సరుకులు లేవు.. సరఫరా చాలదు 

Shortage Of Essentials In Grocery Stores And Super Markets - Sakshi

కిరాణా షాపులు, సూపర్‌ మార్కెట్లలో నిత్యావసర సరుకుల కొరత 

ఇడ్లీ, ఉప్మా రవ్వ, గోధుమపిండి, నూనెలు దొరకని పరిస్థితి

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అవసరానికి మించి కొనుగోళ్లే కారణం 

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచే కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్‌లకు సరుకు రవాణా క్లిష్టతరంగా మారింది. డిమాండ్‌ మేరకు నిత్యావసరాలు సరఫరా లేకపోవడం, గోదాముల్లో సరుకుల రవాణాకు, ప్యాకేజింగ్‌కు సిబ్బంది కొరత ఉండటంతో నిల్వలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే నగరంలోని చాలా సూపర్‌మార్కెట్‌లలో ఖాళీ ర్యాంకులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా రోజువారీ అవసరాల్లో ప్రధానంగా వాడే ఉప్మా, ఇడ్లీ రవ్వలతో పాటు, టీ, కాఫీ పొడి, కారం, చక్కెర, పసుపు, నూనెలు, గోధుమపిండి వంటి సరుకులతో పాటు డిటర్జెంట్లు, హ్యాండ్‌వాష్‌లు, న్యాప్కిన్లు, డైపర్ల సరఫరా తగ్గడంతో వీటికి కొరత ఏర్పడుతోంది.

డిమాండ్‌కు తగ్గట్లు లేని సరఫరా..
లాక్‌డౌన్‌ నేపథ్యంలో వినియోగదారులు పెద్ద ఎత్తున అవసరాలకు మించి కొనుగోళ్లు చేశారు. సాధారణంగా వారానికి సరిపడా సరుకులను కొనుగోలు చేసే అలవాటుకు భిన్నంగా కొందరు ముందుగానే పెద్దమొత్తంలో సరుకులను కొనుగోళ్లు చేశారు. దీంతో అవి నిండుకున్నాయని కిరాణా వర్తకులు తెలిపారు. ‘రాష్ట్రానికి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చక్కెర, గుజరాత్‌ నుంచి ఉప్పు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ నుంచి శనగపప్పు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కందిపప్పు, రాజస్తాన్‌ నుంచి పెసరపప్పు, కృష్ణపట్నం, కాకినాడ, చెన్నై ఓడరేవుల నుంచి ముడి వంట నూనెలు వస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సరుకులు తెచ్చే వాహనాలకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్దే ఇబ్బందులు ఎదురౌతున్నాయి.

దానికి తోడు ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ ఉధృతి తీవ్రంగా ఉండటంతో లారీ డ్రైవర్లు, క్లీనర్లు రవాణాకు ముందుకు రావడం లేదు. కొన్ని సరుకు రవాణా వాహనాలు వస్తున్నా, అవి అనేక చోట్ల చెక్‌పోస్టులు దాటాల్సి రావడంతో ఒక్క రోజులో వచ్చే వాటికి రెండున్నర రోజుల గడువుపడుతోంది’అని బేగంబజార్‌కు చెందిన వర్తకులు తెలిపారు. అదీగాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కిరణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్లకు సరుకులు సరఫరా చేసే బేగంబజార్‌ మార్కెట్‌లో రద్దీని నివారించేందుకు విడతల వారీగా దుకాణాలు తెరుస్తున్నారు. పప్పులు సరఫరా చేసే దుకాణం ఒక రోజు తెరిస్తే, మళ్లీ అది తెరిచే వంతు నాలుగు రోజులకు గానీ రావట్లేదు. దీంతోనూ తగినంత సరుకుల సరఫరా అనుకున్నంత జరగడం లేదని తెలుస్తోంది. ఇక సూపర్‌మార్కెట్ల గోదాముల్లో కొంత నిల్వలు ఉంటున్నా, వాటిని ప్యాకేజింగ్‌ చేసేందుకు సిబ్బంది రావడం లేదని మరికొందరు వ్యాపారులు చెబుతున్నారు.ప్యాకేజీ పనులకు గతంలో 30, 35 మంది కార్మికులతో చేపట్టే చోట ప్రస్తుతం ఐదుగురికి మించి లేకపోవడంతో స్టాక్‌ను మార్కెట్లకు తీసుకురావడం సైతం ఇబ్బందిగా మారిందని బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన ఓ సూపర్‌ మార్కెట్‌ మేనేజర్‌ ఒకరు వెల్లడించారు. దీంతో తమ మార్కెట్‌కు వచ్చే వారు సగం సరుకులే కొనుగోలు చేసి వెళుతున్నారని వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top