ఎగ్‌ వెరీ స్మాల్‌..!

Small Eggs Distribution In Anganwadi Centres Warangal - Sakshi

నల్లబెల్లి: అందరికీ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ సెం టర్లను నిర్వహిస్తున్న విషయం విధితమే. కాని ఆశయం ఘనంగా ఉన్నా అమలు మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం అందని ద్రాక్షలాగే మారుతోంది. ఏదో ఒక కొర్రీ చూపెట్టి నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారనే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. బలహీనతను పోగొట్టే కోడిగుడ్ల సరఫరాలో సైతం అవినీతి జరుగుతుండడం అంగన్‌వాడీల పనితీరుకు నిదర్శనం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక తక్కువ పరిమాణం కలిగిన గుడ్లు కాంట్రాక్టర్‌ సరఫరా చేస్తున్నాడు.

అంగన్‌వాడీ నిర్వాహకులు చిన్నసైజు గుడ్లను తిరస్కరిస్తే గుడ్లు సరఫరా చేసేవారు తీసుకుంటారా లేదా అని వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఎవరైనా లబ్ధిదారులు ఇంత చిన్న గుడ్డా అన్ని ప్రశ్నిస్తే తీసుకుంటే తీసుకో.. లేకపోతే లేదని అంగన్‌వాడీ నిర్వాహకులు సమాధానమిస్తున్నట్లు సమాచారం. అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహరం నడుస్తుందని జిల్లా వ్యాప్తంగా పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. జిల్లాలో ఐసీడీఎస్‌ పరిదిలో నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల ప్రాజెక్టులో 908 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 832 మెయిన్, 76 మినీ అంగన్‌వాడీలు ఉన్నాయి. ప్రతి రోజు 17,338 మంది గర్భిణీలు, బాలింతలతో పాటుగా ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల్లోపు పిల్లలు 54,296 మంది వచ్చి పౌషికాహారంతో పాటు భోజనం చేసి వెళుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీరికి అందించాల్సిన గుడ్డు ఈ ప్రాజెక్టుల పరిధిలో నిర్ణీత పరిమాణానికి మించి తక్కువగా గుడ్లు సరఫరా అవుతున్నాయి. 

గుడ్డు మాయాజాలం
గుడ్డు ఇస్తున్నారు కదా.. చిన్నదైతే నేమి అని అనుకోవచ్చు. జరిగే మాయాజలామంతా అందులోనే ఉంది. సాధారణంగా నిర్ణీత బరువు 50 గ్రాములున్న గుడ్లను పంపిణీ చేయాలి. ఫారం కోళ్లు పెట్టే గుడ్లు చాలా వరకు హెచ్చు తగ్గులుగా ఉంటాయి. వీటిని సంబంధిత కాంట్రాక్టర్‌ చిన్న సైజు గుడ్లను ఏరిపించి అంగన్‌వాడీ కేంద్రాలకు చాలా వరకు చిన్న సైజు గుడ్లను పంపిణీ చేస్తున్నారు. నిర్ణీత బరువు కలిగిన గుడ్డు ధర నెక్‌ రేటుకు సరాసరి ధరతో పాటు రవాణా చార్జీలు అదనంగా చెల్లిస్తారు. పరిమాణం తక్కు వల్ల దాదాపు లక్షల్లో స్వార్థపరుల జేబుల్లోకి కమిషన్‌ రూపంలో చేరుతోంది. దీనికి తోడు 15 రోజుల సరుకు ముందుగానే నిర్వహకులకు ఇవ్వడంతో ముందుగానే కాంట్రాక్టర్‌ గుడ్లు అమ్ముకుంటున్నారు. ఇలా భారీగానే అవినీతి జరుగుతోందని పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.

నిర్వాహకుల తప్పే..
అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. పంపిణీ విషయంలో మాకెలాంటి ఫిర్యాదులు అందలేదు. గుడ్ల విషయానికి వస్తే పరిమాణం తక్కువైనా, నలిగినా వాటిని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఇచ్చేయాలని అంగన్‌వాడీ నిర్వాహకులకు సూచించాం. తక్కువ పరిమాణం గల గుడ్లు తీసుకొంటే  తప్పు నిర్వహకులదే. ఫిర్యాదులు వస్తే సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. సరస్వతి, సూపర్‌వైజర్, పీడీ, నల్లబెల్లి

సరఫరా జరిగేలా చూస్తా.. 
అంగన్‌వాడీ కేంద్రాలకు టెండర్‌ నిబంధనల మేరకు గుడ్లు సరఫరా జరిగేలా చూస్తాం. త్వరలోనే అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా చిన్న సైజు గుడ్లు సరఫరా చేసినట్లు గుర్తిస్తే సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం. చిన్న సైజు గుడ్ల సరఫరా జరిగితే  సమస్యను అంగన్‌వాడీ టీచర్, లబ్ధిదారులు గుర్తించి ఐసీడీఎస్‌ అధికారుల దృష్టికి తీసుకరావాలి. –సబిత, పీడీ, ఐసీడీఎస్, వరంగల్‌ రూరల్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top