వస్తున్నాయ్‌.. స్పైక్‌ రోడ్లు!

Spike roads are coming very soon

25 అనుసంధాన రోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు 

ఈ రోడ్లతో మరింత సులువుగా వాహనదారుల ప్రయాణం 

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారుల్లో వాహనదారుల ప్రయాణం సులువుగా సాగేలా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) సరికొత్త ప్రణాళికలతో ముందుకెళుతోంది. ఇప్పటికే ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును కలిపేలా నిర్మిస్తున్న రేడియల్‌ రోడ్ల మాదిరిగానే ఔటర్‌ రింగ్‌ రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు అనుసంధానించేలా స్పైక్‌ రోడ్లను నిర్మించాలని యోచిస్తోంది. నగర శివారుల్లో ఏర్పాటవుతున్న లాజిస్టిక్‌ హబ్‌లు, ట్రక్కు పార్కులు, ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినళ్లకు సులువుగా చేరేలా, చర్లపల్లి, నాగులపల్లిలో ఏర్పాటు కానున్న రైల్వే టెర్మినల్‌కు వాహనదారులు సులభంగా వెళ్లేలా ఈ రోడ్ల నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నారు. దాదాపు 460 కిలోమీటర్ల మేర 25 రోడ్లు నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు.

వీటిలో జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు ప్రాంతీయ రహదారులు కూడా ఉన్నాయని, వీటిని 4 నుంచి ఆరు లేన్లుగా అభివృద్ధి చేస్తామని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్లకు రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. నగర శివారుల్లో ట్రక్కు పార్కులు, ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినళ్లకు చేరుకునే వాహనాల రాకపోకలకు ఈ స్పైక్‌ రోడ్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. చర్లపల్లి, నాగులపల్లిలో రైల్వే టెర్మినల్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో ఆ దిశగా కూడా హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాంగణాల నుంచి రాకపోకలు సాగించే వాహనాలు ఔటర్‌ ద్వారా వేగంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు చేరుకునేట్టు స్పైక్‌ రోడ్లు దోహదం చేస్తాయని చెబుతున్నారు.  

స్పైక్‌ రోడ్లు ఏయే ప్రాంతాల్లో... 
- నేషనల్‌ హైవే–7, బెంగళూరు హైవే మీదుగా శంషాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌ నుంచి పాలమాకుల, కొత్తూరు ప్రాంతాల నుంచి ఫరూక్‌నగర్‌ అర్బన్‌ నోడ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు (23.27 కిలోమీటర్లు) 
- శంషాబాద్‌ నుంచి అమన్‌పల్లి నర్కొడ, కందువాడ మీదుగా పమీనా గ్రామ ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసం«ధానం (27.28 కిలోమీటర్లు).  
- పీరంచెరువు అప్పా జంక్షన్‌ నుంచి మొయినాబాద్‌ మీదుగా చేవెళ్ల అర్బన్‌ నోడ్‌ (26.33 కిలోమీటర్లు) 
- శంకర్‌పల్లి మంచిరేవుల నుంచి జన్వాడ, మోఖిల మీదుగా శంకర్‌పల్లి ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం(26.27 కిలోమీటర్లు) 
- వెలముల నుంచి భానూర్‌ మీదుగా సింగపూర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (10.28 కిలోమీటర్లు) 
- నేషనల్‌ హైవే 9 ముత్తంగి జంక్షన్‌ నుంచి రుద్రారం మీదుగా కౌలంపేట హమ్లెట్‌ సమీపంలోని రుద్రారంలోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం(0.81 కిలోమీటర్లు) 
- రెండ్లగడ, ఐనోల్‌ మీదుగా ఇదతనూర్‌లోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (16.67 కిలోమీటర్లు) 
- దెల్వార్‌గూడ, కొడకంచి, అముదూర్‌ మీదుగా ఇస్మాయిల్‌ఖాన్‌ పేట సమీపంలోని ఆరుట్ల ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (22.7 కిలోమీటర్లు) 
- సుల్తానాపూర్‌ నుంచి ఊట్ల, చింతల్‌చెరు మీదుగా మాచెర్ల ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (24.81 కిలోమీటర్లు) 
- రాష్ట్ర రహదారి దొమ్మర పొచంపల్లి జంక్షన్‌ మీదుగా గగిల్లాపూర్, గుమ్మడిదల మీదుగా నర్సాపూర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (24.36 కిలోమీటర్లు) 
- జాతీయ రహదారి–7 కండ్లకోయ జంక్షన్‌ నుంచి మేడ్చల్, కల్లకల్, మనోహరాబాద్‌ మీదుగా తుప్రాన్‌ అర్బన్‌ నోడ్‌కు అనుసంధానం (26.25 కిలోమీటర్లు) 
- పుదుర్‌ నుంచి రాజ్‌ బొల్లారం, రవల్‌కొలె, బస్వాపూర్‌ మింజిపల్లి మీదుగా శంకారంలోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (24.92 కిలోమీటర్లు) 
- రాష్ట్ర రహదారి కరీంనగర్‌ తూముకుంట జంక్షన్‌ నుంచి శామీర్‌పేట, అలియాబాద్, తుర్కపల్లి మీదుగా ములుగు ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (20.78 కిలోమీటర్లు) 
- శామీర్‌పేట నుంచి సంపన్‌బొలె, అనంతారం మీదుగా అలియాబాద్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (17.84 కిలోమీటర్లు) 
- నర్సంపల్లి నుంచి అద్రాస్‌పల్లె లింగాపూర్‌ నుంచి ముదుచింతపల్లెలోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (12.33 కిలోమీటర్లు) 
- కీసర దైర జంక్షన్‌ నుంచి కీసర రంగాపురం నుంచి బొమ్మలరామారంలోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (12.21 కిలోమీటర్లు) 
- ఘట్‌కేసర్‌ జంక్షన్‌ నుంచి అవుషాపూర్, రంగాపూర్‌ మీదుగా గుడూర్‌ గ్రామంలోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (18.03 కిలోమీటర్లు) 
- బాచారం జంక్షన్‌ నుంచి బండ్ల రావిర్యాల, జూలూరు నుంచి రవల్‌పల్లి గ్రామంలోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (17.36 కిలోమీటర్లు) 
- అంబర్‌పేట కలాన్‌ జంక్షన్‌ నుంచి అబ్దుల్లాపూర్, తూరన్‌పేట మీదుగా మల్కాపూర్‌ అర్బన్‌ నోడ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (16.18 కిలోమీటర్లు) 
- కొహెడ నుంచి అంజిపూర్, పొల్కంపల్లి మీదుగా దండుమైలారంలోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (14.86 కిలోమీటర్లు) 
- బొంగళూరు జంక్షన్‌ నుంచి చింతక్‌పల్లిగూడ, ఇబ్రహీంపట్నం నుంచి అఘాపల్లి ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (15.22 కిలోమీటర్లు) 
- ఆదిభట్ల నుంచి ఫిరోజ్‌గూడ, యెలిమినేడు మీదుగా గుమ్మడివెల్లి ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (16.77 కిలోమీటర్లు) 
- రావిర్యాల నుంచి లెమూర్‌ మీదుగా రాచ్లూర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (11.74 కిలోమీటర్లు) 
- మంకాల్‌ జంక్షన్‌ నుంచి మొహబ్బత్‌నగర్, తుమ్మలూరు మీదుగా కొత్తూరు ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (12.86 కిలోమీటర్లు) 
- గోల్కొండ కలాన్‌ నుంచి నాగిరెడ్డిపల్లి, పింజర్ల మీదుగా దూస్కల్‌ గ్రామ సరిహద్దులోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (19.83 కిలోమీటర్లు)  

స్పైక్‌ రోడ్లు అంటే... 
సైకిల్‌ చక్రంలో ఉండే రిమ్‌కు, యాక్సిల్‌కు అనుసంధానంగా ఉండే పుల్లల మాదిరిగా రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానంగా రహదారులను నిర్మిస్తున్నారు. వీటికి స్పైక్‌ రోడ్లుగా హెచ్‌ఎండీఏ నామకరణం చేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top