ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లపై ప్రత్యేక దృష్టి

Special focus on computer labs in engineering colleges - Sakshi

     పక్కా నెట్‌వర్క్‌తో పని చేసేలా చర్యలు 

     ఉన్నత విద్యామండలి నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లు, నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నత విద్యామం డలి నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై యాజమాన్యాలు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని జేఎన్‌టీయూను ఆదేశించింది. అనేక కాలేజీల్లో పనిచేయని కంప్యూటర్లే ఎక్కువగా ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి దృష్టికి వచ్చింది.

ఈ నేపథ్యంలో కాలేజీల్లో విద్యార్థులకు సరిపడ కంప్యూటర్లు, పటిష్టమైన నెట్‌వర్క్‌ ఉండేలా చర్యలు చేపట్టాలన్న నిర్ణ యానికి వచ్చింది. ఇటీవల ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్‌ ప్రవేశ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వ హించడానికి కాలేజీల్లో ల్యాబ్‌లను పరిశీలించగా లోపాలు బయట పడ్డాయి. చాలా కాలేజీల్లో ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణకు సరిపడ సామర్థ్యం లేనట్టు తేలింది. ఓ వైపు దేశ వ్యాప్తంగా భవిష్యత్తులో అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి కసరత్తు జరుగుతుంటే రాష్ట్రంలోని కాలేజీ ల్యాబ్‌ల్లో లోపాలు ఉండటం సరికాదన్న భావనకు మండలి వచ్చింది.  

ల్యాబ్‌లు పక్కాగా ఉండాలి.. 
500 మందికి పైగా విద్యార్థులు ఉన్న కాలేజీల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లు పక్కాగా ఉండాలని, యాజమాన్యాలు పటిష్టమైన నెట్‌వర్క్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టేలా చూడాలని నిర్ణయించినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అన్నారు.

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో లోపాలపై ప్రభుత్వం, జేఎన్‌టీయూ, తామూ చేపట్టిన అనేక సంస్కరణల ఫలితం గానే ప్రస్తుతం లోపాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. గతంలో కంప్యూటర్లు, నెట్‌వర్క్‌ సామర్థ్యం తక్కువగా ఉండటంతో రోజుకు కేవలం 6 నుంచి 7వేల మంది విద్యార్థులకే ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండేదని, ప్రస్తుతం అది 28 వేలకు చేరిందన్నారు. ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top