెలంగాణ న్యాయవాది
మా వాదనలను ట్రిబ్యునల్‌ వినలేదు..కేంద్రం పట్టించుకోలేదు.. మీరు వినడం లేదు
ఇక న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్న


సాక్షి, న్యూఢిల్లీ
కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో తెలంగాణకు ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణా జలాలను ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకతో సంబంధం లేకుండా ఏపీ, తెలంగాణ మధ్యే పంచాలంటూ జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది. ట్రిబ్యునల్‌ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 89కు కృష్ణా నదీ జలాల కేటాయింపు విషయంలో.. కర్ణాటక, మహారాష్ట్రలతో సంబంధం లేదని, కేవలం ఏపీ, తెలంగాణ మధ్యే నీటిని పంచాలంటూ బ్రిజేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ట్రిబ్యునల్‌ ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటినే పంచితే తమకు అన్యాయం జరుగుతుందని, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాల మధ్య తిరిగి పంపకాలు చేపట్టాలని ఈ పిటిషన్‌లో కోరింది. సోమవారం ఈ పిటిషన్‌ జస్టిస్‌ మదన్‌ బి లోకూర్, జస్టిస్‌ ప్రఫుల్ల సి.పంత్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. తెలంగాణ తరపున సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ వాదనలు వినిపించారు.

ఆ సెక్షన్‌లోని విస్తృతార్థాన్ని ట్రిబ్యునల్‌ విస్మరించింది
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కారణంగా కృష్ణా ట్రిబ్యునళ్ల వద్ద తమ ప్రాంత సమస్యలు, ప్రయోజనాలను వినిపించే అవకాశం తెలంగాణకు లేకపోయిందని వైద్యనాథన్‌ ధర్మాసనానికి నివేదించారు. ‘‘నిధులు, నియామకాలు, నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందనే రాష్ట్రం విడిపోయింది. విభజన చట్టంలో ఈ ప్రయోజనాలను కాపాడేందుకే కేంద్రం సెక్షన్‌ 89ను పొందుపరిచింది. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యే నీటి పంపకానికైతే సెక్షన్‌ 84 సరిపోతుంది. కానీ ప్రాజెక్టుల వారీ కేటాయింపులు అన్న నిర్దిష్ట నిబంధనను పొందుపరచడం ద్వారా కృష్ణా నదీ జలాలను నదీ పరివాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాలకు పంచాలని చట్టం యోచించింది. అయితే అందులోని విస్తృతార్థాన్ని ట్రిబ్యునల్‌ విస్మరిస్తూ తెలంగాణ విజ్ఞప్తిని తోసిపుచ్చింది’’అని పేర్కొన్నారు. ఇందుకు జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ స్పందిస్తూ ‘‘తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఏ, తెలంగాణ బీ, తెలంగాణ సీ.. ఇలా మూడు రాష్ట్రాలుగా విడిపోయిందనుకుందాం. అప్పుడు మళ్లీ అన్ని రాష్ట్రాలకు నీటి కేటాయింపులు మొదట్నుంచీ చేస్తారా? ఇలా అన్నిసార్లు తిరగదోడలేం కదా?’’అని ప్రశ్నించారు. దీనికి వైద్యనాథన్‌ బదులిస్తూ... ‘‘ఇదొక ముఖ్యమైన మలుపు.

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956 ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపని పక్షంలో ట్రిబ్యునల్‌ ఇప్పుడు జరపాలని విభజన చట్టంలోని సెక్షన్‌ 89 నిర్వచిస్తోంది. అలాగే.. నదిలో తక్కువ ప్రవాహం ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు వదలాలన్న ఆపరేషన్‌ ప్రోటోకాల్‌ను కూడా ట్రిబ్యునల్‌ నిర్దేశించాలి. అయితే ఇదివరకు పైరాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో ప్రాజెక్టు వారీగా కేటాయింపులు గానీ, ఆపరేషన్‌ ప్రొటోకాల్‌నుగానీ నిర్దేశించలేదు. అలాంటప్పుడు సెక్షన్‌ 89ను కేవలం కింది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు మాత్రమే వర్తింపజేస్తే నీళ్లెలా వస్తాయి? పంపకాలు కేవలం కొత్త రాష్ట్రాల మధ్యే అయినప్పుడు సెక్షన్‌ 89 అవసరమే లేదు. కేవలం సెక్షన్‌ 84 సరిపోతుంది’’అని విన్నవించారు. అయితే ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించ లేదు.

న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి?
‘‘రాష్ట్రం విడిపోయిందే నీటి కోసం. రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే మేం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956 కింద కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాం. కృష్ణా నదీ జలాలను తిరిగి నాలుగు రాష్ట్రాలకు పంచాలని అడిగాం’’అని వైద్యనాథన్‌ పేర్కొన్నారు. ఏడాదిలోపు పరిష్కరించాల్సిన తమ పిటిషన్‌ను కేంద్రం పట్టించుకోలేదని వివరించారు. ‘‘ఇదే కోర్టులో మరో ధర్మాసనం వద్ద ఆ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. దానిపైనా కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. అవార్డుకు సంబంధించిన కేసులు ఇప్పటికే నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రిబ్యునల్‌ మా వాదనలు పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు మా వాదన వినడం లేదు. ఇంకా న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి?’’అని ప్రశ్నించారు.

అంతకుముందు కర్ణాటక తరపున సీనియర్‌ న్యాయవాది నారీమన్‌ వాదనలు వినిపిస్తూ... విభజన చట్టంలోని కారణాలు, ఉద్దేశాలను విశ్లేషిస్తే నదీ జలాల పంపకానికి ప్రాతిపదిక దొరుకుతుందన్నారు. విభజన చట్టంతో కర్ణాటకకుగానీ, మహారాష్ట్రకుగానీ సంబంధమే లేదని వాదించారు. మహారాష్ట్ర తరపున సీనియర్‌ న్యాయవాది ఈ వాదనలకు మద్దతు పలికారు. చివరకు ధర్మాసనం తెలంగాణ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే ఈ ఉత్తర్వులు పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లపై ప్రభావం చూపరాదన్న తెలంగాణ అభ్యర్థనను మన్నించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement