
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిలా మారిపోతోంది. ఇంత ఎండల్లోనూ సీబీఎస్‌ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులు.. పాఠశాలలకు వెళ్లక తప్పడం లేదు. సీబీఎస్‌ఈ పాఠశాలల్లో వార్షిక పరీక్షలు ముగిసినా.. యాజమాన్యాలు కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించి తరగతులను కొనసాగిస్తుండటమే దీనికి కారణం. ఎండల తీవ్రతతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నా.. విద్యాశాఖ, ప్రభుత్వం స్పందించడం లేదు.
గతేడాది ఇలానే..
గతేడాది ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరడంతో.. ప్రభుత్వం పాఠశాలలకు అత్యవసరంగా సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 20వ తేదీ నుంచే సీబీఎస్‌ఈ స్కూళ్లు సహా అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇప్పుడు కూడా ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరాయి. అయినా సీబీఎస్‌ఈ స్కూళ్లు కొనసాగుతున్నాయి. ఎండలు ఇంతగా ఉన్నా సీబీఎస్‌ఈ పాఠశాలల్లో బోధన కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది వరకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
స్పందించే వారెవరు?
ఎండల తీవ్రత సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా ఉన్నా, వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉన్నా ఉదయం 11 గంటలలోపు పాఠశాలల్లో బోధనను పూర్తి చేసి విద్యార్థులను ఇళ్లకు పంపించాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం గతంలో కంటే వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని పాఠశాలకు ఈనెల 12 నుంచే సెలవులు ప్రకటించినా.. సీబీఎస్‌ఈ స్కూళ్ల గురించి విద్యాశాఖ పట్టించుకోలేదు. ఆయా స్కూళ్లు సీబీఎస్‌ఈ అకడమిక్ కేలండర్ ప్రకారం తరగతులను కొనసాగిస్తూనే ఉన్నాయి.
కల్పించుకునే అధికారమున్నా..
రాష్ట్రంలోని పాఠశాలల నిర్వహణకు సంబంధించిన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ తప్పకుండా ఉంటుందని ఇదివరకే సీబీఎస్‌ఈ కూడా స్పష్టం చేసింది. ఈ లెక్కన సీబీఎస్‌ఈ స్కూళ్లకు సెలవులు ప్రకటించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించవచ్చు. కానీ ప్రభుత్వం, విద్యాశాఖ స్పందించడం లేదు. ఎండలు పెరిగిపోయిన నేపథ్యంలో.. వెంటనే సెలవులు ప్రకటించాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
కొన్ని స్కూళ్లు మాత్రం..
గతేడాది వేసవిలో అత్యవసరంగా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో.. సీబీఎస్‌ఈ స్కూళ్లు కూడా సెలవులు ఇవ్వాల్సిందేనని, ఆ మేరకు పనిదినాలను సర్దుబాటు చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. దాని ప్రకారం ఈసారి కూడా కొన్ని సీబీఎస్‌ఈ స్కూళ్ల యాజమాన్యాలు పనిదినాలను సర్దుబాటు చేసుకుని పాఠశాలలకు సెలవులను ప్రకటించాయి. కానీ చాలా పాఠశాలలు మాత్రం సెలవులను ప్రకటించకుండా.. పాఠశాలల్లో బోధనను కొనసాగిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడకతప్పడం లేదు.