63 రోజులు.. 18 మిలియన్‌ టన్నులు | Singareni Coal Mines Target In 2020 | Sakshi
Sakshi News home page

63 రోజులు.. 18 మిలియన్‌ టన్నులు

Jan 30 2020 9:22 AM | Updated on Jan 30 2020 10:03 AM

Singareni Coal Mines Target In 2020 - Sakshi

బొగ్గు వెలికితీస్తున్న షావల్‌

సాక్షి, గోదావరిఖని(కరీనంనగర్‌) : సింగరేణి సంస్థ వార్షిక బొగ్గు ఉత్పత్తి దృష్టి పెట్టింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్‌ టన్నుల(ఎంటీ) లక్ష్యం నిర్దేశించుకోగా.. జనవరి 28వ తేదీ నాటికి 52 మిలియన్‌ టన్నుల బొగ్గు వెలికితీసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 63 రోజుల్లో ముగియనుంది. ఈ కాలంలో 18 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉంది. ప్రస్తుతం సగటున రోజూ 2.25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పతి చేస్తోంది. నిర్దేశిత లక్ష్యం చేరుకోవాలంటే రోజుకు 2.85 లక్షల టన్నులు సాధించాలి. అంటే ప్రస్తుతం కంటే రోజుకు 0.65 లక్షల టన్నుల బొగ్గును అదనంగా ఉత్పత్తి చేయాలి. ఈయేడాది వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి నష్టం జరిగింది. మున్సిపల్‌ ఎన్నికలు కార్మికుల హాజరుశాతంపై ప్రభావం చూపాయి. మరో వారం రోజుల్లో జరగబోయే మేడారం జాతర కూడా ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా యాజమాన్యం దృష్టి కేంద్రీకరించింది.

ఈ క్రమంలో సంస్థ వ్యాప్తంగా 28 భూగర్భ గనులు, 17 ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో రోజూవారీ ఉత్పత్తిని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. భూగర్భ గనుల కన్నా ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టుల్లో బొగ్గు ఎక్కువగా సాధించేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్దేశిత లక్ష్యంలో 74.2 శాతం సాధించింది. సంస్థ వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో ఒక్కటీ కూడా నూరుశాతం ఉత్పత్తి సాధించలేదు. అడ్య్రాల ప్రాజెక్టు ఏరియా 92శాతం, ఇల్లెందు 86, మణుగూరు 83 శాతంలో ముందుకు సాగుతున్నాయి. 50శాతం ఉత్పత్తి మాత్రమే సాధించి ఆర్జీ–1 ఏరియా చివరిస్థానంలో ఉంది. వార్షిక ఉత్పత్తి లక్ష్య సాధనకు సింగరేణి యాజమాన్యం ప్రత్యేక ఇన్సెంటివ్‌ స్కీం అమలు చేస్తోంది. అధిక బొగ్గు ఉత్పత్తి సాధించిన గని కార్మికులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. 2019 డిసెంబర్‌ నుంచి, 2020 మార్చి వరకు ఈ స్కీంను వర్తింపజేస్తోంది. యాజమాన్యం ఆర్థికంగా ప్రోత్సహించడంతో కార్మికులు కూడా అధిక బొగ్గు ఉత్పత్తికి కృషి చేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement