అన్నీ ఒకేచోట

Sub Registrars in Mythri Vihar Registrar - Sakshi

రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల తరలింపు  

మైత్రీవిహార్‌లో రిజిస్ట్రార్, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు  

ఏర్పాటుకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ చర్యలు  

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల తరలింపుపై వ్యతిరేకత

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల తరలింపునకు రంగం సిద్ధమైంది. జిల్లా రిజిస్ట్రార్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ కార్యాలయాలతో పాటు పలు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులను తరలించేందుకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అమీర్‌పేటలోని మైత్రీవిహార్‌ భవన సముదాయంలో వీటిని ఏర్పాటు చేయనుంది. రెడ్‌హిల్స్, ఎర్రగడ్డలలోని హైదరాబాద్, హైదరాబాద్‌ (సౌత్‌) జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, హైదరాబాద్, గోల్కొండ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ కార్యాలయాలతో పాటు గోల్కొండ, కూకట్‌పల్లి, బాలానగర్, సంజీవ్‌రెడ్డి నగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల తరలింపునకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌ఎండీఏకు చెందిన మైత్రివిహార్‌ భవనాన్ని రిజిస్ట్రేషన్‌ శాఖ అద్దెకు తీసుకుంది. మైత్రీవిహార్‌ భవనం మొదటి అంతస్తులోని బాక్ల్‌ 1–7 వరకు హైదరాబాద్‌ జిల్లా రిజిస్ట్రార్‌ ఆఫీస్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ (హైదరాబాద్‌), గోల్కొండ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేస్తారు. రెండో అంతస్తులో బ్లాక్‌ 4, 5లలో కూకట్‌పల్లి, బాలానగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు ఏర్పాటు చేయనున్నారు. స్వర్ణజయంతి భవనంలోని 5, 6 అంతస్తుల్లో హైదరాబాద్‌ (సౌత్‌) రిజిస్ట్రార్, సంజీవరెడ్డినగర్‌ సబ్‌ రిజిస్ట్రార్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ (గోల్కొండ) ఆఫీసులు ఏర్పాటు చేస్తారు.  

స్థానికుల వ్యతిరేకత..
సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల తరలింపుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. అధికార వికేంద్రీకరణ రూపంలో ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకు తీసుకొస్తున్న తరుణంంలో... ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలను దూర ప్రాంతాలకు తరలించడం విస్మయానికి గురిచేస్తోందని అంటున్నారు. మెరుగైన సేవలను అందించకపోయినప్పటికీ కనీసం అందుబాటులో ఉన్న కార్యాలయాలను దూర ప్రాంతాలకు తరలించవద్దంటూ మొరపెట్టుకుంటున్నారు. అదే విధంగా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు పదిధి దాటి ఏర్పాటవుతున్నాయి. నగరంలో రిజిస్ట్రేషన్‌ శాఖకు అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న కూకట్‌పల్లి, బాలానగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ప్రాంత పరిధులను దాటి ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. మూసాపేటలోని కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ద్వారా హైదర్‌నగర్, శంషీగూడ, కూకట్‌పల్లి, బాగ్‌ అమీరీ గ్రామాల పరిధిలోని ఖాళీ స్థలాలు, అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత గృహాల రిజిస్ట్రేషన్లు, వివాహ రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ప్రతినెలా సుమారు రూ.16 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. అదేవిధంగా బాలానగర్‌లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ద్వారా బాలానగర్, మూసాపేట, మోతీనగర్, ఫతేనగర్, ఓల్డ్‌ బోయిన్‌పల్లి గ్రామాల పరిధిలో రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించాల్సిన తరుణంలో దూర ప్రాంతాలకు తరలించడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

తరలించొద్దు  
అందరికీ అందుబాటులో ఉండే కార్యాలయాలను ఎక్కడో దూరంలో ఉండే అమీర్‌పేటకు మార్చాలనుకోవడం సరికాదు. అమీర్‌పేటకు వెళ్లాలంటే ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సిందే. ఎక్కడైనా ప్రజల వద్దకు వచ్చి సేవలు అందించాలనుకుంటారు. రిజిస్ట్రేషన్‌ అధికారులు మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించడమేమిటో అర్థం కావడం లేదు.    – వెంకటేశ్, బాలాజీనగర్‌  

యథాతథమే మేలు  
ప్రస్తుత కార్యాలయాలు స్థానికులకు అందుబాటులో ఉన్నాయి. అమీర్‌పేటకు తరలిస్తే ప్రజలకు మరింత భారం తప్పదు. సమాచారం మొదలు సేవలకు వరకు ప్రతి దానికీ శ్రమించాల్సి వస్తుంది. యథావిధిగా కొనసాగించడం మేలు.– అంజిబాబు, కేపీహెచ్‌బీ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top