హమ్మయ్య..పంచుడయింది.. | Seats Sharing Came To End | Sakshi
Sakshi News home page

హమ్మయ్య..పంచుడయింది..

Nov 15 2018 2:10 PM | Updated on Mar 18 2019 9:02 PM

Seats Sharing Came To End - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సీట్ల లెక్క ఎట్టకేలకు పూర్తయింది. కాంగ్రెస్, మహాకూటమి భాగస్వామ్య పక్షాల పొత్తులో భాగంగా టీడీపీ రెండు.. సీపీఐ ఒకటి.. కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించి.. ఆ మేరకు అభ్యర్థులను సైతం ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితాలో మధిర అభ్యర్థిగా మల్లు భట్టి విక్రమార్కను ప్రకటించగా.. రెండో జాబితాలో పాలేరు అభ్యర్థిగా కందాళ ఉపేందర్‌రెడ్డిని ఖాయం చేసింది. దీంతో మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల ఎన్నికల సీట్ల సర్దుబాటు పూర్తయింది. కూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీకి చెందిన నామా నాగేశ్వరరావు బుధవారం జిల్లాకు చేరుకుని.. నామినేషన్‌ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

 ఇక మల్లు భట్టి విక్రమార్క, కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య రెండు, మూడు రోజుల్లో నామినేషన్‌ దాఖలుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. వైరా నుంచి మహాకూటమి తరఫున పోటీ చేయనున్న సీపీఐ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఇటీవల పార్టీలో చేరిన విజయ పేరును సీపీఐ ఖరారు చేసి.. ప్రకటించింది. 17 లేదా 18వ తేదీల్లో ఆమె నామినేషన్‌ వేయనున్నారు. ఇక జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ జరగనుంది. బీజేపీ ఇప్పటికే సత్తుపల్లి, వైరా, పాలేరుకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, మధిర అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. పాలేరు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌కు ఆ పార్టీ నుంచి తొలిసారిగా టికెట్‌ దక్కలేదు. దాదాపు 40 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉండి.. పాలేరు నుంచి అనేకసార్లు పోటీ చేసి.. పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన సంభానికి ఈసారి టికెట్‌ చేజారడంతో పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి గూడుకట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2009, 2014 ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన కందాళ ఉపేందర్‌రెడ్డి ఎట్టకేలకు ఈసారి టికెట్‌ దక్కించుకోగలిగారు. టికెట్‌ ఆశించి భంగపడిన కాంగ్రెస్‌ నేతలు పలువురు తమ రాజకీయ భవితవ్యంపై సమాలోచనల్లో పడ్డారు.
 
దూరంగా కాంగ్రెస్‌ వర్గాలు..

అయితే బుధవారం ఖమ్మం చేరుకున్న ఆ నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు పర్యటనకు కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలు దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పీసీసీ నుంచి నియమితులైన సంధ్యారెడ్డి, కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ వడ్డెబోయిన నరసింహారావు, మాజీ కౌన్సిలర్‌ కూల్‌హోం ప్రసాద్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా.. అనేక మంది ద్వితీయ శ్రేణి కాంగ్రెస్‌ నేతలు దూరంగా ఉండడం గమనార్హం. ఇక కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి అనుచరులు ఎవరూ నామా స్వాగత కార్యక్రమంలో పెద్దగా పాల్గొనలేదు. మానుకొండ రాధాకిషోర్‌ రఘునాథపాలెం మండలం బాలప్పేటలో తన ఇంటివద్ద బుధవారం ముఖ్య కార్యకర్తలతో సమాలోచనలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయాలంటూ ఆయనపై కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఒత్తిడి తేవడంతో గురువారం ముఖ్యనేతలతో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి దృష్టికి కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకెళ్లి నిర్ణయం తీసుకుందామని రాధాకిషోర్‌ ద్వితీయ శ్రేణి నేతలకు చెప్పినట్లు సమాచారం.

 కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన వద్దిరాజు రవిచంద్రను సైతం ఆయన వర్గీయులు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పోట్ల నాగేశ్వరరావు కూడా తన అనుచరులతో సమావేశమై.. ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. తమ నేతకు టికెట్‌ రాలేదనే ఆవేదనతో ఆయా వర్గాల ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు అంటీ ముట్టనట్లుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వర్గ రాజకీయాలకు కేంద్రంగా ఉండే ఖమ్మం కాంగ్రెస్‌లో అన్ని వర్గాలను కలుపుకుపోవడం ఇప్పుడు నామాకు ఒక సవాల్‌గా పరిణమించనున్నది. కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటింగ్‌ కలిగి ఉన్న ఖమ్మంలో ఆ పార్టీ శ్రేణులను తమవైపు తిప్పుకోవడానికి ఏ పరిస్థితుల్లో తాను పోటీ చేస్తోంది వివరించడానికి మహాకూటమి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఆయా నేతలను బుజ్జగించి.. సర్దిచెప్పే పనిలో నిమగ్నమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇక వైరాలో కాంగ్రెస్‌ టికెట్‌ ను తొలి నుంచి ఆశిస్తున్న రాములునాయక్‌ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించేందుకు కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణి నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ మదన్‌లాల్‌పై సొంత పార్టీలో అసంతృప్తి ఉండడం, అనేక మంది టీఆర్‌ఎస్‌ ద్వితీయ శ్రేణి నేతలు ప్రచారానికి దూరంగా ఉండడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్‌లోని ఒక వర్గం రాములునాయక్‌ను ఎన్నికల బరిలోకి దించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.

 ఇక పాలేరులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందాళ ఉపేందర్‌రెడ్డి నియోజకవర్గానికి స్థానికుడు కావడం, పార్టీ శ్రేణులతో పరిచయాలు ఉండడం, కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటుండడం వంటి అంశాలు తమకు కలిసొస్తాయని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ, సీపీఐ సైతం ఈ నియోజకవర్గంలో ఆయా మండలాల్లో ప్రభావం చూపే అవకాశం ఉండడంతో వారిని తన విజయానికి కృషి చేసేలా ఒప్పించేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా.. నామినేషన్‌ దాఖలుకు 19వ తేదీ వరకు సమయం ఉండడంతో ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ తరఫున ఎవరు తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో ఉంటారోననే అనుమానం ఆయా పార్టీల నేతలను వేధిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement