బంగాళాఖాతంలోకి ‘నైరుతి’ ప్రవేశం 

South Western Monsoon Enters Into The Bay of Bengal - Sakshi

నేడు రాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షాలు 

అతి తీవ్ర తుపానుగా మారిన ‘అంఫన్‌’ 

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, అండమాన్‌ సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు ఆదివారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, అండమాన్‌ సముద్రం, అండమాన్‌ దీవుల్లో మిగిలిన ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉం  దని పేర్కొంది. సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవ కాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు. మంగళవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అలాగే రాగల మూడ్రోజులు అక్కడక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.  

అతి తీవ్ర తుపానుగా ‘అంఫన్‌’ 
దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ‘అంఫన్‌’తుపాను ఉత్తర దిశగా ప్రయాణించి మరింత తీవ్రమై ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అతి తీవ్ర తుపానుగా మారింది. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో పారదీప్‌ (ఒడిశా)కు దక్షిణ దిశగా 960 కిలోమీటర్లు, డిగా (పశ్చిమ బెంగాల్‌)కు దక్షిణ నైరుతి దిశగా 1,110 కిలోమీటర్లు, ఖేపుపర (బంగ్లాదేశ్‌)కు దక్షిణ నైరుతి దిశగా 1,230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఇది మరింత బలపడి రాగల 24 గంటల్లో అత్యంత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఇది తదుపరి 12 గంటల్లో ఉత్తర దిశగా ప్రయాణించి తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా వాయవ్య బంగాళాఖాతం మీదుగా వెళ్లి పశ్చిమ బెంగాల్‌–బంగ్లాదేశ్‌ తీరాల వద్ద డిగా (పశ్చిమబెంగాల్‌), హతియా దీవుల (బంగ్లాదేశ్‌) మధ్య ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని రాజారావు వెల్లడించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top