కొండచిలువతో సెల్ఫీ..

Selfie with Python - Sakshi

అక్రమంగా విక్రయించేందుకు యత్నం 

ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అటవీ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: కొండచిలువను చూస్తేనే వామ్మో అని భయపడతాం.. అలాంటిది ఓ వ్యక్తి దానిని నెల రోజులు ఇంట్లో దాయడంతోపాటు అక్రమంగా విక్రయించేందుకు యత్నించాడు. దీని కోసం ఏకంగా కొండచిలువతో సెల్ఫీ దిగి ఈ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సదరు వ్యక్తితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం చౌదరిగూడ గ్రామ పరిధిలోని వెంకటాద్రి టౌన్‌షిప్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే షరన్‌ మోసెస్‌ అనే యువకుడు కొండచిలువతోపాటు మరో పాము (బ్రాంజ్‌ బ్యాక్‌ స్నేక్‌)ను అక్రమంగా విక్రయించడం కోసం తన ఇంట్లో నెలరోజులుగా దాచి ఉంచాడు.

ఇదే టౌన్‌షిప్‌కు చెందిన అతని స్నేహితుడు వెనొరోస్‌ ప్రవీణ్‌ మోసెస్‌కి సహకరించాడు. కొనుగోలుదారులను ఆకర్షించడం కోసం ప్రవీణ్‌ కొండచిలువతో సెల్ఫీ దిగి.. ఫేస్‌బుక్, వాట్సాప్‌లో అప్‌లోడ్‌ చేశాడు. విషయం తెలుసుకున్న హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల అటవీశాఖ అక్రమ రవాణా బృందం నిరోధక అధికారులు తనిఖీలు చేపట్టి కొండచిలువతో పాటు, పామును స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులు వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద మోసెస్, ప్రవీణ్‌లను అరెస్ట్‌ చేసి రంగారెడ్డి జిల్లా మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. కొండచిలువ షెడ్యూల్‌–1 జాతికి చెందినది కావడంతో అక్రమంగా దానిని వద్ద ఉంచుకున్నా, అక్రమ వ్యాపారం చేసేందుకు ప్రయత్నించినా మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు కనిష్టంగా రూ. 10 వేలు అపరాధ రుసుము వసూలు చేయవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top