సీఎంను కలిసిన బాల మేధావులు 

Students Meets KCR In Ramagundam - Sakshi

ఉన్నత చదువులకు అనుమతించాలని వినతి

సానుకూలంగా స్పందించిన కేసీఆర్‌   

గోదావరిఖని (రామగుండం): అద్భుత మేధో సంపత్తితో చిన్న వయసులోనే పదోతరగతి పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించిన చిన్నారులు ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తమ మనసులోని మాటను విన్నవించడంతోనే.. సీఎం సానుకూలంగా స్పందించి వారి సమస్యను తీర్చాలని చీఫ్‌  సెక్రటరీ ఎస్‌.కె.జోషిని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెలుక గ్రామానికి చెందిన మూల విష్ణువర్ధన్‌రెడ్డి– సరిత దంపతులు ప్రస్తుతం సీసీసీ నస్పూర్‌కాలనీలో ఉంటున్నారు. వీరి కూతురు వర్షితారెడ్డి, కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి 4, 3వ తరగతి చదువుతున్నారు. అయితే అద్భుత జ్ఞాపకశక్తితో పదో తరగతి పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలని ఇటీవల శ్రీరాంపూర్‌ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని వేడుకున్నారు.  సీఎం సానుకూలంగా స్పందించినప్పటికీ అధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో కోర్టు ఆదేశాల ద్వారా ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో ఇద్దరు చిన్నారులు పరీక్షలు రాశారు.  బాబుకు 61 శాతం, పాపకు 73 శాతం మార్కులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉన్నత చదువుల కోసం అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చారు. హైదరాబాద్‌కు బయలుదేరేందుకు సీఎం బయటకు వచ్చిన క్రమంలో అక్కడ నిలబడి ఉన్న పిల్లలను పిలుచుకుని మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సీఎస్‌కు సూచించారు. వీరికి అన్ని రకాలుగా సహకరించాలని ఆదేశించారు.

సంతృప్తి లభించింది 
గెస్ట్‌హౌస్‌ వద్ద ఉన్న పిల్లలను గుర్తుపట్టి ముఖ్యమంత్రి దగ్గరకు పిలవడం జీవితంలో మరిచిపోలేం. మా బాధను అర్థం చేసుకొని వెంటనే పరిష్కరించాలని చీఫ్‌ సెక్రెటరీకి సూచించడం ఎంతో సంతోషానిచ్చింది. అడ్రస్‌ రాసిచ్చేందుకు పెన్ను కూడా లేకపోవడంతో సీఎం స్వయంగా తన వద్ద ఉన్న పెన్ను ఇచ్చి అడ్రస్‌ తీసుకోవడం జీవితానికి సరిపడే సంతృప్తినిచ్చింది. మా పిల్లలకు ముఖ్యమంత్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. 
చిన్నారుల తల్లిదండ్రులు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top