
సెల్ఫీ దిగుతున్న రోజా
సనత్‌నగర్: రోజా..ఓ ఎమ్మెల్యే, సినీ నటి, మాలినీ కృష్ణమూర్తి..ఓ ఐపీఎస్ అధికారి, మృదుల..ఓ సామాజిక చైతన్య రథసారథి, మల్లిక...ఓ జాయింట్ డైరెక్టర్ (డీజీపీ కార్యాలయం తెలంగాణ), నాగమణి..ఓ సైంటిస్ట్, స్వర్ణలత...ఓ పారిశ్రామికవేత్త, మాధవి..ఓ గృహిణి...ఇలా ఆకాశంలో సగం...అవనిలో సగం అన్న మాటను అక్షరాల నిజం చేసిన శ్రీపద్మావతి ఉమెన్స్ కాలేజ్ (తిరుపతి) పూర్వ విద్యార్ధుల అపూర్వ కలయిక ఆదివారం జరిగింది. బేగంపేటలోని తాజ్‌వివంతా హోటల్ ఇందుకు వేదికైంది. 1964 బ్యాచ్ నుంచి మొదలుకొని 2,000 బ్యాచ్ వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో ఆనందంగా సాగింది.ఒకరికొకరు చూసి పోల్చుపోలేకపోయినా శ్రీపద్మావతి ఉమెన్స్ కళాశాల (ఎస్‌పీడబ్ల్యూసీ) కళాశాల అందించిన జ్ఞాపకాల పూదోటలో విహరించి తరించారు. ఆనాటి మధు ర స్మృతులను నెమరువేసుకున్నారు. ఒక్కసారి చిన్న పిల్లలుగా మారి తాము చేసిన అల్లరి, చిలిపిచేష్టలను గుర్తుచేసుకుని ఆనందంలో ముగినిపో యారు. దాదాపు 40, 50 ఏళ్ళ తరువాత కలుసుకున్న ఎస్‌పీడబ్ల్యూ కాలేజీ మేట్స్, క్లాస్ మేట్స్, బెంచ్‌మేట్స్ ఆత్మీయ ఆలింగనంతో ఒకింత ఉద్వే గానికి లోనయ్యారు. ఆనాటి అధ్యాపకులు తమ పట్ల చూపిన అభిమానానికి ఆ పూర్వ విద్యార్థలు సలాం కొట్టి ఘనంగా సత్కరించుకున్నారు.
ఆ ఇద్దరి చొరవతో...
ఎస్‌పీడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కమలామీనన్, జువాలజీ లెక్చర్‌గా పనిచేసిన హేమావతిలు ప్రత్యేక చొరవ తీసుకుని పూర్వ విద్యార్ధులను కలిపారు. దాదాపు నెల రోజుల పాటు ఇందుకు కసరత్తు చేశారు. కొంతమంది పూర్వ విద్యార్ధుల సహాయంతో ఫేజ్‌బుక్, ఫోన్ నెంబర్ల ఆధారంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులను సంప్రదించి ఒక్క చోట కలవడంలో కీలకపాత్ర పోషించారు. ఈ ఏడాది జులై 29న తిరుపతిలో మొట్టమొదటి అలుమ్నీ మీట్‌గా జరగగా ఇది రెండోది. తమ పూర్వ విద్యార్ధులు ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ వారి నుంచి ఏమాత్రం ఆశించకుండా సొంత ఖర్చుతో తామే అన్నీ అయ్యి ఈ అపూర్వ కలయిక జరపడం గమనార్హం.
జ్ఞాపకాల దొంతరలతో పులకింత...
ఎస్‌పీడబ్ల్యూ కళాళాల పూర్వ విద్యార్ధుల కలయితో తాజ్‌వివంతా హోటల్ జ్ఞాపకాల దొంతరలతో పులకించిపోయింది. బురుజులతో అంతఃపురాన్ని తలపించే శ్రీదేవి, భూదేవి హాస్టల్స్ భవనాలు...శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతిసారీ ఆ కొండలపై నుంచి మా కాలేజీ కనిపిస్తోందా? అని తరిచి చూసిన క్షణాలు..అప్పుడే పదో తరగతి పూర్తి చేసుకుని పాఠశాలను దాటి కళాశాలకు వచ్చిన తమకు జీవితమంటే ఏమిటో తెలియజేసిన అధ్యాపకులు కమలా మీనన్ మేడమ్, హేమావతి మేడమ్, శాంతి మేడమ్, కామేశ్వరి మేడమ్, కృష్ణవేణి మేడమ్, విజయలక్ష్మి మేడమ్...ఇలా ఎందరో తమలో స్ఫూర్తి నింపారంటూ ఆ పూర్వ విద్యార్ధులు ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.
ఒక్క ఫొటో ఛాన్స్ కోసం తపన..
ఆమె సెలబ్రీటీ కాదు..ప్రజాప్రతినిధి కాదు..పారిశ్రామిక దిగ్గజం కాదు..కానీ అలాంటి వారిని తయారు చేసేందుకు పునాది వేసిన ఎస్‌పీడబ్ల్యూ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ కమలా మీనన్‌తో ఫోటో దిగేందుకు ఆ విద్యార్ధులు తపించారు. తమ జీవితాలపై ప్రభావం చూపిన గురువుతో ఫోటో ఛాన్స్ కోసం ఆరాటపడ్డారు. క్రమశిక్షణ, జీవిత పాఠాలు, ఆడది సాధించలేనిదంటూ ఉండదని అణువణువూ పట్టుదల, కసిని నింపిన అభిమాన గురువుకు వందనం పలికారు.
స్వగతాలతో ప్రత్యేక పుస్తకం...
శ్రీపద్మావతి ఉమెన్స్ కళాశాల పూర్వ విద్యార్ధుల అనుభవాలు, అధ్యాపకుల స్వగతాల మేళవింపుతో ప్రత్యేక పుస్తకం రూపకల్పన చేయనున్నారు.
చిన్నపిల్లలుగా మారిపోయాం
మాది 1989–92 బ్యాచ్. స్నేహితులతో కలిసి ఎంతగా అల్లరి చేసినా కళాశాలలో మేము సైలెంట్. ఎస్‌పీడబ్ల్యూ కళాశాల విద్యార్థినులకు రక్షణగా మా కళాశాల ముందు ఏకంగా పోలీస్‌స్టేషన్‌నే ఏర్పాటుచేశారు. కమలా మేడమ్ ఎంతో ఇన్సిపిరేషన్. ఆమే మాకు రోల్ మోడల్. ఆమె లాగా గ్లామర్‌గా ఉండాలని, ఆమె లాగా నడుచుకోవాలని తపించేవాళ్లం. ఎక్కడెక్కడో ఉన్న కళాశాల పాత విద్యార్ధులందరినీ ఇలా కలుసుకోవడం నిజంగా గోల్డెన్ మెమరీ.. పెళ్ళయ్యి, పిల్లలు ఉన్న విషయాన్నే మరిచిపోయి ఒక్కసారిగా చిన్న పిల్లలుగా మారిపోయాం. ఇంతమంది గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే ఆ కళాశాల అధ్యాపకులే కారణం. మా బ్యాచ్ మాత్రం ఎప్పటికీ కళాశాలలో గుర్తుండిపోయే బ్యాచ్. కళాశాల ఆల్బమ్‌ను చూసే నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక్కడ చదివిన తాళూరి రమేశ్వరి, మహేశ్వరి సినిమాల్లో ప్రవేశించడం ఆనందంగా ఉంది. వివాహ వ్యవస్థ, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో లైఫ్ అండ్ లా ఫౌండేషన్‌ను నెలకొల్పాను. – రోజా, ఎమ్మెల్యే
ఏటా ఇలా కలుసుకోవాలన్నదే మా కాంక్ష
గతంలో తిరుపతిలో అలుమ్నీ మీట్ చేశాం. ఇప్పుడు హైదరాబాద్‌లో చేశాం. ఇలా తరుచూ కలుసుకోవడం ద్వారా ఒకరి భావాలు మరొకరు పంచుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఎస్‌పీడబ్ల్యూ కళాశాలలోకి ప్రవేశించిన ప్రతిఒక్క విద్యార్థిని కూడా సమాజంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను దీటుగా తట్టుకునేలా శక్తి సామర్థ్యాలను ఇచ్చాం. అందుకే నేడు ఇంతమంది పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. గురువుగా అంతకంటే సంతోషం ఏముంటుంది. అయితే ప్రస్తుతం ఎస్‌పీడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ బాధ్యతలు ఒక పురుషునికి ఇవ్వడం సరికాదు. మహిళల సమస్యలు ఒక్క మహిళకే తెలుస్తుంది. మహిళా ప్రిన్సిపల్‌ను నియమిస్తే బాగుంటుంది. – కమలా మీనన్, పూర్వ ప్రిన్సిపాల్