రేడియల్‌లో భారీ స్కామ్‌! | Irregularities in Rs 3296 Crore Radial Road-2 Tenders | Sakshi
Sakshi News home page

రేడియల్‌లో భారీ స్కామ్‌!

Oct 10 2026 3:06 AM | Updated on Oct 10 2026 3:06 AM

Irregularities in Rs 3296 Crore Radial Road-2 Tenders

రూ. 3,296 కోట్ల రేడియల్‌ రోడ్‌–2 టెండర్లలో అవకతవకలు! 

ఎల్‌–1 బిడ్డర్‌పై అనర్హత వేటు వేసి నచ్చిన సంస్థలకే కాంట్రాక్టు

హడావుడిగా టెక్నికల్‌ బిడ్ల మదింపు.. ఆపై కాంట్రాక్టు అప్పగింత 

అనర్హత వేటేసిన సంస్థ వివరణ కోరకుండానే అధికారుల నిర్ణయం 

ఉన్నతస్థాయి ఒత్తిళ్లే కారణం? రాష్ట్ర ఖజానాకు రూ. 600 కోట్ల నష్టం! 

న్యాయస్థానానికి చేరిన టెండర్ల వ్యవహారం

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ)లో భాగమైన హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) తాజాగా పిలిచిన రూ. 3,296 కోట్ల విలువైన, మూడు ప్యాకేజీలతో కూడిన రేడియల్‌ రోడ్‌–2 నిర్మాణ టెండర్లలో భారీ స్కామ్‌ చోటుచేసుకున్నట్లు సమాచారం. అర్హత ఉన్న కంపెనీకి అవకాశం ఇవ్వకుండా ఉన్నతస్థాయిలో వచ్చిన ఒత్తిళ్లతోనే అధికారులు హడావుడిగా మూడు సంస్థలకు కాంట్రాక్టు కట్టబెట్టారని తెలుస్తోంది.

కేవలం ఆరు పనిదినాల్లోనే టెండర్ల సాంకేతిక మదింపు పూర్తి చేసి ఆ వెంటనే ఆర్థిక బిడ్లను తెరవడం మూడు సంస్థలకు టెండర్లను కట్టబెడుతూ ఉత్తర్వులు ఇచ్చేయడం చకచకా జరిగిపోయాయి. అతితక్కువ ధర కోట్‌ చేసిన సంస్థను సాంకేతిక కారణాలతో పక్కనపెట్టడమే కాకుండా కనీసం ఆ సంస్థ వివరణ కూడా తీసుకోకుండానే మూడు సంస్థలకు కాంట్రాక్టు అప్పగించారు.

అయితే ఈ మూడు సంస్థల్లో ఒక సంస్థ ఎంత ఎక్కువ కోట్‌ చేసిందో వెల్లడించిన హెచ్‌జీసీఎల్‌ అధికారులు.. మిగిలిన రెండు సంస్థలు అంచనా వ్యయం కంటే ఎంత ఎక్కువకు కోట్‌ చేశాయన్న వివరాలను బయటపెట్టకుండా జాగ్రత్తపడటం గమనార్హం. దీంతో అన్యాయం జరిగిందంటూ అనర్హతకు గురైన సంస్థ కోర్టుకెక్కగా అధికారుల హడావుడి నిర్ణయం వల్ల దాదాపు రూ. 600 కోట్ల మేరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలగనుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఆరు రోజుల్లోనే..: ఈ టెండర్ల దాఖలుకు చివరి తేదీ ఈ ఏడాది సెపె్టంబర్‌ 30 కాగా ఈ నెల 8 కల్లా సాంకేతిక మదింపు, అనర్హులపై వేటు, ఆర్థిక బిడ్లను తెరవడం, చివరకు కాంట్రాక్టు కట్టబెట్టడం కూడా జారీ అయిపోయింది. మొత్తం ఎనిమిది రోజుల్లో గాంధీ జయంతి సెలవు, ఆదివారాన్ని తీసేస్తే మిగిలింది కేవలం 6 పనిదినాలే. ఈ 6 రోజుల్లో 13 సంస్థలు దాఖలు చేసిన అనుభవ పత్రాలు, ఆడిట్‌ నివేదికలు, బిడ్‌ సామర్థ్యాన్ని పరిశీలించారా అంటే అనుమానమేనన్న వాదన వినిపిస్తోంది.

కమిటీ సిఫార్సులు రికార్డు చేయడం, ఆమోదాలు పొందడం, ఫైనాన్షియల్‌ బిడ్లు తెరవడం, కాంట్రాక్టులు అప్పగించడం ఇచ్చేయడం ఇంత వేగంగా ఎలా సాధ్యమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతిక తనిఖీల్లో ఏ ఒక్క కాంట్రాక్టర్‌నూ వివరణ కూడా అడగకపోవడం, అనర్హతకు గురైన సంస్థ వివరణ ఇవ్వడానికి కనీస సమయం ఇవ్వకుండా.. మరుక్షణమే ఫైనాన్షియల్‌ బిడ్లు తెరవడం ఏమిటన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

ఒక్కో ప్యాకేజీకి ఒక్కో న్యాయమా? 
13 బిడ్‌లలో ఐదు బిడ్లను అనర్హమైనవిగా ప్రకటించారు. అయితే ఈ నిబంధనలను ఒకేలా వర్తింపజేయలేదన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. జీకేసీ ప్యాకేజీ–1లో అనర్హతకు గురైంది.. కానీ ప్యాకేజీ–2, 3లలో అర్హత సాధించింది. ప్యాకేజీ–1, 2లలో అర్హత సాధించిన బీవీఎస్‌ఆర్‌ సంస్థకు ప్యాకేజీ–3లో అర్హత లేదంటూ అధికారులు ప్రకటించారు.

అయితే ఒకే రకమైన ప్రమాణాలు ఉన్నప్పుడు ఒక ప్యాకేజీలో అర్హత పొందిన సంస్థ.. మరో ప్యాకేజీలో ఎలా అనర్హతకు గురవుతుందనే విషయాన్ని మాత్రం అధికారులు స్పష్టం చేయట్లేదు. ప్యాకేజీ–3కి చివరికి ఇద్దరే బిడ్డర్లు మిగలడంతో పోటీ లేకుండానే పనులు అప్పగించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ మూడు సంస్థల్లో ఒక్కటి కూడా అంచనా వ్యయం కంటే తక్కువకు బిడ్‌ దాఖలు చేయకపోవడం గమనార్హం.  

252 కి.మీ. రహదారి వేసిన సంస్థకు.... 
అత్యంత క్లిష్టమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో 252 కి.మీ. మేర నెచిపు–హోజ్‌ కొండల్లో రహదారి (ఎన్‌హెచ్‌–229)ని నిర్మించిన సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌పై అధికారులు మూడు ప్యాకేజీల్లోనూ అనర్హత వేటు వేశారు. ప్రస్తుతం టెండర్లు దక్కించుకున్న మూడు సంస్థల కంటే సుశీ ఇన్‌ఫ్రా ఈ మూడు ప్యాకేజీలకు దాదాపు రూ. 500 కోట్లు తక్కువకే టెండర్లు దాఖలు చేసినట్లు సమాచారం. ఇదే అంశాన్ని హైకోర్టులో వేసిన పిటిషన్‌లో ఆ సంస్థ పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం రేడియల్‌ రోడ్లకు సంబంధించిన సాంకేతిక మదింపు ప్రక్రియ మొతాన్ని బహిర్గతం చేయాలని, అనర్హతకు గల స్పష్టమైన కారణాలను బహిర్గతం చేయాలన్న డిమాండ్‌ వస్తోంది. సాంకేతిక, ఆర్థిక బిడ్ల మధ్య కనీస గడువు ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

ఏమిటీ రేడియల్‌ రోడ్‌–2 ప్రాజెక్ట్‌? 
బుద్వేల్‌ వద్ద ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) నుంచి కొడంగల్‌ సమీపంలోని ఎన్‌హెచ్‌–167ఎన్‌ వరకు 81.15 కి.మీ. మేర గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించేందుకు హెచ్‌జీసీఎల్‌ టెండర్లు పిలిచింది. ప్యాకేజీ–1ను ఎన్‌సీసీ లిమిటెడ్‌ అంచనా వ్యయం కంటే 3.95 శాతం అధికంగా కోట్‌ చేయడంతో రూ. 1,286.03 కోట్లకు కట్టబెట్టారు. ప్యాకేజీ–2 కింద బీవీఎస్‌ఆర్‌ సంస్థ, ప్యాకేజీ–3ని జీకేసీ సంస్థకు కేటాయించారు. ఈ రెండు సంస్థలు అంచనా వ్యయం కంటే ఎంత అధికంగా కోట్‌ చేశాయన్న వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement