మార్మోగిన శివనామ స్మరణ

shivaratri was celebrated grandly in adilabad - Sakshi

ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

కిటకిటలాడిన ఆలయాలు  

నేరడిగొండ(బోథ్‌) : ఓం నమఃశివాయ.. శంభో శంకర.. హరహర మహాదేవా.. అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మండలంలోని శివాలయాల్లో భక్తులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వడూర్‌ గ్రామంలోని శివలింగాయనం, మహాదేవుని ఆలయం, కుమారి, సవర్గాం గ్రామాల్లో రాజరాజేశ్వర ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన సోమేశ్వర ఆలయంలో శివలింగం, నందీశ్వర విగ్రహాలకు అభిషేకంతోపాటు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలతోపాటు మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి గుహలోని శివలింగం, నందీశ్వర విగ్రహాలకు మొక్కులు చెల్లించారు. 

శివరాత్రికి మాత్రమే దర్శనం..

కుంటాల జలపాతం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలో శివలింగం, నందీశ్వరుడిని దర్శించుకోవాలంటే మహా శివరాత్రి సందర్భంగా రెండు రోజులపాటు దర్శనానికి వీలుంటుంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు.  

కనిపించని వసతులు..

కుంటాల జలపాతం వద్ద మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏటా ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఈసారి జాతరలో కనీస వసతులు కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దర్శనానికి వెళ్లే భక్తులకు నీటి సౌకర్యం కల్పించకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. నేరడిగొండ, సిరికొండ ఎస్సైలు వెంకన్న, రాముగౌడ్‌ కుటుంబ సభ్యులు సోమేశ్వరుని దర్శించుకున్నారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top