ఆ చెక్‌పోస్టులు.. అంతేనా! | Sakshi
Sakshi News home page

ఆ చెక్‌పోస్టులు.. అంతేనా!

Published Wed, Nov 29 2017 4:36 AM

senior officers who do not care for five months at checkposts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులను ‘క్లియర్‌’ చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. తమ శాఖ ఆధ్వర్యంలోని 12 చెక్‌ పోస్టులను మూసేసి 5 నెలలవుతున్నా కోట్ల రూపాయల విలువ చేసే ఆ చెక్‌ పోస్టుల్లోని వస్తువులను మాత్రం వదిలేసింది. చెక్‌ పోస్టులను రద్దు చేయడానికి కొంతకాలం ముందే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఐటీ పరికరాలు, ఇతర సామగ్రిని కనీసం కాపలా లేకుండా గాలికొదిలేయడంపై విమర్శలు వస్తున్నాయి. చెక్‌పోస్టుల్లోని సామగ్రినే కాదు అక్కడ పనిచేసి వచ్చిన ఉద్యోగుల వేతనాల విషయంలోనూ గందరగోళ వైఖరిని అవలంబిస్తోంది. 

కనీస ‘చెక్‌’ లేదు 
వాస్తవానికి, జీఎస్టీ అమల్లోకి రాక ముందు రాష్ట్ర నలుమూలలా 12 చెక్‌ పోస్టులుండేవి. భైంసా, వాంకిడి, మద్నూరు, చిరాగ్‌పల్లి, జహీరాబాద్, కోదాడ, విష్ణుపురం, నాగార్జునసాగర్, తుంగభద్ర, పాల్వంచ, కల్లూరు, అశ్వారావుపేటల్లో ఉన్న ఈ చెక్‌పోస్టులను జీఎస్టీ అమల్లోకి వచ్చిన జూలై 1 అర్ధరాత్రి నుంచే మూసేశారు. వాణిజ్య తనిఖీలు జరిగే చెక్‌ పోస్టులను ఎత్తేయాలన్న కేంద్ర నిర్ణయంతో ఇక్కడ కూడా చెక్‌పోస్టులను మూసేశారు. అక్కడ వదిలేసి వచ్చిన సీసీ కెమెరాలు, ఐటీ పరికరాలు, కుర్చీలు, బల్లలు, ఇతర ఫర్నిచర్‌ సరిచూసుకునేందుకు కూడా యత్నించకపోవడం వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి దర్పణంగా నిలుస్తోంది. అక్కడ ఉండే జీపులను కూడా హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఓ మూలన పడేశారు తప్ప వాటిని వాడేందుకు కూడా ప్రయత్నించకపోవడం గమనార్హం. మొత్తం వీటి విలువ రూ.15 కోట్లకు పైగానే ఉంటుందని తెలిసినా.. తిరిగి వాడుకునే వీలున్నా మూలన పడేయడంపై ఆ శాఖ వర్గాల్లోనే విమర్శలు వస్తున్నాయి.  

సిబ్బందిదీ అదే స్థితి 
చెక్‌పోస్టుల వద్ద పనిచేసే సిబ్బందికి వేరే విధులు కేటాయించారు. అయితే ఎక్కడ పనిచేస్తే అక్కడి సౌకర్యాలు, హెచ్‌ఆర్‌ఏ లాంటివి వర్తింపజేయకుండా పాత స్థానంలో ఉన్న సౌకర్యాలు, హెచ్‌ఆర్‌ఏలే ఇస్తుండటం గమనార్హం. అలా చెక్‌పోస్టుల నుంచి వచ్చిన సిబ్బందిలో ఐదుగురిని విలీనం చేసుకోకుండా డిçప్యుటేషన్‌ అంటూ విధుల్లో కొనసాగిస్తుండటంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వ సిబ్బందికి ఇచ్చే వాహన భత్యం విషయంలోనూ వీరి పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఓ సర్కిల్‌లో చెక్‌పోస్టుల నుం చి వచ్చిన ఓ అధికారికి వాహన భత్యం ఇవ్వాలా వద్దా అనే విషయంలో ప్రభుత్వానికి ఫైల్‌ పంపడం గమనార్హం. అదే సర్కిల్‌లో పనిచేస్తున్న మరి కొంతమందికి కూడా డ్రైవింగ్‌ లైసెన్సులు లేవని, వాహనాల ఈసీ పుస్తకాలు లేవంటూ వాహన భత్యం నిలిపేశారని సమాచారం. 

Advertisement

తప్పక చదవండి

Advertisement