జస్టిస్‌ రామయ్యగారి సుభాష్‌రెడ్డికి పదోన్నతి 

Supreme Court Collegium Decided about Promotion of Justice Subhash Reddy  - Sakshi

     సుప్రీంకోర్టు న్యాయమూర్తి పోస్టుకు సిఫారసు 

     తెలంగాణ రాష్ట్ర కోటాలో సిఫారసు చేసిన కొలీజియం 

     అత్యంత సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరు 

     న్యాయ నైపుణ్యం, నిజాయితీలే ప్రామాణికం

సాక్షి, హైదరాబాద్‌: గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రామయ్యగారి సుభాష్‌రెడ్డికి పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఆయన పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫారసు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్, జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్, జస్టిస్‌ ఎ.కె.సిక్రీ, జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డేలతో కూడిన కొలీజియం బుధవారం సమావేశమై కేంద్రానికి సిఫారసు పంపించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రతీ రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఉంది. అయితే తెలంగాణ నుంచి సుప్రీంకోర్టులో ఒక్క న్యాయమూర్తి కూడా లేరు. దీంతో తెలంగాణకు చెందిన జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పోస్టుకు సిఫారసు చేసింది. అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా జస్టిస్‌ సుభాష్‌రెడ్డికి న్యాయవర్గాల్లో మంచిపేరు ఉంది. ఆయన నియామకానికి త్వరలోనే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయనున్నారు. 

జస్టిస్‌ సుభాష్‌రెడ్డి నేపథ్యం... 
జస్టిస్‌ సుభాష్‌రెడ్డి 1957 జనవరి 5న మెదక్‌ జిల్లా, శంకరంపేట మండలం, కమరం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విశాలాదేవి, జగన్నాథరెడ్డి. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం శంకరంపేటలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో సాగింది. హైదరాబాద్, ఆంధ్రా కాలేజీ నుంచి ఇంటర్, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1980 అక్టోబర్‌ 30న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి వద్ద న్యాయవాద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన అంశాల్లో వృత్తి నైపుణ్యాన్ని సాధించారు. తక్కువ సమయంలో స్వతంత్రంగా ప్రాక్టీస్‌ చేసే స్థాయికి ఎదిగారు. సంస్కృతి, కళలు, సంగీతంపై మక్కువ చూపే జస్టిస్‌ సుభాష్‌రెడ్డి ఎస్‌వీ యూనివర్సిటీ, జేఎన్‌టీయూలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2001–02లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సౌమ్యుడు, వివాదరహితుడు కావడంతో అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2002 డిసెంబర్‌ 2న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 జూన్‌ 24న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువరించారు. 2016 ఫిబ్రవరి 13న పదోన్నతిపై గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతున్నారు. జస్టిస్‌ సుభాష్‌రెడ్డి న్యాయ నైపుణ్యాన్ని, నిజాయితీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి పోస్టుకు సిఫారసు చేసింది.  

ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌... 
కర్ణాటక హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్‌ రాఘవేంద్ర ఎస్‌.చౌహాన్‌ను ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రా నికి సిఫారసు చేస్తూ ఈ నెల 29న కొలీజి యం తీర్మానం చేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ ఉత్తరాఖండ్‌ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన విషయం తెలిసిందే. ఆయన స్థానంలోకి జస్టిస్‌ చౌహాన్‌ వస్తున్నారు. ఆయన నెంబర్‌ టు స్థానంలో కొనసాగుతారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని కొలీజియంలో జస్టిస్‌ చౌహాన్‌ సభ్యులుగా ఉంటారు. జస్టిస్‌ చౌహాన్‌ ఉమ్మడి హైకోర్టుకు వచ్చిన తర్వాత కొలీజియం మరికొందరు న్యాయవాదుల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఎవ రిని చేర్చాలన్న విషయంపై కొలీజియంలోని న్యాయమూర్తులు ఇప్పటికే ఓ ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top