స్నిగ్ధారెడ్డి అక్రమ మైనింగ్ వాస్తవం | snigdhareddy illegal mining is fact mining ministry send a report | Sakshi
Sakshi News home page

స్నిగ్ధారెడ్డి అక్రమ మైనింగ్ వాస్తవం

Mar 18 2015 12:39 AM | Updated on Sep 2 2017 10:59 PM

మాజీ మంత్రి డి.కె.అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి లీజుకు తీసుకోని ప్రాంతాల్లోనూ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సంబంధిత అధికారులు మంగళవారం హైకోర్టుకు నివేదించారు.

  •  హైకోర్టుకు గనులశాఖ నివేదన
  •  పర్మిట్లు లేకుండానే ఖనిజ రవాణా చేస్తున్నారని వెల్లడి
  •  సమాధానానికి గడువు కోరిన ప్రతివాదుల తరఫు న్యాయవాదులు
  •  అక్రమమని తేలితే చర్యలకు ఆదేశాలిస్తామన్న ధర్మాసనం
  • సాక్షి, హైదరాబాద్:  మాజీ మంత్రి డి.కె.అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి లీజుకు తీసుకోని ప్రాంతాల్లోనూ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సంబంధిత అధికారులు మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఇలా తవ్వితీసిన రాయి, ఖనిజాన్ని తమ శాఖ నుంచి ఎటువంటి పర్మిట్లు పొందకుండానే రవాణా చేశారని తెలిపారు. ఈ అక్రమాలపై రూ.32.49 కోట్ల జరిమానా చెల్లించాలంటూ గత ఏడాది నోటీసులు జారీ చేసినా సమాధానం ఇవ్వలేదన్నారు. దీంతో ఆమెకు మంజూరు చేసిన లీజును రద్దు చేసేందుకు షోకాజ్ నోటీసు జారీ చేశామని, దీనిపై స్థానిక ఎమ్మెల్యే గనుల శాఖ మంత్రికి లేఖ రాయడంతో రద్దు అంశం పెండింగ్‌లో పడిందని వివరించారు. డి.కె.అరుణ భర్త భరతసింహారెడ్డి మన్నాపురం గ్రామ పరిధిలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని టీఆర్‌ఎస్ నాయకుడు బి.కృష్ణమోహన్‌రెడ్డి గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
     
    తాజా చర్యలకు ఆదేశాలిచ్చాం: మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు అదనపు కౌంటర్లను ధర్మాసనం ముందుంచారు. లీజు పొందని ప్రాంతంలో 5,67,900 క్యూబిక్ మీటర్ల మేర అక్రమ మైనింగ్ చేశారని, ఇందుకు చట్ట నిబంధనల మేరకు పదింతల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశామన్నారు. తాజా పరిశీలన ఆధారంగా అక్రమ మైనింగ్ చేస్తున్నందుకు చట్ట ప్రకారం తగిన చర్యలకు ఉపక్రమిస్తున్నామని, ఆ మేరకు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ సమయంలో స్నిగ్ధారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఎ.సుదర్శన్‌రెడ్డి, డి.కె.భరతసింహారెడ్డి తరఫు న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ సమాధానం ఇవ్వడానికి గడువునివ్వాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీంతో ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
     
    లీజు రద్దుకు ఆదేశాలిస్తాం

    ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిపుణులతో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేసి క్వారీయింగ్ జరుగుతున్న ప్రాంతానికి పంపి నివేదిక తీసుకోవాలని భావిస్తున్నామని తెలిపింది. క్వారీయింగ్ అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పాటు, లీజు రద్దుకు సైతం ఆదేశిస్తామంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement